కల్వకుర్తి /ఊర్కొండ 27 : నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి దారుణం చోటు చేసుకున్నది. పక్క గ్రామంలో పీర్ల పండుగను చూసి తిరిగి గ్రామానికి బైక్‌పై వస్తున్న యాదయ్య(50)ను గుర్తు తెలియని వ్యక్తులు దారికాచి పదునైన మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యాదయ్య అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వస్తే రేవల్లి గ్రామానికి చెందిన యాదయ్య మేస్త్రి ( సెంట్రింగ్) పనిచేసుకుంటూ జీవనంసాగిస్తున్నాడు. యాదయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
యాదయ్య శుక్రవారం రాత్రి పక్కగ్రామమైన బోయిన్‌పల్లిలో నిర్వహించిన పీర్ల పండుగ జాతర చూసి బైక్‌పై గ్రామానికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో యాదయ్య ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రమాదేవి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
సీఐ భీంకుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి కొద్దిదూరంలో మద్యం తాగిన ఆధారాలు ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. క్షుద్రపూజల అనుమానంతో యాదయ్యపై దాడి జరిగిందని గ్రామంలో ప్రచారం జరుగుతుంది. హత్యకు గత కారణాలను పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యాదయ్య దారుణ హత్యతో రేవల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.