అతను ఒక మండుతున్న కొలిమి. అతనొక నిండు చెరువు. అతనొక చౌరస్తా. అతనొక కూలీల అడ్డా. అతను ఒక పూలు, పండ్ల వనం. సబ్బండ వర్ణాల వాణి.
వుప్పల నరసింహంను వీటిలో ఏదో ఒక వ్యక్తీకరణకు పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయన అన్నింటి సమాహారమైన సాహితీ సేద్యగాడు. సహజ వ్యక్తీకరణలతో ఆయన కలం మూసీనదిలా ప్రవహించింది. పల్లెల్లో అమ్మలు ముగ్గేసినట్టు.. సేలల్లో నాట్లేసినట్టు.. కలుపుదీసి కోతలు కోసినట్టు.. కోడిపుంజులు కొట్లాడినట్టు.. గొర్రె పొట్టేళ్లు ఢీకొన్నట్టుగా ఉంటాయి అతని ముచ్చట్లు. ఆయన కథ, వ్యాసం, కవిత్వం, నాటకం ఏది రాసినా తెలంగాణకు నిలువెత్తు దర్పణమే.
తెలంగాణ భాషలో రాయడమే కాదు, అదే ఊపిరిగా జీవించాడు. సామాన్యుల వ్యవహారాలు, అలవాట్లను, వ్యవసాయాధారిత కులవృత్తుల జీవన విధానాన్ని, వృత్తి కళాకారుల, ఉపకులాల, సంచార తెగల కళలనన్నింటినీ తెలుసుకొని అక్షరీకరించారు. కథల రూపంలో మనకందించారు. నిత్య జీవితంలో కింది కులాల తండ్లాటను చూపేందుకే తన కలాన్ని ధారవోశారు. కూలిపోతున్న కులవృత్తులను, విస్మృతుల సాంస్కృతిక చరిత్రను విస్తృతంగా బయలుపరిచారు. తనది తయిద అంబలి, జొన్న సంకటి, సద్దరొట్టెల భాష. గంజి యాస. దాపరికం లేని మనిషి, ఏదీ దాచుకోలేని మనిషి. అందుకే ఏ సంఘం జట్టులో చేరని మనిషిగా మిగిలిపోయారు. ఎవరినీ కలువని మనిషి. అంతర్ముఖంగా అక్షరాలను ఆలింగనం చేసుకొని తెలంగాణ కులవృత్తుల ముచ్చట్లను అందించారు. ఏ కాలంలోని పద సంపదలు ఆ కాలంలోనే అంతరించిపోకూడదనే సంకల్పంతో ప్రతిదీ రికార్డు చేయాల్సిన బాధ్యత ఉన్నదని, ఆ సంకల్పాన్ని భుజానికెత్తుకున్నారు వుప్పల.
1955లో రంగారెడ్డి జిల్లా దేవరయాంజాల్లో వుప్పల నరసింహం జన్మించారు. అక్కడే ఉన్నత పాఠశాల విద్య. విద్యార్థి దశలోనే రాత్రి పాఠశాలను ఏర్పాటుచేసి గ్రామీణులకు అక్షరసేద్యం చేశారు. అనంతరం తెలంగాణ పల్లెల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగించే అనేక కార్యక్రమాలు చేపట్టారు. ‘ఆర్ట్ లవర్స్’ సంస్థతో కలిసి అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కవిత్వంతో పాటు కథలను, వ్యాసాలను విస్తృతంగా రాశారు. మావోయిస్టు సిద్ధాంతానికి వ్యతిరేకంగా 40 పుస్తకాలను ప్రచురించారు.
‘తిరగబడ్డ భూమి’, ‘ముద్ర’, ‘ఎర్ర లైటు’ సంపుటాలను కలిపి ‘మట్టిమనిషి-వుప్పల నరసింహం కథలు సంపుటిగా వెలువరించారు. నలుగురు తెలంగాణ రచయితలతో కలిసి పి.యశోదారెడ్డి, వుప్పల నరసింహం, ముదిగంటి సుజాతరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి కథలను చౌరస్తా సంకలనంగా తీసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైఫై తెలంగాణ మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. నూతలపాటి గంగాధరం అవార్డును అందుకున్నారు. కథావేదిక, నటన సంస్థలను స్థాపించి ఇటు కథకు, అటు నాటకరంగానికి అనేక సేవలందిస్తూ ఉద్యమంలా పనిచేశారు. రెండు చలనచిత్రాలకు పనిచేశారు. మూడు డాక్యుమెంటరీలు తీశారు. అందులో ఒకటి ప్రముఖ కథకుడు మునిపల్లె రాజు మీద రూ పొందించారు. రచయితగా తెలంగాణ సాహిత్యానికి విశిష్ట సేవలందిస్తున్న వుప్పల నరసింహంను ఉత్తమ కథా రచయితగా గుర్తించి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి లక్ష రూపాయల నగదు పురస్కారంతో గౌరవించి సన్మానించారు.
వుప్పల నరసింహం రచన ముద్రకు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం రాసిన ముందుమాటలో గోలకొండ పైన తెలుగు జెండా ఎగరేసిన సురవరం ప్రతాపరెడ్డెన్న ఎక్కడైతే వుంటాడో, పదునెక్కిన కలంతో ప్రజల పోరాటాల్ని చిత్రించిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి ఎక్కడైతే వుంటాడో, గడీల్లోని దొరల దురాగతాల్నీ చీల్చి ఎండగట్టిన దాశరథి రంగాచారి ఎక్కడైతే వుంటాడో, చదువర్లకు తెనుగు తియ్యదనాలు సామెతలుగా పెట్టిన యశోదమ్మ ఎక్కడైతే వుంటుందో, సెగలు గక్కుతా రవ్వలు చిమ్ముతా కొలిమంటుకున్నదని చెప్పిన అల్లం రాజయ్య ఎక్కడైతే ఉంటాడో, అక్కడ – ఆ సాహిత్య చరిత్రలో వుప్పల నరసింహం ఉంటాడని అంటారు మధురాంతకం రాజారాం ముద్రకు రాసిన ముందుమాటలో. జర్నలిస్టుగా ఆంధ్రజనత, ఆంధ్రప్రభలో పనిచేశారు. వివిధ పత్రికల్లో 40 ఏళ్లుగా కాలమ్స్ రాశారు. 1998 1999లో ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో యాసపీఠం’ శీర్షికన కాలమ్ రాశారు. ఆయన రాసిన ముచ్చట్లన్నీ దళితబహుజనులవే.. నిరంతరం రచనావ్యాసంగంలో మునిగితేలే వుప్పల నరసింహం నవంబర్ 14న హైదరాబాద్ లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. తెలంగాణ ఆయువు పట్టయిన నుడికారాలను పలుకుబడులను పట్టుకున్నారు. ఎన్నో కథలు తవ్వి తీసి రాసిపోశారు. తెలంగాణ పలుకుల భోషాణంలోని మణులు, కెంపులు, రతనాలు, వజ్రాలు, జిగేల్ జిగేల్ మనేలా రాసిన నిండైనమెండైన కవి, కథకుడు వుప్పల నరసింహం.
-వనపట్ల సుబ్బయ్య
94927 65358