అమరచింత, జూన్ 3 : అమరచింత మున్సిపాలిటీలో ఓ వ్యక్తి పురపాలిక అనునుతి లేకుండా ఇంటి నిర్మాణ పనులు చేయడంతోపాటు డ్రైనేజీని సైతం ఆక్రమించడంతో మున్సిపల్ కమిషనర్ రవిబాబు నిర్మాణ పనులు అడ్డుకున్నాడు. దీంతో మున్సిపల్ కమిషనర్‌కు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పీఏ వెంకటేశ్ ఫోన్ చేసి బెదిరించిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది.
మున్సిపల్ కమిషనర్ రవిబాబు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో తోకలి శంకర్ అనే వ్యక్తి మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అంతేకాకుండా రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీని సైతం కూల్చి అందులో పిల్లర్ వేసి పనులు చేపడుతుండడంతో కాలనీవాసుల సమాచారం మేరకు వార్డు ఆఫీసర్‌తో కలిసి వెళ్లి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతి చూపించాలని కోరానన్నారు.
అయితే అమరచింత గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నానని చెప్పడంతో ప్రభుత్వ నిబంధనలు అతిక్రించినట్లు భావించి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో పనులు నిలిపివేసిన యజమాని మంగళవారం కూల్చివేసిన డ్రైనేజీపై మళ్లీ రెండు ఫీట్ల వరకు గోడ నిర్మించడంతో తాము వెళ్లి కాలనీవాసులకు ఇబ్బంది కలిగేలా ఉన్న నిర్మాణాన్ని ఆపాలని సూచించినట్లు చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పీఏ వెంకటేశ్ తనకు ఫోన్ చేసి మా అనుమతి లేకుండా అక్కడికి ఎందుకు వెళ్లావని, తక్షణమే అక్కడి నుంచి వెళ్లకపోతే నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్లో బెదిరించడంతో వెనుదిరిగి వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటానని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.