రాత్రి కొండచిలువను దాటుకుని
ముందుకు వెళుతుంటే
పసుపు పచ్చని పూలు పర్చుకుని
స్వాగతం పలుకుతూ..
చల్లని గాలి కెరటాలు ఇరువైపుల తాకుతూ
దేహాన్ని దూది పింజను చేసి
ప్రకృతిలోకి విసురుతున్న వైనం
రోజూ చూడనివి నేడు చూస్తున్నట్లు
దారిపొడవునా అల్లుకున్న కాంతిరేఖలు
తడికళ్లతో కాలం పలకరింపులు
దయను దిద్దుకుని
కరుణను వెంట తీసుకుని తిరిగేవాడే కవి
పగటి మనోవికారాలు లేని
ఇంకా కాలుష్యం నోరు విప్పని
ఈ ఉదయ సంధ్యా సమీరం
కళ్లకు పట్టిన డిజిటల్ బూజును దులిపి
వేలికొసలకు అంటిన కీబోర్డు
దుమ్మును కడిగే నిర్మల హృదయ
అటూ, ఇటూ నడిస్తే కదా నది దొరికేది
నీరవ నిశ్శబ్దంలో ధ్యానిస్తేనే
వెన్నెల వెలుగును పిలిచేది
అసలు దారికి ఆశలు చిగురించేవి
నిన్నటి వేదనలు రాల్చిన చెట్లు
నేడు పచ్చని ఆశల పతాకంపై
సంతకాలు రాస్తున్నాయ్
దారితప్పే మనిషిని ఎన్నిసార్లు దగ్గరికి తీయలేదు
అమ్మ అవని ఆమని!
నాలుగడుగుల నడకలోనే ఎన్నో పరిమళాలు
జీవిత కాలపు నడకలో ఎన్ని వసంతాలో!
ఏంజల్ జలపాతం చూసావా
ఆ సోయగపు వంపులు నిన్నో
సన్నజాజి తీగను చేయకపోతే ఒట్టు
ఆ తుంపరను కనురెప్పలపై చల్లుకో
మనిషి నడుస్తున్న రక్తపు దారిలో…
నరహంతక ప్రభువుల చెలగాటంలో
లేడికూనల మాట ఒకటి విను
అరచేతిలో ఇమిడే పిట్ట
గొంతులో జీరాడే స్వరాన్ని పట్టుకో!
-డా.సుంకర రమేశ్
9492180764