మూసాపేట, మే 13 : బండి సంజయ్ వంటి కొందరు దొంగలు ఏకమై రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, మంచిని చెడుగా చెబుతూ.. నిజాన్ని అబద్ధం చేయాలని కుట్రలు పన్నుతున్నట్లు దేవరకద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. నిజాన్ని ప్రజలకు వివరించకుంటే అబద్దం కూడా నిజమవుతుందన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.2 కోట్లకు సంబంధించిన ప్రొసీడింగ్‌లను శనివారం మూసాపేట రైతు వేదికలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరివెన రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు 6 వేల ఎకరాలను ఇచ్చారని, వారంతా చరిత్రలో నిలిచిపోతారన్నారు. రైతుల త్యాగం వృథా కానివ్వమన్నారు.
కరివెన రిజర్వాయర్ నిర్మాణానికి మట్టి ఎక్కడైనా లభిస్తుందని, కానీ చెరువుల నుంచి మట్టిని తీసుకుంటే రైతులకే మేలు జరుగుతుందన్నారు. చెరువుల్లో పూడికతీయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో మట్టిని తీసే అవకాశం మరోసారి రాదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిపై ప్రజలు తిరగబడి చెప్పుతో కొట్టాలని, అప్పుడే ఇలాంటి పనులు చేసేందుకు మరొకరు రావాలంటే భయపడుతారన్నారు. కరివెన ప్రాజెక్టుపై కేసులు వేసిన వ్యక్తి.. ఇన్నాళ్లకు గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగితే తరిమికొట్టాలన్నారు.
2014 నుంచి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, మూసాపేట పాఠశాల చైర్మన్ తిరుపతయ్య, కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ జమీర్, శివరాములు, రఘుపతిరెడ్డి, మల్లయ్య, సర్పంచులు స్వరూప, చంద్రశేఖర్, శ్రీనివాసులు, లక్ష్మణ్, బాలన్న, ప్రకాశ్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, మధు, రవీందర్‌గౌడ్, భీమయ్య, కండ్యానాయక్, గోవిందుగారి సాగర్, కృపాకర్‌రెడ్డి, రవి, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.