జోగులాంబ గద్వాల : జిల్లాలో రెండు పడక గదుల ( Double bedroom ) ఇళ్లను అర్హులైన లబ్దిదారులకు కేటాయించేందుకు అన్ని హంగులతో వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ (Collector BM Santosh) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు.
ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలను ప్రారంభించే విధంగా మిగిలి ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. పట్టణంలోని దాదర్ పల్లి వద్ద నిర్మించిన 715 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు విద్యుత్, నీటి కనెక్షన్లు, పెయింటింగ్ పనులలను పూర్తి చేయాలని ఆదేశించారు.
నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ పునః పరిశీలించుకుని లబ్ధిదారుల మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఈ కాశీనాథ్, ఈఈ పీఆర్ దామోదర్, విద్యుత్ శాఖ డీఈ తిరుపతిరావు, మున్సిపల్ కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.