గద్వాల, జూలై 2 : జూరా ల ప్రాజెక్టు భద్రతపై అందరికీ అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి. ప్రాజెక్టు భద్రమేనా? అంటే అధికారులు, ఇటు పాలకులు సరైన సమాధానాలు చెప్పక నీళ్లు నములుతున్నారు. దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. డ్యాం కింది భాగంలో పరిశీలన చేయడానికి లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కిందికి దిగి పరిశీలన చేసి డ్యాం సీఫేజీ లీకేజీ, మట్టి పూడిక తదితర విషయాలు తెలుసుకోవడానికి లిఫ్ట్‌ల ద్వారా అధికారులు కింద పరిశీలించే వారు. ప్రస్తు తం ఆ లిఫ్ట్‌లు పని చేయకపోవడంతో అధికారులు కిందికి వెళ్లకపోవడంతో డ్యాం సేఫ్టీ పరిశీలనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే కూడా ఆరోపణలు చేసిన సంగతి విదితమే. డ్యాం కింది భాగంలో సిల్ట్ పేరుకుపోయిందని, దీంతో ఒండ్రు దిగువకు వెళ్లడానికి ఆస్కారం లేదని, ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నదని పత్రికల ద్వారా తెలిపారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నా.. వారు స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు వాస్తవమని అందరూ భావిస్తున్నారు. ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉన్నది.
ఈ ప్రాజెక్టు నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లాకు మిషన్‌భగీరథ నీటితోపాటు గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ తదితర నియోజకవర్గాలకు సాగునీరు అందుతున్నది. దీంతోపాటు కృష్ణమ్మ తెలంగాణలో ప్రవేశించిన తర్వాత నదిపై మొట్టమొదటిగా కట్టిన ఏకైక ప్రాజెక్టు ఇదే. అందుకే ఈ డ్యాంను పరిరక్షించుకోవాల్సి బాధ్యత పాలకులపై ఉన్నది. అయితే ఆ దిశగా పాలకులు గానీ.. అధికారులు గానీ.. చొరవ చూపడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి ఏడాది చివరిలో డ్యాం సేఫ్టీ అధికారులు వచ్చి ప్రాజె క్టు పరిశీలన చేశాక ఎలాంటి మరమ్మతులు చేయాలో వాటి గురించి ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేసి వె ళ్తుంటారు. అందుకు అవసరమైన నిధులు ఏ ప్రభుత్వాలు వచ్చినా విడుదల చేస్తున్నాయి. ఈ ఏడాది గేట్లు, రోప్‌ల మరమ్మతులు, గ్రీస్ పూత.. వంటి వాటికి సుమారు రూ. కోటి నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అధికారులు పనులు చేయించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే సకాలంలో పూర్తి కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి.
ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే సాంకేతిక పనులు చేసే కాంట్రాక్టకర్లు తక్కువగా ఉండడంతో పనులు త్వరగా చేయలేకపోయామని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంతో వారికే తెలియాలి. ప్రతి ఏడాది ప్రాజెక్టు రిపేర్ల మేరకు సుమారు రూ.30 లక్షలు మొదలుకొని రూ. కోటి దాకా వస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు.. కానీ పనులు మాత్రం జరగడం లేదన్న విమర్శలున్నాయి. అ యినా అధికారులు మాత్రం మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటో.. దీంతో నిజంగానే ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నదన్న అనుమానా లు వ్యక్తమయ్యే అవకాశం ఉన్నది.
స్పిల్‌వే డ్యాం గేట్లకు ఉన్న రోప్స్ తెగినా ప్రమాదం లేదని ఇరిగేషన్ అధికారుల మాటల్లో అసలు వాస్తవం ఉందా..? అంటే లేదనే చెప్పాలి. రోప్‌లు తెగిన విషయం అందరి కళ్లకు కట్టినట్లు ఉన్నా.. ప్రమాదం లేదని చెప్పడం వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా..? అన్న అనుమానం కలగక మానాదు. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన నీటి పారుదల శాఖ మంత్రి కూడా దీనిపై పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకుండా, ఇరిగేషన్ అధికారులతో ఎటువంటి ప్రమాదం లేదనే చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టుకు మొత్తం 64 గేట్లు ఉండగా.. వీటిలో 8, 9, 12, 24, 25, 31, 35 గేట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రోప్‌లు కట్ అయ్యాయి. ఇది అందరికీ తెలిసిందే. అయి నా ప్రమాదం లేదనే అంటున్నారు.
2009లో వరదలు వచ్చిన సమయంలో అన్ని గేట్లు తెరిచి 12 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉండడం.. మళ్లా గతంలో వచ్చినట్లు వరద వస్తే ఇప్పటికే రోప్స్ తెగిపోవడంతో గేట్లను ఎలా తెరుస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 13, 23, 25, 31, 41, 54 గేట్లకు సంబంధించి రూప్లు లూజు అయ్యాయి. ప్రస్తుతం వరద వస్తున్న క్రమంలో వాటిని బిగించే పరిస్థితి కనిపించడం లేదు. 22, 23, 27, 28, 33, 35, 36, 37, 40, 41, 42, 49, 56, 58వ గేట్ల ద్వారా వాటర్ లీకేజీలు అవుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది గేట్ల రిపేర్లకు ప్రభుత్వం ఒక్కో గేటుకు రూ.11 లక్షల చొప్పున 8 గేట్ల రోప్‌లు మార్చడానికి అధికారులు పనులు ప్రారంభించారు.
ఇందులో 28, 41, 45, 51వ గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. 8, 12, 19, 27వ గేట్ల రోప్ పనులు చేయాల్సి ఉన్నది. ప్రాజెక్టుకు వరదలు రావడంతో పనులు ఈ ఏడాది కూడా అయ్యేలా కనిపించడం లేదు. ఈ గేట్ల మరమ్మతులు, తెగిన రోప్‌ల విషయాలు పూర్తిగా తెలియాలంటే డ్యాం సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి నిజాలు బయట పె డితే తప్పా వాస్తవాలు అందరికీ తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చే యాలని ప్రజలు, రైతులు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుపై భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉన్నదని భయం అందరిలో కలుగుతున్నది. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాలను నిషేధిస్తే తప్పా ప్రాజెక్టుకు కాపాడుకోలేని పరిస్థితి. భారీ వాహనాల వెళ్తుండడంతో బ్రిడ్జిపై అక్కడక్కడ గుంతలు పడ్డాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి భారీ వాహనాల రాకపోకలను నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే క్రమంలో ప్రాజెక్టు భద్రతపై పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.