గద్వాల, జనవరి 8 : యాసంగి రైతులకు తీపికబురు అందింది. సాగయ్యే పంటలకు నీటి ఢోకా లే కుండా సరిపడా సాగునీరు అందించాలని రాష్ట్ర స్థా యి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ అధ్యక్షతన జలసౌధలో సమావేశమైన కమి టీ ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత.. ఎగువ నుంచి రానున్న ప్రవాహాన్ని అంచనా వేసి నీటి ప్రణాళికను విడుదల చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో వివి ధ ప్రాజెక్టుల కింద యాసంగిలో సుమారు 96,645 ఎకరాలకు నీళ్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గతేడాది వానకాలంలో సమృద్ధిగా వానలు కురవడంతో జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్య త ఆధారంగా ప్రభుత్వం యాసంగి పంటలకు నీళ్లించేందుకు సిద్ధమైంది. దీంతో ఈ ఏడాది పంటలు సాగు చేసే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవు.
గత ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో యాసంగి పంటల సాగు నాటికి ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గిపోయాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల్లో నీరులేక పోవడంతో ఆ ప్రాజెక్టుల కింద పంటలకు క్రాప్‌హాలీడే కూడా ప్రకటించారు. గద్వాల జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు, గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్ రిజర్వాయర్‌లో నీళ్లు అడుగంటాయి. దీంతో 15 ఏండ్ల తర్వాత మొదటి సారి గతేడాది యాసంగిలో అధికారులు క్రాప్ హాలీడే ప్ర కటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత మొదటి ఏడాదిలోనే వర్షాలు కురకవపోవడం రైతులు ఇబ్బందులు పడ్డారు.
దీనికితోడు గత వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ప్రభు త్వం రైతు భరోసా ఇవ్వకపోవడం.. యాసంగి సీజన్లో క్రాప్‌హాలీడే ప్రకటించడంతో కర్షకులు పంటలు పండక.. చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అయితే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడం.. ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద రావ డం.. పంటలు బాగా పండడంతో రైతులకు కొంత ఊరట లభించింది. యాసంగి విషయానికొస్తే వివిధ ప్రాజెక్టుల ఆయకట్టు పంటలకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో రైతులు పంటలు సాగు పనులు మొదలు పెట్టారు.
రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాలన్న వివరాలను అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ ద్వారా 34,345 ఎకరాలకు.. నెట్టెంపాడు ప్రాజెక్టు (గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్) పరిధిలో 24,800 ఎకరాలకు, ఆర్డీఎస్ పరిధిలో 37,500 ఎకరాలకు అం దించాలని నిర్ణయించారు. అలాగే చెరువులు, చిన్న ఎత్తిపోతల పథకాల కింద సాగునీరు అందించనున్నారు. 2025 ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ యాసంగి పంటలకు సాగునీటి ఢోకా ఉండదు.
జూరాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్ ప్రాజెక్టుల కింద వారబంది ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల ఎస్ఈ రహిముద్దీన్ తెలిపారు. పీజేపీ కుడి కాల్వ కింద డీ-31 వరకు నీటిని అందిస్తామన్నారు. వారంలో నాలుగు రోజులుపాటు నీటిని విడుదల చేస్తామని, మరో మూడు రోజులు నిలిపివేస్తామన్నారు. రైతులు కేవ లం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని సూచించారు. నెట్టెంపాడు లిఫ్ట్ కింద డీ-2, డీ-5 పరిధిలో నీటిని అందిస్తామన్నారు. అయితే నాలుగు రోజులు అందించి.. ఆరు రోజులు నిలిపి వేస్తామని తెలిపారు. ఆర్డీఎస్ పరిధిలో డీ-30 వరకు సాగునీళ్లు పారిస్తామని చెప్పారు.
రైతులు నీటిని పొదుపుగా వాడుకొని ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలన్నారు. ఆర్డీఎస్ కింద రైతుల అవసరం మేరకు మాత్రమే విడుదల చేస్తామని తెలిపారు. తుమ్మిళ్ల పంపులకు నీరు అందకపోవడం వల్ల రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆర్డీఎస్కు 5.9 టీఎంసీల నీటి అలాట్మెంట్ ఉందని, ప్ర స్తుతం ఆర్డీఎస్ ద్వారా 1.04 టీఎంసీలు వి డుదల చేశారన్నారు. కర్ణాటక నుంచి రీ జనరేటర్ వాటర్ అనుకున్న స్థాయిలో రానందువల్ల జూరాల పరిధిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలన్నారు.