గట్టు, నవంబర్ 11 : గట్టులో అంబాభవాని జాతర శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా విరాజిల్లుతున్నది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ, సోమవంశ సహస్రార్జున క్షత్రియ(ఎస్ఎస్కే) సమాజ్ ఏర్పాట్లు చేసింది. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. రథోత్సవం, ప్రభోత్సవం కోసం తేరులను ముస్తాబు చేశారు. 12వ తేదీ ఉదయం 8 గంటలకు నిర్వహించే పం దిరి పూజా కార్యక్రమం తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి 9 గంటలకు ప్రభోత్సవం, 13వ తేదీ ఉదయం 10 గంటలకు కళశ పూజ, 11 గంటలకు బిందె సేవ, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి 9 గంటలకు రథోత్సవం, 14వ తేదీన గ్రామంలోని పురవీధుల గుండా పల్లకీసేవ, 15వ తేదీన అమ్మవారికి జలాభిషేకం ని ర్వహించనున్నారు. కాగా, ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్నది.
అమ్మవారి మూలవిరాట్, ఆలయ ఆవరణలో వినాయకుడు, నవగ్రహాలు, అభయాంజనేయుడి విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మంగళ, శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఖత్రి కులస్తుల ఆరాధ్య దైవమైన అంబాభవాని జాతరకు కర్ణాటక, మహారా ష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. జాతర సందర్భంగా రైతు సంబురాలు నిర్వహించడం ఆనవాయితీ. 17వ తేదీన వృషభరాజముల బండలాగుడు పోటీల ను నిర్వహించనున్నా రు.
మొదటి నుంచి ఐదు స్థానాల్లో నిలిచిన వృషభరాజముల యజమానులకు వరుసగా రూ.50వేలు, రూ.40వేలు, రూ. 30వేలు, రూ.20వేలు, రూ.10వేల నగదు బహుమతులు అందజేయనున్నారు. 14వ తేదీన మూడుబండ్ల గిరక, 15న గ్రామ సింహాల పరుగుపందెం, 16న చేతిరాళ్లు ఎత్తే పోటీలు ఉండనున్నాయి.