మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 30: విద్యార్థులు సమాజంపై మరింత అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 500మంది విద్యార్థులకు స్వచ్ఛత వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చినవారికి శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో, పెయింటింగ్‌లో చక్కటి ప్రతిభచాటడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమవంతు తల్లిదండ్రులు, చుట్టు పక్కలవారికి పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, మంచి సమాజ నిర్మాణానికి కృషిచేయాలన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ భాగస్వాములైతేనే స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా తీర్చిదిద్దవచ్చని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, పారిశుధ్య విభాగ అధికారులు రవీందర్‌రెడ్డి, వాణీకుమారి, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి, పర్యావరణ ఇంజినీర్ చరణ్, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన కాల్వ నిర్మాణంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలో డ్రైనేజీ నిర్మాణాలపై మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు సులువుగా వెళ్ల్లేందుకు కాల్వ నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామయ్యభౌళి, బీకేరెడ్డికాలనీ ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయని, అక్కడ నిర్మిస్తున్న కాల్వ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారుకుల ఆదేశించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎంఈ సుబ్రహ్మణ్యం, ఇంజినీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్ అన్నారు. శుక్రవారం వాటరింగ్ డేను పురస్కరించుకొని మున్సిపాలిటీ ఆవరణలో నాటిన మొక్కలకు కమిషనర్ ప్రదీప్‌కుమార్‌తో కలిసి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారంలో భాగం గా 6ఏండ్లుగా నాటిన నేడు వృక్షాలుగా మారాయన్నారు.