
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 23 : కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి, రెం డు తరగతుల విద్యార్థులకు కూడా ఆన్లై న్ బోధనను ప్రారంభించింది. సాధారణంగా విద్యార్థులు ఆటపాటల వైపు ఆసక్తి చూపిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘రీడ్ ఎలాంగ్’ యాప్‌ను విద్యార్థులు ఉపయోగించేలా చూడాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ సూచించింది. ఈ యాప్ ద్వారా చిన్నారులు ఇంటి వద్దే ఉంటూ తెలుగు, ఆంగ్లంతోపాటు లెక్కలను సులువుగా నేర్చుకోవచ్చు. ఇందులో ఉన్న దియా (బొమ్మ).. పదాలు, వాక్యాలు చదవడం వంటివి కూడా చేయిస్తుంది. దీంతో భాషా పఠనా నైపుణ్యం మెరుగుపడుతుంది.
మూడు నుంచి ఆపై తరగతుల విద్యార్థులు టీశాట్, టీవీల్లో వచ్చే పాఠాలు విం టున్నారు. కానీ, గతేడాది మార్చి నుంచి ఒకటి, రెండు తరగతుల చిన్నారులు ఇం టి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో విద్యా సం వత్సరం నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి వీరికి కూడా ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు రీడ్ ఎలాంగ్ (బోలో) యాప్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్యారా ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు భాషా మహబూబ్‌నగర్ జిల్లాలో 632 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు దాదాపు 10వేలకు పైగా ఉన్నారు.
యాప్ పనితీరు ఇలా..
గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి రీడ్ ఎలాంగ్ (బోలో) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవా లి. ఆ తర్వాత భాషను ఎంచుకొని కథల ప్రపంచంలోకి అడుగు పెట్టొచ్చు. తరగతి సామర్థ్యానికి సరిపోయే ఆటలు ఇందులో ఉంటాయి. ఈ యాప్‌లోని రీడింగ్ సహాయకురాలు దియా (బొమ్మ) పదాలను ఎలా పలకాలో చెబుతుంది. చిన్నారులు చదవడం, రాయడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. విద్యార్థులు చదివే సమయంలో ఇబ్బంది ఎదురైనప్పుడు దియా సాయం కోరితే తప్పులను సరిచేస్తుంది. ఇందుకు విద్యార్థులు ఆయా పదాలపై టచ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థులు సొంతంగా పఠనా నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. ఈ యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాల్లోని కథలు ఈ యాప్‌లో నిక్షిప్తం చేశారు. యాప్ ద్వారా పఠనా నైపుణ్యంతోపాటు పద వినోదం, బెలూన్లను పేల్చడం వంటి ఆటల ద్వారా క్రీడా పద్ధతిలో పదాలు నేర్చుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి..
ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పఠనా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడమే కాకుండా యాప్‌లో పద వినోదం, బెలూన్లను పేల్చడం వంటి ఆటలతో క్రీడా పద్ధతిలో నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. పాఠాలు వినే క్రమంలో విద్యార్థులకు పదాలు పలకడం రాకపోతే కావాల్సిన పదంపై వేలితో నొక్కితే దియా (బొమ్మ) ఆ పదాన్ని పలుకుతుంది.