పంప మహాకవి కన్నడ భాషలో రాసిన భారతం 500-600 పేజీలు కాగా, తెలుగు భాషలో 1,800 పేజీలతో వెలువడింది. దీనిని ఒక అక్షర యజ్ఞంగానే భావించక తప్పదు. ఎందుకంటే.. అనంతపూర్‌కు చెందిన డాక్టర్ జోస్యుల సదానంద శాస్త్రి పంప భారతాన్ని కన్నడ భాష నుండి తెలుగు భాషలోకి (విక్రమార్జున విజయం) పేరిట అనువాదం చేయడంలో ఎంత సాహసించారో మాటల్లో చెప్పనలవి కాదు.
1,100 ఏండ్ల క్రితం కన్నడంలో రాసిన ఈ పుస్తకాన్ని ఎవరూ తెలుగు భాషలోకి తీసుకురాలేకపోయారు. ఈ పుస్తకంలో ప్రతి పదానికి అర్థం సవివరంగా పేర్కొన్నారు.
పంపన కవి రాసిన భారతం అనువాదం బృహత్ ప్రయత్నమనే చెప్పకతప్పదు. ఈ బృహత్ యజ్ఞంలో జోస్యుల సదానంద శాస్త్రితో పాటు ఉభయభాషా విశారదులైన అనంతపూర్ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత కన్నడ ఆచార్యులు డా కే .శేష శాస్త్రి, బెంగళూర్‌లోని ఆచార్య పాఠశాలకు చెందిన పండితులు డా కే ఆర్ గణేష్, శతావధాని డా ఆర్ గణేష్ తమ వంతు పాత్ర పోషించారు. తొంభై ఏండ్ల వయసులో ఉన్న అంతర్జాతీయ సాహిత్యమూర్తి హంపన కూడా తాను వేయించిన పంపన చిత్రాలు అందించి సాయం చేశారు. తెలుగు భాష పట్ల ఆయనకు ఉన్న గౌరవం .. తెలుగు ప్రజావళి పట్ల ఆయనకు ఉన్న అభిమానం వేనోళ్ల కొనియాడదగినది. తెలుగు సాహిత్య వికాసానికి తొలినాటి పునాదులు వేసిన పంపన కృషి మరొకసారి వెలుగులోకి వచ్చి, ఆయనకు తగిన గుర్తింపు, గౌరవం ఇప్పుడైనా తెలుగు సాహితీ లోకంలో దక్కాల్సి ఉంది.
బోధన్ ప్రాంతం మీద 30-50 పేజీలు
ఎప్పుడూ మూలాల్లోకి చూడాలి అని డా నాళేశ్వరం శంకరం అంటూ ఉండేవారు. బోధన్ చరిత్ర ఎంతో గొప్పది. అందుకే ఎప్పుడో 1,100 ఏండ్ల క్రితం రాసిన విక్రమార్జున విజయంలో బోధన్ ప్రాంతం మీద 30-50 పేజీలు ఉన్నాయంటే కుతూహలం కలిగింది. ఎన్నో ఏండ్లు ఆ పుస్తకాన్ని అనువాదం చేయించాలని తపన పడ్డాను. చివరికి అనంతపూర్‌లో జోస్యుల సదానంద శాస్త్రిని సంప్రదించాను. అసలు పంపనే పూని జోస్యుల సదానంద శాస్త్రితో రాయించుకున్నాడా అనిపించేంత గొప్పగా శాస్త్రి ఈ పంప భారతం కన్నడ నుండి తెలుగు భాషలోకి అనువాదం చేశారు.
కథా సారాంశం
14 అశ్వాసాలు ఉన్న ఈ 1,800 పేజీల పుస్తకం కన్నడ నుండి తెలుగులోకి అనువాదమైంది. పంపన 9 శతాబ్దంలో రాసిన విక్రమార్జున విజయాన్ని తెలుగులోకి తీసుకురావటానికి ప్రథమ అడ్డంకి భాష, వర్ణనలు, పాత్ర చిత్రణ, రసపోషణ, ఛందస్సులు. ఎన్నో తరాల కిందటి పుస్తకం ఇది.
