గద్వాల జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రావడంతో పట్టణమంతా గులాబీ కాంతులీనింది. బీఆర్ఎస్ పార్టీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల కటౌట్లతో గద్వాల గులాబీశోభితమైంది. కలెక్టరేట్లో కలెక్టర్ క్రాంతి, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సృజన, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్డ్డిని సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. అనంతరం అయిజ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభకు రెండు నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ మొత్తంలో తరలొచ్చారు.
గట్టు, జూన్ 12 : గద్వాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం బస్సులో నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించారు. అనంతరం కేసీఆర్ స్టడీ సర్కిల్‌కు చేరుకోగా యువతకు అందిస్తున్న సేవలను నిర్వాహకురాలను బండ్ల జ్యోతి సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.
గద్వాల అర్బన్, జూన్ 12 : గద్వాల పట్టణంలోని పీజేపీ క్యాంపులో రూ.38.5కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ సోమవారం ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి పోలీస్ వందనం స్వీకరించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎస్పీ చాంబర్లో సృజనను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. అనంతరం ఎస్పీ కుటుంబసభ్యులు సీఎంకు మొక్కను అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులున్నారు.
గద్వాల, జూన్ 12 : జిల్లాకేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, సీఎస్ శాంతికుమారితో కలిసి సోమవారం ప్రారంభించారు. సాయంత్రం 5:10 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్న కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం 5:15 గంటలకు కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పూజ అనంతరం 5:19 గంటలకు కలెక్టర్ వల్లూరు క్రాంతిని సీఎం కేసీఆర్ కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం చాంబర్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు.