
మహబూబ్నగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : సమైక్య రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పను లు వేగంగా కొనసాగుతున్నాయి. 18 ప్యాకేజీలు గా చేపట్టిన పనుల్లో.. రిజర్వాయర్లు 90 శాతం, టన్నెల్స్ 80 శాతం పనులు పూర్తి కాగా.. వట్టెం, ఏదుల, నార్లాపూర్, ఉదండాపూర్లో పంపులు బి గించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ప్రాజెక్టుకు సం బంధించి ఇప్పటికే మొదటి విడుత ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాగా.. రెండో విడుత ప్రజాభిప్రాయ సేకరణను పనులు జరుగుతున్న ఆరు జిల్లాల పరిధిలో మంగళవారం చేపట్టనున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మార్గదర్శకాలకు అనుగుణం గా గత నెల 9న నోటిఫికేషన్ జారీ చేశారు. శ్రీ శైలం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీల వరద జ లాలను ఎత్తిపోసి.. ఆరు జిల్లాల పరిధిలో 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించనున్నారు. కాగా, నేడు చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు, ప్రజలు తమ వాణిని వినిపించి పా లమూరు-రంగారెడ్డి పనులు త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు.
‘పాలమూరు’తో తీరనున్న నీటి గోస..
చెంతనే కృష్ణానది పారుతున్నా చుక్క నీటిని కూడా ఒడిసి పట్టుకునే పరిస్థితి లేక ఇన్నాళ్లూ పాలమూరు రైతులు ఆగమయ్యారు. సమైక్య రాష్ట్రం లో జరిగిన అన్యాయానికి చరమగీతం పాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. ఈ క్రమంలో పాలమూరు-రంగారెడ్డి రూపంలో సీఎం కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టారు. రూ.35,200 కోట్లతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రిజర్వాయర్ల పను లు దాదాపుగా పూర్తయ్యాయి. ఏదుల రిజర్వాయర్లో పంపులు బిగించే పనులు మొదలుపెట్టారు. 68 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు, 60 కిలోమీటర్ల పొడవైన కాలువలు, 70 కి.మీ టన్నెళ్లు చేపట్టనున్నారు. మొదటి లిఫ్ట్ ఉన్న నార్లాపూర్ నుంచి 110 కి.మీ దూరం ఉన్న కేపీ లక్ష్మీదేవిపల్లి వరకు పనులు కొనసాగుతున్నాయి. 12.30 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో 920 కి.మీ. మేర కాలువలు తవ్వాల్సి ఉన్నది. 70 మండలాలు, 1,230 గ్రామాలకు ప్రాజెక్టు ద్వారా నేరుగా సాగునీరందనున్నది. తొలి విడుతలో 20 వేల ఎకరాలకు పైగా భూసేకరణ జరగగా.. రెండో విడుత ప్రజాభిప్రాయం తర్వాత అవసరమైన మేర భూ సేకరణ చేపట్టనున్నారు. ఇది పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి కాలువల నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పనులు త్వరగా పూర్తయితే నీటిగోస తీరనున్నది.
ఆగం పట్టించే వాళ్లతో అప్రమత్తంగా ఉండాలి..
పాలమూరు ఎత్తిపోతల పనులు వేగంగా పూర్త యి సాగునీరు వస్తే రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన ప్రతిపక్షాల నాయకులు కోర్టుల్లో కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. ఆలస్యమయ్యేలా చేశారు. అయినా, ప్రభుత్వం ఒక్కో కేసు ను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నది. ఓవైపు పనులకు అడ్డంకిగా ఉన్న కేసులను ఎదుర్కొంటూ నే.. మరోవైపు పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. తొలి విడుతలో పర్యావరణ అనుమతు లు రావడంతో పనులు చేపట్టారు. కేంద్ర అటవీశాఖ నుంచి 2018 ఏప్రిల్లో మొదటిదశ అటవీ అనుమతులు తీసుకొని పనులు చేపట్టారు. ప్రస్తు తం చేపట్టిన రెండో విడు ప్రజాభిప్రాయ సేకరణకు కొందరు అభివృద్ధి నిరోధకులు అడ్డు తగిలే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఏకతాటిపై ఉండి ప్రాజెక్టు ఆవశ్యకతను చాటి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల నారాయణపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్ సైతం పాలమూరు ప్రజాభిప్రాయ సేకరణపై మాట్లాడారు. కొందరు కోర్టుకు పోయి అడ్డంకులు సృష్టించారని.. ప్రజాభిప్రాయ సేకరణలోనూ అలాంటి వారు చొరబడే అవకాశం ఉందని.. అందుకే రైతులంతా ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి ప్రాజెక్టు అవసరం, సాగునీటి ఆవశ్యకతను అధికారులకు వివరించాలని సూచించారు. ఆగం పట్టించేందుకు ప్రయత్నించే వారిపై అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండోదశలో రిజర్వాయర్ల నుంచి కాలువలు తవ్వి 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.