గట్టు : ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ ( Silver Jubilee Celebration ) సభతో కాంగ్రెస్లో వణుకు పుట్టడం ఖాయమని బీఆర్ఎస్ (BRS ) గద్వాల నియోజకవర్గం నాయకులు బాసు హన్మంత్ (Basu Hanmanth ) అన్నారు. మండలంలోని బోయలగూడెంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బోయలగూడెం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి మాటాలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు మినహా ఏ హామీలు అమలు కాలేదని విమర్శించారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి రైతులకు రిక్తహస్తం చూయించిందని ఆరోపించారు. రైతుబంధు పథకం నత్తకు నడక నేర్పుతోందని విమర్శించారు .
వరంగల్ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార వాహనానికి పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు , మాజీ జడ్పీటీసీ బాసు శ్యామల, అంగడి బసవరాజ్ ,చక్రధర్ రావు, మోనేష్, శేఖర్ నాయుడు, వెంకటేష్ నాయుడు, గంజిపేట్ రాజు, జై సింహారెడ్డి, రామునాయుడు , బాసు గోపాల్, రాజు నాయుడు, శ్రీరాములు , తిరుమలేష్, రాయపురం వీరేష్, వాల్మీకి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.