అచ్చంపేట రూరల్ : ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ల వేతనాలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ( CITU ) జిల్లా నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ చాలిచాలని వేతనాలతో 12 గంటలు పని చేస్తున్న ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లకు ( Private RTC Drivers ) యాజమాన్యం వేతనాలు పెంచకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అచ్చంపేట ఆర్టీసీ డీఎం జోక్యం చేసుకొని చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యమం, ప్రమాద బీమా, ఆర్టీసీ బస్సులలో ఉచిత పాసు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీహరి, సుధాకర్, గణేష్, డ్రైవర్లు పాల్గొన్నారు.