School Fee | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సర్కార్ పట్టించుకోకపోవడం.. విద్యాశాఖ దృష్టిపెట్టకపోవడంతో రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా సాగుతున్నది. యాజమాన్యాల ఆగడాలకు అడ్డ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఎడా పెడా ఫీజులు పెంచేస్తున్నాయి. ప్రత్యేకించి ఈ విద్యాసంవత్సరం కొన్ని యాజమాన్యాలైతే ఫీజులను అమాంతం పెంచేశాయి. కొన్ని స్కూళ్లు 20-30% ఫీజులు పెంచగా.. ఇంకా కొన్ని యాజమాన్యాలైతే 50% పెంచినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నిరుడు ఒక స్కూల్లో 1.10లక్షలున్న ఫీజు ఈ విద్యాసంవత్సరం ఏకంగా రెండు లక్షలకు పెంచినట్టు ఉదహరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు భారం తప్పడంలేదు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ఇతర సామగ్రి ధరలు కూడా పెంచేశాయి. వీటిని బడుల్లోనే కొనాలని షరతు విధించి అందినకాడికి దండుకుంటున్నాయి. ఈ నెల 15 నుంచి బడులు రీ ఓపెన్కానున్నాయి.
జూన్ మొదటి వారం నుంచి విక్రయాలు, ఫీజుల వసూళ్లు జోరందుకున్నాయి. యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఫీజులు కట్టించుకుంటున్నాయి. రాష్ట్రంలో 1-12వ తరగతి వరకు 13వేలకు పైగా బడులుండగా, వీటిల్లో దాదాపు 49లక్షల విద్యార్థులున్నారు. ప్రత్యేకించి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని స్కూళ్లే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో 120కి పైగా పాఠశాలలు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఫీజులు ఐదారు లక్షలు మించి ఉన్నాయి. ఇవి చాలవంటూ లంచ్, స్నాక్స్, ట్రాన్స్‌పోర్టు ఫీజులు రూ. 50 నుంచి రూ. లక్ష వరకున్నాయి. కొంతకాలం క్రితం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రులు ధర్నాకు దిగాల్సి వచ్చింది.
ఫీజుల నియంత్రణపై విద్యాకమిషన్ సర్కార్‌కు కొన్ని సిఫార్సులు చేసింది. ఇవేకాకుండా విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని సర్కార్‌కు నివేదించింది. ఫీజుల నియంత్రణ, ప్రైవేట్ స్కూళ్లల్లో 25% సీట్లు (విద్యాహక్కు చట్టం అమలు), బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి క్లాసులను ప్రారంభించాలి. ఇలాంటి అతి ముఖ్యమైన సిఫార్సులను సర్కార్ అటకెక్కించింది. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ డ్రాఫ్ట్ బిల్లులను విద్యాకమిషన్ సర్కార్‌కు సమర్పించింది. రెండేండ్లకోసారి స్కూళ్లు 8% ఫీజులు పెంచుకోవచ్చని, అదే 9% దాటితే మాత్రం ఫీజుల నియంత్రణ కమిటీని సంప్రదించేలా గైడ్‌లైన్స్ సిద్ధం చేసింది. ఈ బిల్లు సర్కార్‌కు చేరి నెలలు గడుస్తున్నా.. ఒక్క అడుగు ముందుకు పడింది లేదు.
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరిలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిధి దాటితే స్కూళ్ల అనుమతులు రద్దుచేస్తామని హెచ్చరించారు. నిర్ధేశిత ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే.. జరిమానా విధిస్తామని, అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని వాపసు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోగా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై సర్కార్ గప్‌చుప్ అయ్యింది. ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి వస్తే ఫీజుల పెంపు సాధ్యంకాదని భావించిన యాజమాన్యాలు ముందే అప్రమత్తమయ్యాయి. ఎడా పెడా ఫీజులు పెంచాయి. కొన్ని స్కూళ్లు అయితే ఏకంగా 50% బాదేశాయి. ఒక రకంగా ఫీజుల మోతకు సర్కార్ తీరేకారణమని హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన సర్కార్ ఫీజుల పెంపునకు కారణమయ్యిందని ఫైర్ అవుతున్నారు.
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టింది. స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేందుకు వీలులేకుండా చట్టం ద్వారా చెక్‌పెట్టింది. టీవీకే సర్కార్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే తమిళనాడు స్కూల్స్(ఫీజు నియంత్రణ) సవరణ బిల్లుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఉంటుంది. రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం నుంచి ఒకరికి ఈ కమిటీలో చోటు కల్పించారు. పాఠశాలలో మౌలిక వసతులు, ఖర్చులను పరిశీలించి ఫీజులు నిర్ణయిస్తుంది. ఈ కమిటీ ఖరారుచేసిన ఫీజులు మూడేండ్లపాటు అమల్లో ఉంటాయి. ప్రభుత్వం ఆమోదించిన ఫీజు వివరాలను నోటీసుబోర్డు, వెబ్సైట్, అడ్మిషన్ ఫారాలపై స్పష్టంగా ముద్రించి ప్రదర్శించాలి. ఉల్లంఘిస్తే స్కూళ్ల గుర్తింపును రద్దుచేస్తారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా కాంగ్రెస్ సర్కార్ నియంత్రణ చట్టం తీసుకురాకుండా ప్రైవేట్ దోపిడీకి సహకరిస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రైవేట్ స్కూల్లో చదివించడమే పాపం అయ్యినట్టుంది. ప్రతి ఏటా10-15% ఫీజులు పెంచుతున్నారు. పుస్తకాలు, నోటుబుక్స్ స్కూళ్లోనే కొనాలి. ఎంత చెబితే అంత కట్టాల్సిందే. రూపాయి కూడా తగ్గించడంలేదు. బయట కొంటే ఒప్పుకోరు. వీటికి రూ.8-10వేలు వసూలు చేస్తున్నారు. యూనిఫామ్, షూస్ ఇలా జూన్ వచ్చిదంటే అప్పులు చేయాల్సి వస్తున్నది. క్రెడిట్‌కార్డులు వినియోగించాల్సిన పరిస్థితులున్నాయి. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతే ఎలా కట్టాలి. ప్రభుత్వం ఈ ఫీజులను నియంత్రించాలి. లేదంటే సామాన్యులు చదివించలేని పరిస్థితులొస్తున్నాయి.
– సత్యనారాయణ, విద్యార్థి తండ్రి, నల్లగొండ