భరతవంశ పుట్టుక నుండి మొదలైన ఈ కథ ఒకే వంశానికి చెందిన కొన్ని తరాల కథ. ముఖ్య ప్రాధాన్యం కురుపాండవ జననం ..రాజ్యాధికారం కోసం జరిగిన ఘర్షణలు, చివరికి కురుక్షేత్ర సంగ్రామం.. శూరుల శౌర్యాలు.. యోధుల మరణాలు.. మరణించినవారి ఉత్తరక్రియలు.. వ్యూహాలు.. ప్రతివ్యూహాలు చివరికి కడుపు కోతలు.. అంతిమంగా కౌరవుల పతనం.. పాండవుల విజయం.. సుభద్ర అర్జునుల పట్టాభిషేకం.. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రులు తపోవనానికి తరలిపోవటంతో కథ ముగుస్తుంది.
స్వర్గారోహణ పర్వం మాత్రం ఉండదు. అర్జునుని నామకరణంలో అరికేసరి బిరుదులన్నీ అర్జునుని పేర్లుగా రాయటం, భారతంలో ఎవరినీ తలవకు.. కర్ణుని తలుచుకో.. భారతం కర్ణ రసాయనం అంటాడు పంపన.
శాంతా వసంత ట్రస్ట్ సాయంతో పుస్తకరూపం
అనువాదానికి నాలుగేండ్లు కష్టపడ్డా ..1,100 ఏళ్లుగా ఈ పుస్తకాన్ని ఎవ్వరూ తెలుగులోకి తీసుకు రాలేకపోయినా ..ఈ చరిత్రను ప్రజలకు అందించాలంటే ప్రచురణ కావాలి కదా..ఇది మళ్లీ ఒక పెద్ద యజ్ఞం అయ్యింది. మొండిధైర్యంతో అనువాదం పూర్తి చేయగలిగినా లక్షల్లో ప్రచురణ కావాలి. ఎన్నో అవాంతరాలు వచ్చినా ఏడాదిగా రైన్ బో ప్రింటర్స్ నరేంద్ర ఎంతో శ్రమకోర్చి పుస్తకాన్ని తయారుచేశారు. ఈ అనువాదంలో ఏ సమస్యకైనా సులువుగా పరిష్కారం సూచించే ఆచార్య తంగెడ కిషన్‌రావు సలహాతో.. డా.హరికృష్ణ మాట సాయంతో శాంతా బయోటెక్ సంస్థ అధినేత వరప్రసాదరెడ్డి సమ్మతించటంతో గొప్ప పుస్తకం అందరికీ దక్కాలనే సదుద్దేశంతో ఆకర్షణీయంగా ముద్రించి ఇచ్చారు రెయిన్ బో ప్రింట్ నరేంద్ర.
ఈ గ్రంథం ఒక ఆణిముత్యం..
ఈ బృహత్ ప్రయత్నం ఇంతటితోనే ఆగిపోకూడదు. తెలుగు సాహిత్య చరిత్రను మరొక రెండు వందల సంవత్సరాల పాటు పొడిగించగలిగే నేపథ్యాన్ని, బలమైన సాక్ష్యాలను అందిస్తున్న ఈ గ్రంథం ఒక ఆణిముత్యం. తెలుగులో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, తెలుగు భాషాభిమానులు ఈ దిశగా మరింత విస్తృత పరిశీలన, పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని ఈ పుస్తకం చెబుతుంది. అంతేకాకుండా తెలంగాణ సాహిత్య చరిత్రను ఈ గ్రంథం ప్రాతిపదికగా పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. తెలంగాణ చరిత్రకు దర్పణం ఇది. 1,100 ఏండ్ల క్రితమే పంప విక్రమార్జున విజయంలో బోధన్ ప్రాంతం గురించి విపులంగా రాశారు. పంపన రచనల పరిశోధన కోసం ఒక ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని బోధన్ ప్రాంతంలో కానీ నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో కానీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు శాఖలు, విశ్వవిద్యాలయాలు ఈ దిశగా మరిన్ని పరిశోధనలతో, విశ్లేషణలతో, గ్రంథాలను పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పంపనను కన్నడ ప్రజలు ఆదికవిగా సొంతం చేసుకున్నప్పటికీ ఈ నేల బిడ్డగా కూడా మనం ఆయనను గౌరవించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ విధమైన బహుళ కోణాల్లో కృషి జరిగినప్పుడే తెలంగాణ విస్మృత సాహిత్య చరిత్ర వెలుగులోకి వచ్చి సంపూర్ణ సాహిత్య రూపం ఆవిష్కృతమవుతుంది.
