‘యాసంగి ముచ్చట్లు’ తెలంగాణ అస్తిత్వానికి సాహిత్య దర్పణం. ‘యాసంగి ముచ్చట్లు’ అనే శీర్షికనే తెలంగాణ రైతు నిఘంటువులోని అరుదైన పద ప్రయోగంగా, సంపుటి ఆత్మను ముందుగానే సూచిస్తుంది. తెలంగాణ మాండలిక పరిమళం, విభిన్న దృక్పథాలు, ఉద్యమ చైతన్యం కలిసి ఈ సంపుటిని తెలంగాణ అస్తిత్వానికి ఒక కవితాత్మక ప్రకటనగా నిలబెట్టాయి. తెలంగాణ సాధన కోసం జరిగిన తొలి, మలిదశల ఉద్యమ స్ఫూర్తిని డాక్టర్ దేవులపల్లి వాణీదేవి సాహితీ వస్తువుగా స్వీకరించి, ఉద్యమ సమరంలో నుంచి అంకురించిన అనేక స్వరాలను ఒకేచోట గుదిగుచ్చడం ఈ సంపుటి ప్రధాన విశిష్టత.
తెలంగాణ సాహిత్యం కవిత్వ పరంపర మాత్రమే కాదు అది సామాజిక చరిత్ర, ప్రతిఘటన స్వరం, ఆత్మగౌరవ ఉద్యమం. అటువంటి సాహిత్య ప్రవాహంలో ‘యాసంగి ముచ్చట్లు’ ఒక కీలక ఘట్టం. ఉద్యమానికి ముందు, తర్వాతి దశలను అనుసంధానిస్తూ, ప్రజల జీవన చైతన్యాన్ని కవిత్వంగా మలిచిన అరుదైన ప్రయత్నమిది. తెలంగాణ ఉద్యమం ఇక్కడ రాజకీయ సంఘటనగా కాకుండా, ప్రజల జీవన అనుభవంగా, వారి వేదన, ఆశ, పోరాటంగా దర్శనమిస్తుంది.
దాశరథి ‘నా తెలంగాణ’ వంటి కవితలు ఉద్యమానికి మూల వేదనను ప్రతిబింబిస్తే, ఉద్యమానంతర కవితలు ఆత్మవిశ్వాసం, స్వప్నాలను వ్యక్తపరుస్తాయి. ఈ విధంగా ఉద్యమం కాల ప్రవాహంలో ఎలా మారిందో ఈ సంపుటి స్పష్టంగా నమోదు చేస్తుంది. ఈ సంపుటిలోని ప్రధాన సాహిత్య బలం తెలంగాణ మాండలికం.
యాస ఇక్కడ భాష మాత్రమే కాదు, అది ఆధిపత్య భాషలపై ఒక సాంస్కృతిక ప్రతిఘటన. కవులు యాసను అలంకారంగా కాకుండా ఆలోచనా పద్ధతిగా స్వీకరించారు. అందువల్ల రైతు, కూలీ, పల్లె మహిళ, విద్యార్థి జీవితం సహజంగా కవిత్వంలోకి ప్రవేశించింది. మట్టి ఈ సంపుటిలో కేంద్ర ప్రతీక. అది రైతు చెమటతో తడిసిన నేల, కూలీ శ్రమతో గట్టిపడిన భూమి, అమరవీరుల రక్తంతో పవిత్రమైన తల్లి. మట్టి, మనిషి అనుబంధాన్ని కవితలు భావోద్వేగపూరితంగా ఆవిష్కరిస్తాయి. చెరువుల సంస్కృతి, కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించే కవితలు తెలంగాణ చరిత్ర లేదన్న అపవాదును ఖండిస్తాయి.
కాళోజీ ‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే’ కవిత నైతిక ప్రతిఘటనకు ప్రతీక. దోపిడీ ఎవరుచేసినా తప్పేనని, సొంత పాలకుల నుంచే జరిగితే మరింత ఘోరమని ఆయన నిర్భయంగా ప్రకటిస్తారు. అయినంపూడి లక్ష్మి ‘మట్టిపూల పరిమళం’ పల్లె జీవనంలోని సహజ సౌందర్యాన్ని సున్నితంగా చిత్రిస్తూ, నిజమైన అందం మట్టిలోనే దాగి ఉన్నదని చెప్తుంది. కొండపల్లి నిహారిణి ‘అక్షర దీపం’ విద్య సామాజిక మార్పునకు శక్తివంతమైన సాధనమని గుర్తుచేస్తుంది. బాలబోయిన రమాదేవి ‘గేయాల గొంతులు’ నకిలీ మాధుర్యాన్ని, మోసపూరిత స్వరాలను తీవ్రంగా ప్రశ్నిస్తుంది.
స్వప్న కృష్ణ ‘కర్నాల బంకు’ తెలంగాణ మాండలిక పదాలతో బాల్య జ్ఞాపకాలను హృద్యంగా ఆవిష్కరిస్తుంది. శారదా హనుమాన్లు ‘తరగని నిధి’ శ్రమ సౌందర్యాన్ని, తెలంగాణ తల్లిని ప్రతీకాత్మకంగా చూపుతుంది. వకుళా వాసు ‘అభివృద్ధి జాగృతి తెలంగాణలో’ ఉద్యమ తీవ్రతను, నిరంతర జాగ్రత్త అవసరాన్ని గుర్తుచేస్తుంది. డాక్టర్ వాణీదేవి దేవులపల్లి ‘యాసంగి ముచ్చట్లు’ కవిత యాసంగి కాలపు వల్లె సౌందర్యాన్ని, రైతుల ఆనందాన్ని జానపదాత్మకంగా చిత్రిస్తుంది.
సంపాదకురాలిగా ఆమె చూపిన భావాత్మక క్రమబద్ధత ఈ సంపుటికి స్పష్టమైన దిశనిచ్చింది. కొన్ని చోట్ల నినాదాత్మకత, నిర్మాణ సడలింపు కనిపించినా, అది ఉద్యమ సాహిత్య సహజ లక్షణమే. మొత్తంగా ‘యాసంగి ముచ్చట్లు’ ఒక కవితా సంపుటి మాత్రమే కాదు; అది తెలంగాణ ఉద్యమానికి సాహిత్య రూపం, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, భవిషత్ తరాలకు నిలిచే సాంస్కృతిక సాక్ష్యం. తెలంగాణను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చరిత్రతో పాటు ఈ కవిత్వాన్ని కూడా చదవాల్సిందే.
– ముచ్చర్ల శేషగిరిరావు 9441272503