ఊట్కూర్ ఏప్రిల్ 07: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని తిప్రాస్ పల్లి గ్రామంలో నాభిశిల బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 6 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ బొడ్రాయిని ప్రతిష్టించారు. గ్రామ పెద్దల సమక్షంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అగ్ని ప్రతిష్టాపన, హోమం, బొడ్రాయి ఊరేగింపు, అభిషేకం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో ఊరేగింపుగా వెళ్లి స్థానిక దళిత కాలనీ, బీసీ వాడలో ప్రతిష్టించిన బొడ్రాయి దేవతమూర్తులకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ సుమంగళ, మాజీ జెడ్పిటిసి అశోక్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కావలి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పూజ కార్యక్రమంలో పాల్గొని విగ్రహ మూర్తులను దర్శించుకున్నారు. గ్రామ సీమల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రజలు తాగునీరు, మౌలిక సమస్యలతో సతమతమవుతున్నారని, ఉపాధి లేక ప్రజలు వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కులమత భేదాలకు అతీతంగా గ్రామస్తులు కలిసికట్టుగా బొడ్రాయి ఉత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుమంగళ, మాజీ జెడ్పిటిసి సభ్యులు అశోక్ కుమార్ గౌడ్, అరవింద్ కుమార్, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సురేష్, శివారెడ్డి, గంగాధర్ చారి, శేఖర్ గౌడ్, ఉబేదుర్ రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.