Drinking Water | మరికల్, ఏప్రిల్ 06 : మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో మంచినీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల క్రితం మిషన్ భగీరథ గేట్ వాల్లో లోపం తలెత్తడంతో గ్రామానికి మంచినీటీ సరఫరా నిలిచిపోయింది. గ్రామపంచాయతీ దగ్గర ఉన్న బోరు నుండి నీటిని పట్టుకునేందుకు గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. అసలే వేసవి కాలం.. ఆపై నీటి ఎద్దడితో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నీటి ఎద్దడి విషయమై మహిళలు గ్రామపంచాయతీ కార్యదర్శిని అడుగగా పంచాయతీలో నిధుల లేమితో మరమ్మతులు చేసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ మంచినీటి పైపులకు సంబంధించిన గేట్ వాల్ మరమ్మతులు చేసి గ్రామానికి మంచినీరు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.