‘దానేన పాణిర్నతు కంకణేన/స్నానేన శుద్ధిర్నతు చందనేన/
మానేన తృప్తిర్నతు భోజనేన/జ్ఞానేన ముక్తిర్నతు మండనేన’
దానం చేయడంతోనే చేతులు శోభిల్లుతాయి కానీ, కంకణాలు ధరించడం వలన కాదు.
స్నానం వలననే దేహశుద్ధి అవుతుంది కానీ, చందన లేపం వల్ల కాదు.
ఇచ్చే గౌరవంతోనే తృప్తి కలుగుతుంది కానీ, భోజనం పెట్టడం వల్ల కాదు.
జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది కానీ తిలకాదులు ధరించడం వల్ల కాదు.
ఇది ‘చాణక్య నీతిశాస్త్రమ్’లోని అధ్యాయం 17లోనున్న 12వ శ్లోకం.
చాణక్యుడి (క్రీ.పూ.350-275) అసలు పేరు విష్ణుగుప్తుడు. మగధ సామ్రాజ్యంలో జన్మించినాడు. ఇతడు చాణక్యుడూ, కౌటిల్యుడూ అనే పేర్లతోనే సుప్రసిద్ధుడు. చాణక్యుడు భారతీయతత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా అగ్రగణ్యుడు. క్రీ.పూ.343-321ల మధ్య మగధరాజ్యాన్ని ఏలిన ఎనిమిది మంది రాజుల నందవంశ ప్రజాకంటక నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చేసి, యువకుడైన చంద్రగుప్త మౌర్యుడికి రాజగురువై శిక్షణ ఇచ్చి ఆతడిని మగధరాజ్య సింహాసనంపై రాజుగా అధిష్ఠింపజేసిన రాజకీయ మేధావి ఈ చాణక్యుడు. తన శిష్యుడు చంద్రగుప్తుడిని రాజుగా తీర్చిదిద్దడానికి ఆరు వేల శ్లోకాలు గల రాజకీయ ‘అర్థశాస్త్రమ్’ను రచించి ఒక సామాన్యుడిని (చంద్రగుప్తుడిని) రాజుగా తయారుచేసిన దిట్ట (కింగ్ మేకర్)గా పేరుగాంచినవాడు ఈ చాణక్యుడు. తన రాజకీయ ‘అర్థశాస్త్రమ్’లో ప్రపంచ ప్రఖ్యాతుడై మేధావులతో ‘ప్లాటో’, ‘అరిస్టాటిల్’, ‘నికోలో మాకియ వెల్లి’లతోనూ పోల్చబడినాడు.
అర్థశాస్త్రమే కాకుడా నీతిశాస్త్రమ్ కూడా రాసినట్టు చాలామందికి తెలియదు. నానా శాస్ర్తాలను కూలంకషంగా అధ్యయనం చేసిన చాణక్యుడు- ‘ప్రణమ్య శిరసా విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుం/ నానా శాస్ర్తోద్ధృతం వక్ష్యే రాజనీతి సముచ్ఛయం’ త్రిలోకాధిపతి, సర్వ వ్యాపకుడు, ప్రభువైన విష్ణువుకు ప్రణమిల్లుతూ నానాశాస్ర్తాల నుంచి తీసుకున్న రాజనీతి, నీతి శ్లోకాలను సంకలనం చేసి చెప్తున్నాను- అంటూ ‘చాణక్య నీతిశాస్త్రమ్’ను వెలువరించాడు. ఇది ‘చాణక్య నీతి దర్పణం’గా కూడా పిలవబడుతోంది. ఈ గ్రంథంలో మొత్తం 17 అధ్యాయాలూ, 332 శ్లోకాలూ ఉన్నాయి. ఇందులో రాజనీతి శ్లోకాలు, సమాజహితం కోసం చెప్పిన శ్లోకాలూ ఉన్నాయి. వీటిలోని నీతులు చాలావరకూ సార్వకాలికాలైనా కొన్ని మాత్రం ఆ నాటి సమాజం వరకే పరిమితం. మానవుడు దీనిని యథాశాస్త్రంగా చదివితే ధర్మోపదేశ కార్యాకార్యాలు, మంచిచెడ్డలు అవగాహన చేసుకోగలడని వక్కాణించినాడు. దేనితో సర్వజ్ఞత్వం సిద్ధిస్తుందో అటువంటి నీతిని లోకహితం కోసం చెప్తున్నానన్నాడు.