కన్నడ భాషకే కాదు.. తెలుగు భాషకు కూడా ఆదికవే..
కన్నడ భాషకి ఆదికవే కాదు.. తెలుగు భాషకు కూడా ఆదికవిగా పరిశోధకులు ఇప్పుడు తేలుస్తున్న పంప మహాకవి పంపభారతంతో పాటుగా చాలా గ్రంథాలు రాశాడు. ఎంతోమంది చరిత్రకారులు నిజామాబాద్ జిల్లా, బోధన్ చరిత్రను పరిశీలించి, పరిశోధించి ఎన్నో విషయాలు ఎరుకపరిచారు. పంపకవి తెలంగాణ వాడేనని సాధికారికంగా చెప్పారు. నేలటూరి వేంకటరమణయ్య చెప్పినట్టు విక్రమార్జున విజయం కొత్త ఒరవడితో సాగే లౌకిక కావ్యంగా అర్జున పాత్రగా అనిపించినా అరికేసరి మాత్రమే మనకు కనిపిస్తాడు. విక్రమార్జున విజయాన్ని అంకితం చేసినందుకు తన ఆస్థానకవి అయిప పంపనను కవితా గుణార్ణవుడు అనే బిరుదుతో ఘనంగా సత్కరించాడు. కన్నడ, తెలుగు, సంస్కృత భాషల్లో అఖండ పాండిత్యం పంపనకే కాక అతని తమ్ముడు జిన వల్లభుడికి కూడా ఉందని.. కురిక్యాల శాసనాన్ని గుర్తు చేస్తున్నారు చరిత్రకారులు. తొలి తెలుగు కంద పద్యం అక్కడే కనిపించింది. జగిత్యాల దగ్గరి ధర్మపురి అగ్రహారాన్ని పంపనకి అనుగ్రహంతో దానం చేశారని చెబుతారు.
సదానంద శాస్త్రి వైదుష్యం
జోస్యుల సదానంద శాస్త్రి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా కమ్మరచేడులో జన్మించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల నుంచి పట్టభద్రులై శ్రీ వేంకటేశ్వర వర్సిటీ నుంచి ఎంఏ చేశారు. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ‘పంప- నన్నయ తులనాత్మక అధ్యయనం’పై డాక్టరేట్ చేశారు. అనంతపురం సాయిబాబా నేషనల్ జూనియర్ కళాశాలలో 33 ఏండ్లపాటు అధ్యాపక వృత్తి నిర్వహించి 2010లో రిటైరయ్యారు. కన్నడం నుంచి తెలుగులో 20కి పైగా, తెలుగు నుంచి కన్నడకు ఏడు గ్రంథాలు అనువదించారు. హరికథకుడుగా ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల్లో పేరు తెచ్చుకున్నారు. అష్టావధానాలు, ఆధ్యాత్మికోపన్యాసాలు, పురాణ ప్రవచనాలు ఆయనకు ఖ్యాతి తెచ్చాయి.
అయినంపూడి శ్రీలక్ష్మి
9989928562