బిజినేపల్లి, జనవరి 16: మండలంలోని లట్టుపల్లి కల్లుదుకాణం వద్ద సీసాలో పాముపిల్ల బయటపడిన ఘటన గురువారం చోటుచేసుకున్నది. ఆగ్రహించిన గ్రామస్తులు దుకాణం వద్ద ఆందోళన చేపట్టి కల్లుసీసాలను ధ్వంసం చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రకుం ట తండా జీపీలోని రావులచెరువు తండాకు చెందిన మాన్యానాయక్ రోజూమాదిరిగానే కల్లు దుకాణానికి వచ్చాడు. దుకాణంలో కల్లు కొనుగోలు తాగుతుండగా చనిపోయిన పాముపిల్ల నోట్లోకి రావడంతో భయాందోళనకు గురయ్యాడు. గమనించి చూడగా పాముపిల్లగా గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యాడు. చుట్టుపక్కల వారు గమనించి కల్లు దుకాణం నిర్వాహకులను నిలదీశారు.
అంతేకాకుండా దుకాణం వద్ద చుట్టుపక్కల వారు, గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళన చేశారు. ప్రతినిత్యం కూలీ పనులు చేసి సేదతీరేందుకు కల్లు తాగడానికి వస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కల్లు తయారు చేసే క్రమంలో శుభ్రత, పరిశీలన లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సంబంధిత దుకాణం యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఆగ్రహానికి గురైన మరికొందరు గ్రామస్తులు దుకాణంలోని సీసాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. చివరకు నిర్వాహకులు సంబంధిత బాధితుడిని దవాఖానలో చేర్పించి చికిత్స చేయిస్తామనడంతో ఆందోళన విరమించారు.