కొల్లాపూర్, సెస్టెంబర్ 26 : కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది తీరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక శోభను తీసుకొచ్చింది. సమైక్య రాష్ట్రంలో మౌలిక వసతులకు నోచుకోని కొల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో కొత్త పుం తలు తొక్కింది. కొల్లాపూర్ మండలంలోని దట్టమైన నల్లమల అటవీ మధ్యలో కృష్ణానది తీరంలో ఉన్న సోమశిలకు తీరం వెంట కాటేజీలు, హరిత హోటల్ ఏర్పాటు చేయడంతో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు, కృష్ణానది సోయగాలను ప్రపంచానికి చాటేందుకు భారీ ప్రచారం నిర్వహించింది.
దీంతో సోమశిలకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ఏర్పాటు చేయడంతోపాటు సోమశిలకు వెళ్లే దారిలో ఏకో పార్కును కూడా ఏర్పాటు చేసి సఫారీ సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లే లాంచీ ఆగిపోయింది. దీంతో దానిని ప్రారంభించాలని పర్యాటకులు కోరుతున్నారు.