Mango Farm | కొల్లాపూర్, ఫిబ్రవరి 14 : మ్యాంగో ఫ్రూట్ కవర్లను 50 శాతం సబ్సిడీపై మామిడి రైతులకు అందించడం జరుగుతుందని కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్, ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామ రైతు వేదికలో ఉద్యాన పంటలపై ముఖ్యంగా మామిడి పూత, పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపైన రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం పక్కనే ఉన్న మామిడి తోటను అధికారులు సందర్శించారు.
ఇందులో ముఖ్యంగా మామిడి తోటల్లో పూత దశలో తామర ఉధృతి గమనించినట్లు పేర్కొన్నారు. వీటి నివారణకు fipronil 80%@0.3gr , Thiomethaxam @0.3gr, imidacloprid@0.3 ml పది రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేసుకోవాలన్నారు. అంతేకాకుండా కాయలను ఈ తామర పురుగులు తినడం జరుగుతుందన్నారు. మామిడి కవర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పూత నుండి పిందె ఏర్పడిన తర్వాత పసుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుందని, ఇది ముఖ్యంగా వాతావరణంలోని మార్పుల ద్వారా, సూక్ష్మ పోషకాల లోపం ద్వారా, హార్మోనుల అసమానతుల్యత ద్వారా జరుగుతుందన్నారు. వీటి నివారణకు కాయ బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు 10 సంవత్సరాల చెట్టుకు 700 గ్రా, పొటాష్ 600 గ్రా, యూరియా 400 గ్రాములు ప్రతి చెట్టుకు అందించి నీటిని ఇవ్వాలన్నారు. అంతేకాకుండా 13.0.45@5గ్రా + ఫార్ములా -4@5గ్రా + planofix @0.25 ml ఒక లీడర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మామిడి కాయ నిమ్మకాయ సైజులో ఉన్నప్పటి నుంచి పండు ఈగ బుట్టలను ఒక ఎకరానికి పది చొప్పున అమర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఏరియా మేనేజర్ వి రాకేష్, కోరమండల్ మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, శివ ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్స్ చంద్రశేఖర్, రాము గోవర్ధన్ కుడికిల్ల గ్రామ పెద్దలు, మామిడి రైతులు పాల్గొన్నారు.