Gas cylinder price | మహబూబ్‌నగర్, ఆగస్టు 9 : కట్టెల పొయ్యి వాడకండి.. ఉచితంగా సిలిండర్ ఇస్తాం.. పొయ్యి ఇస్తామంటూ కేంద్రప్రభుత్వం పేదలకు ఆశ చూపింది. రేషన్, ఆధార్‌కార్డులు చూపి ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకునే వరకు బాగానే ఉంది. బీజేపీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర కేవలం రూ.450 ఉండేది. సబ్సిడీ మొత్తం నేరుగా గ్యాస్ కంపెనీలకు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లో సబ్సిడీ జమ చేసేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించింది. కాలక్రమేనా పూర్తిస్థాయిలో సబ్సిడీని ఎత్తివేసి పేదల కడుపు కొడుతున్నది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,158కు చేరింది. ఈమేరకు డబ్బులు చెల్లించడంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్లీ కట్టెలపొయ్యి ఏర్పాటు చేసుకునేలా ప్రజల ఆలోచనా విధానం మారుతున్నది. అదేవిధంగా గ్యాస్ కంపెనీల నిర్వాహకులు చేస్తున్న అదనపు వసూళ్లు వినియోగదారుడికి తలనొప్పిగా మారింది. లబ్ధిదారుడు ఖాతాలో కేంద్రం ప్రస్తుతం రూ.40.20 జమ చేస్తున్నది. సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ పేదలపై పెనుభారం మోపింది.
ఊపందుకుంటున్న సిలిండర్ ధర..
గ్యాస్ సిలిండర్ ధర రోజురోజుకూ హద్దూఅదుపు లేకుండా పెరుగుతున్నది. ఉచిత కనెక్షన్ల పేరిట అందరి ఇండ్లల్లోనూ గ్యాస్ వినియోగం కొనసాగుతున్నది. కాగా సిలిండర్ ధర రూ.1,158.50 ఉంటే ఎలా వంట చేసుకోవాలి? అనే ప్రశ్న అందరి మదిలో మొదులుతున్నది.
అదనపు వసూళ్లు ఎందుకు?
గ్యాస్ ధర వినియోగదారుడికి అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో సిలిండర్ డెలివరీ సమయంలో అదనపు చార్జీలు ఎందుకు చేస్తున్నారు? కచ్చితంగా సర్వీస్ చార్జీ ఇవ్వాల్సిందేనని డెలివరీ బాయ్స్ అనడంపై కంపెనీల యజమానులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గ్యాస్ ధరకు అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే గ్యాస్ సరఫరా చేసినందుకు ఇవ్వాలంటున్నారని వినియోగదారులు చెబుతున్నారు. రూ.20, రూ.30 కదా అనుకుంటే జిల్లా వ్యాప్తంగా 1,51,191 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్‌పీ, ఇండియన్, భారత్ కంపెనీలకు సంబంధించి 23 ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతున్నది.
పట్టించుకోని యంత్రాంగం..
ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అదనపు వసూళ్లపై పర్యవేక్షణ కరువైందని వినియోగదారులు వాపోతున్నారు. తక్కువ వేతనానికి డెలివరీ బాయ్స్‌ను నియమించుకొని బయట మీరు తీసుకోవచ్చనే తీరుగా కంపెనీల యజమానులు చెబుతున్నట్లు సమాచారం. దీంతో వారు అందిన కాడికి వినియోగదారుడి జేబుకు చిల్లులు పెడుతున్నారు. ఇప్పటికైనా గ్యాస్ కంపెనీల నిర్వాహకులతో అధికార యంత్రాంగం సమావేశమై చర్యలు తీసుకోవాలి.
చర్యలు తీసుకుంటాం..
నిబంధనల మేరకు గ్యాస్ సరఫరా చేయాలి. అదనంగా వసూళ్లు చేయొద్దు. అలా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు ప్రజలకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలి. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీలపై ఉంది. పర్యవేక్షణ చేసి నిబంధనల ప్రకారం సరఫరా చేయని వారిపై చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్, డీఎం, మహబూబ్‌నగర్
అదనపు చార్జీలు అడగొద్దు..
గ్యాస్ ధర తగ్గించాలి. సరఫరా చేస్తున్న కంపెనీలు సైతం అదనంగా డబ్బులు అడగకూడదు. ఈ విషయాన్ని అధికారులు కొంచం సీరియస్‌గా తీసుకోవాలి. గ్యాస్ ధరలు చాలా పెరిగాయి. ఇలా అయితే సిలిండర్ కొనుగోలు చేయడం కష్టమవుతుంది. ఇకనైనా పేదలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆలోచన చేయాలి.
– గోవర్ధన్, వినియోగదారుడు, మహబూబ్‌నగర్