
మహబూబ్‌నగర్, నవంబర్ 1 : అధికారుల దృష్టికి వచ్చే ప్రతి సమస్యనూ పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఈ-ఆఫీస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ-ఆఫీస్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, అవసరమైతే మరోసారి మండలస్థ్థాయి అధికారులకు ఈ-ఆఫీస్ నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని ఎన్ఐసీ అధికారి మూర్తికి సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని, జాప్యం లేకుండా ఎఫ్‌టీవో జనరేట్ చేయడంతోపాటు ఆన్లైన్ నమోదు ఎప్పటికప్పుడు చేపట్టాలని తెలిపారు. ప్రజావాణికి 47, ధరణి ప్రజావాణికి 41 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, జెడ్పీ సీఈవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.