‘దుష్టాభార్యా, శఠం మిత్రం’
(అ. 1, శ్లో.5) అనే శ్లోకంలో మాటవినని భార్యా కుత్సితుడైన మిత్రుడు, ఎదురు మాట్లాడే సేవకుడు, విష సర్పం ఉన్న ఇంట్లో నివసించడం మృత్యువే అనడంలో సందేహం లేదంటాడు.
ఏ ప్రాంతంలో ఆదరాభిమానాలు దొరక వో, ఏ వృత్తీ దొరకదో, బంధువులుండరో, విద్యాభ్యాసానికీ అవకాశం ఉండదో, ఆ ప్రాంతం నివాసయోగ్యం కాదనీ, వదిలిపెట్టాలని అంటాడు. (అ.1, శ్లో.8)
ప్రతి పర్వతంలో మాణిక్యాలు దొరకవు. ప్రతి ఏనుగు కుంభస్థలంలో ముత్యాలూ ఉండవు. అన్ని చోట్లా సజ్జనులూ ఉండరని వివరిస్తాడు. (అ.2, శ్లో.9)
అతి సౌందర్యవతి కావడం వల్ల సీత, అతి గర్వంతో రావణుడు, అతి దానంతో బలి చక్రవర్తి బంధితులైనారు. కనుక ‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటూ, అతిని వదిలి పెట్టాలని చెప్తాడు. (అ.3, శ్లో.12)
ధర్మం ధనంతో రక్షింపబడుతుంది, విద్య ధ్యానంతో రక్షింపబడుతుంది, మృదు స్వభావంతో రాజు రక్షింపబడుతాడు. ఇల్లు మంచి పనులతో రక్షింపబడుతుంది. అనే చెప్తాడు. (అ.5, శ్లో.9).
దేశంలో చేయబడిన పాపాన్ని రాజు, రాజు చేసిన పాపాన్ని పురోహితుడు, భార్య చేసిన పాపాన్ని భర్త, శిష్యుడు చేసిన పాపాన్ని గురువు అనుభవిస్తారని వివరిస్తాడు. (అ.6, శ్లో.9)
చెడు రాజ్యం ఉండటం కంటే రాజ్యం లేకపోవడం మేలు, చెడు స్నేహితుడు ఉండటం కంటే స్నేహితులు లేకపోవడం మేలు, చెడ్డ శిష్యులు ఉండటం కంటే శిష్యుడు లేకపోవడమే మేలు, చెడ్డ భార్య ఉండటం కంటే అసలు భార్య లేకపోవడమే మేలు అని చెప్పేస్తాడు. (అ.6, శ్లో.13)
విప్రులు భోజనం చేసి, నెమళ్లు మేఘ గర్జన వినీ, సజ్జనులు ఇతరుల సంపదలను చూసి, పాపాత్ములు ఇతరుల కష్టాలు చూసి సంతోషిస్తుంటారు అంటూ ఇందులో లోకరీతిని విశదపరుస్తాడు. (అ.7,శ్లో.9)
దేవుడు కొయ్యలోనో, రాతిలోనో, మట్టిలోనో ఉండడు. మన భావమునందే ఉంటాడు. దైవస్థితికి భావమే కారణం అని కటువైన నిజం చెప్తాడు. (అ.8, శ్లో.11)
సంపార విష వృక్షానికి అమృతంతో సమానమైన రెండే ఫలాలు. ఒకటి సుభాషిత మాధుర్యాన్ని రుచి చూడటం, రెండు సజ్జన సాంగత్యం కలిగి ఉండటం అంటాడు. (అ.16, శ్లో.18)
పంచ తంత్రానికి మూలమైన ‘తంత్రాఖ్యాయిక (క్రీ.శ.300)లో చెప్పినట్టుగా రాజ గురువు, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడూ, వాచస్పతి, శుక్రుడూ, పరాశరాది ఋషుల సరసన స్మరించబడిన చాణక్యుని నీతిశాస్త్రమ్లో రాజనీతిని గురించీ, సమాజ సంస్కరణ గురించి చెప్పే ప్రతి శ్లోకం, నీతిబోధక సుభాషిత యుతం ప్రతివారికీ పఠనీయం.
– రఘువర్మ (టీయల్యన్) 92900 93933