ఊట్కూర్ : విద్యార్థులకు కేవలం చదువే భవిష్యత్తు కాకుండా క్రీడల పట్ల ప్రోత్సహించి, ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు విశ్రాంత పీఈటీ గోపాలం ( Gopalam ) చేస్తున్న కృషి అభినందనీయమని అంబత్రయ క్షేత్రం గురువు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ ( Aditya Parasri Swamy) అన్నారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామం అంబత్రయ క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులనుద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన పీఈటీ గోపాలం గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థులను గుర్తించి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేస్తున్నారని ప్రశంసించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయి సైక్లింగ్, ఖో ఖో, షూటింగ్, బాడ్మింటన్ పోటీల్లో పాల్గొని విజేతలైన 60 మంది క్రీడాకారులను, విశ్రాంత పీఈటీ గోపాలం, జాతీయ స్థాయి ఖో ఖో పోటీలో పాల్గొని ప్రశంస పత్రాలు పొందిన ఆయన కూతుళ్లు రూప, దీప, శిల్ప, పుష్పలను ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేసి శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు, కార్యదర్శి పీఈటీ రమేష్ కుమార్, పీడీ బి రూప, పెన్షనర్స్ సంఘం కార్యదర్శి బి. భాస్కర్, సామాజిక కార్యకర్త మహేష్ కుమార్ గౌడ్ , ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దొరోళ్ల కృష్ణయ్య, రాజు, అయ్యన్న, ఓబులేష్, వెంకటమ్మ ,శాంతమ్మ, మధుబాబు, త్రిశక్తి పీఠం స్వామిజీలు పాల్గొన్నారు.