వనపర్తి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : వర్షాల తో జిల్లాలో ఒక పక్క 700 చెరువులు అలుగులు పారుతుండగా మరోపక్క పాత ఇండ్లు కూలిపోవడం, పంట నీట మునగడం, చెరువులు, కాల్వలకు గండ్లు పడడంతో తీవ్ర నష్టం కలిగింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమ త్తం చేశారు.
అధికారులను సైతం అలర్ట్ చేయడంతో ప్రమాదాలు, ప్రాణనష్టాలను కొంతమేర తగ్గించిందని చెప్పొచ్చు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 700 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో అధికంగా వరి ఉండగా, మిగిలిన వాటిలో వేరుశనగ, కంది పైర్లు తం ఉన్నాయి. దాదాపు 80 వరకు పాత ఇండ్లు కూలిపోయాయి. తాటిపాములలో ఒక వ్యక్తి చనిపోయాడు. 14 చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి.
మరో 25 ప్రాం తాల్లో ఇప్పటికీ రోడ్లపైనే నీరు పారుతున్నది. ఎనిమిది చెరువులు తెగిపోగా, 28 చోట్ల భీమా, కేఎల్ఐ కాల్వలకు గండ్లు పడ్డాయి. 105 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. అయితే, పంట నష్టం వివరాలు, రోడ్లు, కూలిన ఇండ్ల వివరాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. వర్ష బీభత్సంపై అధికారులు పూర్తి స్థాయి లో అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు.