
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్19: తొమ్మిది రోజులపాటు భక్తజనం చేత పూజలందుకున్న గణనాథులు గంగామాత ఒడికి చేరుకున్నారు. వచ్చేఏడాది మళ్లీ రావయ్యా.. గణనాథ అంటూ భక్తులు బైబై చెబుతూ సాగనంపారు. జిల్లావ్యాప్తంగా 12వందల విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తుండగా.. అందులో పాలమూరు పట్టణంలో దాదాపు 600 మండపాల్లో గణనాథులు కొలువుదీరారు. ఎప్పుడూ ఐదురోజులపాటు పూజాలందుకునే గణపయ్య ఈసారి మాత్రం తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్నాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తజనం ఆదివారం చివరిసారిగా పూజలు చేసి గణనాథులను నిమజ్జనానికి తరలించారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కో గణనాథుడిని వాహనంలో ఎక్కించి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. గడియారం చౌరస్తాలో ఉత్సవ సమితీ ఆధ్వర్యంలో వినాయకులకు స్వాగతం పలికారు. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా అంతటా భారీ పోలీసు బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులు బందోబస్తుకు వచ్చారు. ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదివారం మధ్యాహ్నం రాయల్ ఫంక్షన్ హాల్లో బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీసులతో సమావేశమయ్యారు. వారికి బందోబస్తు పరంగా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ముందుగానే సమాచారం తెప్పించుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కనులపండువగా శోభాయాత్ర
మండల కేంద్రంతోపాటు, నిజాలపూర్, జానంపేట, కొమిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వినాయక విగ్రహాల ఊరేగింపు భజనలు, భాజాభజంత్రీల మధ్య వైభవంగా చేశారు. యువకుల నృత్యాలు, కోలాటాలు, మహిళల బొడ్డెమ్మల మధ్య కనువిందుగా సాగింది. ఆయా గ్రామాల చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూసాపేట ఎస్సై నరేశ్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఘనంగా వినాయక నిమజ్జనం
మండలంలోని నందిగామ, తిర్మలాపూర్‌లోని భ్రమారాంబామల్లికార్జున స్వామి ఆలయం, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులను భజన పాటలు, కోలాటాలతో ఊరేగింపుగా గ్రామంలోని చెరువులకు తరలించారు. కార్యక్రమంలో రాఘవేందర్, స్వామి, రామ్మూర్తి, పుల్లారెడ్డి, రామకృష్ణాగౌడ్, చంద్రయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.
బాలగంగాధర్‌తిలక్ విగ్రహానికి పూలమాల
జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద గణేశ్ ఉత్సవ సమితీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం పూలమాల వేశారు. కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ సమితీ నేతలు యాదిరెడ్డి, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
వినాయకా.. సెలవిక
మండలంలోని మోదీపూర్ తండా, కనాయల్లి, రామన్నపల్లి తండా తదితర గ్రామాల్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతి, యువకులు నృత్యాలు చేస్తూ అలరించారు. కొనాయపల్లిలో కోలాటాలు, భజనలతో వినాయక నిమజ్జనం నిర్వహించారు. ఎస్సై సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
బాలానగర్ మండలంలో..
మండలంలోని నందారం ఎస్సీకాలనీలో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహం వద్ద సర్పంచ్ నిర్మలాఉమాకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన, బ్యాండు మేళాలతో పురవీధుల గుండా ఊరేగించి చెరువులో నిమజ్జనాకి తరలించారు. గుండేడ్‌లో వినాయకుడి వద్ద టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి దంపతులు పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, రమేశ్, నర్సింహులు, ఉమాకాంత్, శ్రీకాంత్ ఉన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్ల, సెప్టెంబర్ 19: మున్సిపాలిటీలోని సాయినగర్ సకలదేవతల ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక వి గ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వి నాయక విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు కోలాటాలు, భక్తిపాటలతో ముందుకు సాగుతూ పట్టణ ప్రజలను అలరించారు.
నవాబ్‌పేట మండలంలో..
మండల కేంద్రంతోపాటు యన్మన్గండ్ల, కాకర్లపహాడ్, కూచూర్, పోమాల, కొండాపూర్, కామారం, లోకిరేవు, మరికల్, అమ్మాపూర్ తదితర గ్రామా ల్లో ఆదివారం వినాయక నిమజ్జనం నిర్వహించారు. గ్రామ శివారులోని చెరువుల్లో నిమజ్జనం చేశారు.