గద్వాల : రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కొందరు అధికారుల పోకడలతో నిర్వీర్యం అవుతున్నాయి. సంఘం పాలకవర్గాన్ని చెప్పు చేతుల్లోకి తీసుకుని ఇష్టరాజ్యంగా నడుస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గద్వాల జిల్లా ధరూర్ ( Dharur ) మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ( PACS ) కార్యాలయంలోని ముఖ్య అధికారి( Officer) ఆడిందే ఆటగా పాడిందే పాటగా పాలన వ్యవహారం కొనసాగుతుంది. దీంతో కొందరు డైరక్టర్లు ఆయన వ్యవహారంపై విరుచుకుపడుతున్నారు.
సంఘం ఆర్థిక లావాదేవీలు తప్పుల తడకగా, సదరు అధికారి తీరు వల్ల భారీ నష్టాల్లో కొనసాగుతున్నట్లు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. దాదాపు కొన్నేళ్ల నుంచి కూర్చి విడవకుండా ఆ అధికారి ఉండడమే అందుకు నిదర్శనమని భావిస్తున్నారు. బయటకు మాత్రం సంఘం అభివృద్ధి చేస్తున్నట్లు కనబడ్డా లోపల మాత్రం బొక్కలు పెద్ద మొత్తంలోనే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సంఘ డైరెక్టర్లకు ఎలాంటి వ్యవహరం చెప్పకుండానే ఆ అధికారి గుట్టు చప్పుడుగా వ్యవహరాలు చక్కపెడుతున్నట్లు సమాచారం. ఇటీవల సంఘం తరఫున పెట్రోల్ బంక్, మందుల దుకాణం, సూపర్ మార్కెట్ తదితర వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతులు తీసుకొని వ్యాపారాలు మొదలు పెట్టారు. ఈ వ్యాపారాల కోసం తీసుకున్న రుణాల్లో లక్షల్లో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. సంఘ చైర్మనుకు ఇందులో పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాంకు మార్టిగేజ్ రుణాల విషయంలో తన వాటా తనకు దక్కే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని విమర్షలున్నాయ. కార్యాలయంలో కొన్ని పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ వేయకుండానే ఇష్టానుసారంగా కొంద మందిని నియమించుకొని వారిని రెగ్యులర్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా వచ్చిన సొమ్ముతో ధరూర్ శివారు ప్రాంతంలో బినామి వ్యక్తుల పేరు మీద భూములు కొన రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. యూరియా అక్రమంగా తరలిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అధికారి వ్యవహారం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు అతడిని ఐజ మండలానికి బదిలీ చేశారు. యధాస్థానంలో కొనసాగేలా చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది.
సదరు అధికారి బదిలి అయి నాలుగు రోజులు కావస్తున్న బదిలీ అయిన స్థానానికి పోకుండా ధరూర్లోనే వ్యవహరాలు చక్కపెడుతున్నాడని తెలిసింది.ఈ విషయాలపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సీఈవో పురుషోత్తంను వివరణ కొరగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తక్షణమే సదరు అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు .