ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రచయిత్రి-కవయిత్రి వాసరచెట్ల జయంతి సమాజంలోని సమస్యలపై స్పందిస్తూ తన సంఘర్షణ, ఆర్ద్రత, అందోళన, ఆలోచన, ప్రతిఘటనను సాంద్రంగా వినిపిస్తూ..‘నేలవిమానం’, ‘తురాయిపూలు’ శీర్షికలతో రెండు కవితా సంపుటాల్ని వెలువరించి, కవయిత్రిగా తన తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
శర్వమ్మ పేరు-ప్రాధాన్యత: రచయిత్రిగా ఆవిష్కరించిన తొలికథల సంపుటి ‘శర్వమ్మ మరణం’ తోపాటు మొత్తం 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఒక జీవితమే. జీవితాల్లోంచి పుట్టుకొచ్చినదే! రచయిత్రి తన అనుభవంలో చూసిన, విన్న, అంశాలనే తన కథలకు ఇతివృత్తాలుగా చేసుకుని, కొంత కల్పన జోడించి సగటు సజీవ జీవన చిత్రాలను తనదైన శైలిలో చిత్రిస్తూ వచ్చారు. ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్, ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి ఈ కథలకు ప్రామాణికమైన ముందుమాటలు అందించారు.
మ్యారేజి బ్యూరోల్లో కొందరు అబ్బాయిలు తప్పుడు వివరాలు ఇచ్చి, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పరిస్థితుల్ని ‘తూరుపు సిందూరం‘ కథ కండ్లకు కట్టినట్టుగా చూపెట్టారు. కథలో కథానాయిక మోసాన్ని ధైర్యంగా జయించి ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది. ఆర్థిక బలహీనులు ఆత్మీయులు అయినప్పటికీ వారి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరిస్తూ… వాళ్ల బతుకుల్ని ఎదుటివాళ్లు ఏవిధంగా కబ్జా చేస్తుంటారో ‘ఒక చేతివేళ్లు’ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్తి లోంచి, ఆవేదన లోంచి, మేలుకుని..కోలుకుని.. ఆత్మవిశ్వాసం వైపుగా ప్రయాణించిన కథ ‘కొడిగట్టిన దీపం‘. తోడు వీడి వెళ్లాక కథలో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, తనదైన ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితం ప్రారంభించి, భర్త కలల్ని నెరవేర్చిన తీరు కనిపిస్తుంది.
బాధ్యత లేని సంతానానికి గుణపాఠం నేర్పుతూ ఆస్తిని చట్టబద్ధంగా అనాథలకు రాసిచ్చిన కథ ‘శర్వమ్మ మరణం‘. శర్వమ్మ వీలునామా/ శర్వమ్మ నిర్ణయం వంటి పేర్లు కూడా ఈ కథకు సరిపోతాయి. కానీ ‘శర్వమ్మ మరణం‘ పేరే సరైనది. ఆమె చావు కోసం ఎదురుచూస్తూ… ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించిన కుటుంబ సభ్యులకు, ఆమె మరణం తర్వాత ఎదురయ్యే కోలుకోలేని దెబ్బ… ఆస్తి దక్కకుండా పోవడం. ఆమె చావు కోసం ఎదురుచూసిన వాళ్లే జీవచ్ఛవాలు అయిపోతారు.
ప్రాంక్ వీడియోలు, ప్రాంక్ కాల్స్ వల్ల బలహీన మనస్కులకు ఎదురయ్యే ప్రమాదం గురించిన హెచ్చరించిన కథ-వినదగునెవ్వరు చెప్పిన. ‘కొత్తతరం‘ కథ ఒక చైతన్య స్రవంతి. ఈ కథలో రేవతి అనే గ్రామీణ బాలిక తన టీచర్ ద్వారా ప్లాస్టిక్కు బదులుగా జనపనార బ్యాగులు వాడొచ్చని తెలుసుకోవడం, ప్రకృతి పర్యావరణ సందేశాన్ని వ్యాపింపజేయడం ఇందులో కథాంశం. ఫలితంగా అమ్మాయి నివసించే పాలమూరు జిల్లాలో ఉన్న ‘సిద్దాయిపల్లె’ గ్రామం పేరు హైదరాబాద్లో మార్మోగుతుంది. ఇంకా ‘ఎండమావి’, ‘తండ్రి ఋణం’, ‘సంభవామి యుగేయుగే’, ‘దిగ్భంధనం’ వంటి మనసుకు హత్తుకునే, ఆలోచింపజేసే కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.
జయంతి కథల్లో సమస్త జీవన విలువలు కనిపిస్తున్నప్పటికీ, పాత్రలన్నీ మన ఇరుగుపొరుగు వ్యక్తులుగా మనసుకు పరిచయం అవుతున్నప్పటికీ కథల్లో పాలమూరు ప్రాంతీయ జీవన విధానానికి పెద్దపీట వేశారు. అలాగే కథా సందర్భాన్ని అనుసరించి కులాలు-కులవృత్తుల్ని కూడా ప్రవేశపెట్టారు. రచయిత్రిగా జయంతి వాసరచెట్ల పాఠకుల హృదయానికి చేరువయ్యే కథల్ని సృజించారు.
ఇందులో కొన్ని కథలు కథ ముగిసిన తర్వాత కూడా మనసును వెంటాడుతాయి. రాసిన ప్రతి కథలో ఒక అర్థాన్ని లేదా ఒక సందేశాన్ని లేదా ఒక పరమార్థాన్ని అందించిన జయంతి రచయిత్రిగా ఈ కథల ద్వారా తన పరిపూర్ణత ప్రదర్శించారని చెప్పవచ్చు. అందరూ తప్పకుండా పుస్తకం కొని చదవాల్సిన కథలు ఇవి. ప్రతులకు: వాసరచెట్ల జయంతి (9985525355).
-డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
85558 95827