మహబూబ్‌నగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కృష్ణానది బిరబిరా తరలివస్తున్నది. నది ఎగువన ఉన్న కర్ణాటక తోపాటు తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో ముసురు నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో నీలవేణికి వరద రాక మొదలైంది. అలాగే భీమా నది సైతం పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకలోని యాద్గీర్ జిల్లాలో తెలంగాణ సరిహద్దులో ఉన్న రోడ్డు కం బ్యారేజ్ నుంచి శుక్రవారం అధికారులు సుమారు లక్ష క్యూసెక్కులను విడుదల చేశారు. ఈ నీరంతా తరలివస్తూ తంగిడి వద్ద సంగమ ప్రాంతంలో కృష్ణానదిలో కలిసింది. అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు పరుగు.. పరుగునా తరలుతున్నది. దీంతో డ్యాంలో సాయంత్రం వరకు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా ఆ తర్వాత ప్రవాహం మరింత పెరిగింది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 3.810 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆదివారానికి ఐదు టీఎంసీలకు చేరే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కోయిల్‌సాగర్ 21అడుగు లకు చేరి జలకళను సంతరించుకోగా.. దుందుభీ నది పారుతుండ డంతో చెక్‌డ్యాంలన్నీ మత్తడి పోస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద రావడంతో రైతన్నలు సాగుపనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.
కృష్ణానదికి వరద రాక మొదలైంది. నాలుగు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ముసురు వానల నుంచి మోస్తరు వరకు కురిసింది. అలాగే కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురవడంతో భీమా నది పరవళ్లు తొక్కింది. దీంతో కృష్ణాకు వరద రాక షురూ అయ్యింది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కుసుముర్తి వద్ద శుక్రవారం రాత్రి నుంచి భారీగా వరద రాకతో కనిపించింది. కృష్ణా మండలం తంగిడి గ్రామం సమీపంలో సంగమ ప్రదేశంలో కృష్ణా, భీమా నదులు వడివడిగా తరలివస్తున్నాయి. దీంతో పీజేపీకు శనివారం మధ్యాహ్నం వరకు 24 వేల క్యూసెక్కుల వచ్చి చేరగా.. సాయంత్రం తర్వాత 30 వేల క్యూసెక్కులకు చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి కర్ణాటకలోని యాద్గీర్ జిల్లాలో తెలంగాణ సరిహద్దులో ఉన్న బ్రిడ్జి కం బ్యారేజ్ నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. శనివారం కూడా భారీగా వరద రావడంతో మొన్నటి దాకా బోసిపోయిన భీమా నది కళకళలాడుతున్నది. ఈ నీరంతా కృష్ణాలో చేరడంతో బిరాబిరా అంటూ తెలంగాణలో అడుగుపెట్టింది. భీమాకు భారీగా వరద వస్తుండడంతో నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరో వైపు కృష్ణ అప్పర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వరద చేరుతున్నది.
జూరాలకు వరద
కృష్ణా ఉపనది భీమాకు భారీగా వరద వస్తున్నది. మధ్యాహ్నం వరకు 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సాయంత్రం వరకు 30 వేలకుపైగా క్యూ సెక్కులు నమోదైందని, మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. సామ ర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 3.810 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి వరద వస్తుండడంతో ఆదివారానికి 5 టీఎంసీలు దాటే అవకాశం ఉన్నదని డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాగే ప్రవాహం వారంపాటు కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందన్నారు. ఇన్‌ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో వాగులు పారి కృష్ణానదిలో కలుస్తున్నాయి. జూరాల బ్యాక్ వాటర్ ప్రాంతమైన పంచదేవ్‌పహాడ్ వద్ద నది నిండుగా ప్రవహిస్తున్నది. 24 గంటల కిందట బోసిపోయిన కృష్ణానది నేడు జలకళను సంతరించుకున్నది. దీం తో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగునీటికి ఢోకా ఉండదని పేర్కొంటున్నారు.
కోయిల్‌సాగర్ ‘@ 21 అడుగులు
మహబూబ్‌నగర్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌లో నీటిమట్టం పెరుగుతున్నది. అంకి ళ్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నీరంతా సా గర్లోకి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32 అడుగులకుగానూ ప్రస్తుతం 21 అడుగులకు చేరింది. పది రోజుల నుంచి జూరాల బ్యాక్ వాటర్‌ను తీలేరు పంప్‌హౌస్ నుంచి పంపిం గ్ చేస్తుండడంతో ప్రాజెక్టులో నిల్వలు పెరుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్-రాయిచూర్ రహదారిపై బండ్రవల్లి వద్ద ఉన్న చెక్‌డ్యాం అలుగు పారుతున్నది. సందర్శకులు, యువకులు అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు.
దుందుభీకి జలకళ
నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల వరప్రదాయిని దుందుభీ నది జలకళను సంతరించుకున్నది. నవాబ్‌పేట, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగడంతో కోడ్గల్ వద్ద ఉన్న వాగు ఉప్పొంగింది. నది నీటి ప్రవాహంతో కళకళలాడుతున్నది. క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతుండడంతో నది పొడవునా నిర్మించిన చెక్ డ్యాములన్నీ మత్తడి పోస్తున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా కురిసిన వర్షాలు శనివారం తగ్గుముఖం పట్టాయి.
ఉమ్మడి జిల్లాలో పొంగుతున్న వాగులు
ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా విస్తారంగా వానలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పారుతున్నాయి. అంకిళ్ల వాగు ఉప్పొంగింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగింది. జూరాల డ్యాంకు జలకళ మొదలైంది. జడ్చర్ల మండలంలో దుందుభీ నది పరవళ్లు తొక్కుతున్నది. పలు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు.