ఆకుపచ్చని తనాలను కోరుకుంటే
కాంక్రీట్ శిథిల దృశ్యాలు
దర్శనమిస్తున్నాయి
శ్రమైకజీవన సౌందర్యాలను
వీక్షించాలనుకుంటే
కొత్త కొత్త వైరస్ దాడులు వికృతంగా
వికటాట్టహాసం చేస్తున్నాయి
పచ్చని పంట పొలాలు చూడాలనుకుంటే
ఎడారి భూములు వెక్కిరిస్తున్నాయి
ఛిద్రమైన వలస బ్రతుకులు
చిగురించని కొత్త చిగుళ్లు
చదువులమ్మ తల్లి ఒడిలో బడిలో
గురువుల నీడలో చదువుకుందామంటే
పాఠశాల ప్రాంగణాలన్నీ
తాగుబోతుల నిలయాలై
పరిహసిస్తున్నాయి
జలధారలతో పుడమి పులకిస్తుందనుకుంటే
కన్నీటి ధారలు వరదలై చెలరేగుతున్నాయి
ప్రస్తుత ధరిత్రి చరిత్ర పఠిస్తుంటే
ప్రతి పూటలోనూ యుద్ధభేరి నినాద నాద
శబ్ద తరంగాలే ధ్వనిస్తున్నాయి
ఇప్పుడు ఉదయాలు కరువై
అంధకారంలో హృదయాలు అలమటిస్తున్నాయి
ఉరుకులు పరుగులతో పడమటి పయనాలు
డాలర్లతో తూకమేసుకుంటున్న జన ప్రవాహాలు
ఏవేవో మస్తిష్కంలో దూరి
విస్ఫోటనం చెందుతూ
నిన్నటి బంధాలను బంధుత్వాన్ని
స్నేహ వారధుల్ని
లోలోపల గాయాలు చేస్తూ
నిలువునా కూల్చేస్తున్నాయి
కదిలే కాలాన్ని ఇదేమని ప్రశ్నిస్తే
ప్రపంచాన్ని యుద్ధమేఘాలు కమ్ముకున్న కాలమని
మానవ బంధాలు మృగ్యమని సెలవిస్తోంది
ఇప్పుడు నాకు నవ్యత్వం కావాలి
నవ్యత్వం అంటే…
మానవత్వం పరిమళించే దిశగా
సమాజ గమనం సాగాలి
నా అడుగులటువైపే…
– డాక్టర్ కొరుప్రోలు హరనాథ్