అతను పలికిందల్లా పద్యం. చెప్పిందల్లా తత్త్వం. రాసిందల్లా కవిత్వం. అతని మాట తిరుగులేని శాసనం. అది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అందుకే నేటికీ ఆయన పద్యం ప్రజల నాలుకలపై నాట్యం చేస్తూనే ఉన్నది. ఆ తత్త్వం ప్రజల హృదయాల్లో పదిలంగా ప్రతిష్ఠితమైనది. అందుకే ఆయనకు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఆ తత్త్వకవిని ఆరాధిస్తున్నారు. అతనే.. తత్త్వయోగి, మహాకవి రామసింహకవి. అతని అసలు పేరు ఠాకూర్ రాంసింగ్. 1886-1963 మధ్య జగిత్యాలకు దగ్గరలోని రాఘవపట్నంలో ఈ కవి జీవించినట్టుగా తెలుస్తున్నది. ఆయన కవితాశక్తి, వాక్ప్రభావం తెలిసిన ఆ ఊరి ప్రజలు ఆయనను రామసింహకవిగా పిలిచేవారు. ఇది ఆ కవిపై ఆ గ్రామ ప్రజలకు ఉన్న భక్తిభావనకు మచ్చుతునకగా చెప్పవచ్చు.
ఊరిలో అవినీతితో అధికారం చెలాయిస్తున్న సిక్కు కుటుంబానికి చెందిన గురుద్వారా పూజారిని హత్య చేశాడన్న అభియోగంపై రాంసింగ్ పదహారు సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ జైలులోని ఒంటరితనం నుంచి, సామాజిక వివక్ష వల్ల భరించలేని బాధ నుంచి రాంసింగ్లోని తత్త్వదృష్టి గొప్ప కవితగా బయటకు వచ్చింది. ఆ వేదనలో నుంచి కవి పుట్టాడు..సమాజంలో ఎదురవుతున్న అవినీతి, అరాచకాలు, అక్రమాలను తన కవితాగ్నితో కడిగి పడేశారు.
గొప్ప తపోజ్ఞానిగా, యోగిగా అతనిలోని మహత్తరశక్తి దేదీప్యమానంగా కాంతులు విరజిమ్ముతూ వచ్చింది. అది జనసమూహానికి వెలుగునిచ్చే జ్యోతిలా నిలిచింది. అజ్ఞానంలో, అమాయకత్వంలో కొట్టుమిట్టాడుతున్న జనాన్ని విజ్ఞానం వైపు నడిపించడానికి అది దిక్సూచిలా మారింది..
‘బాదుషా ఫర్మానులూ/మర్యాదకే కానూనులూ వాదియైనను లంచమే/ ప్రతివాదియైనను లంచమే’
అలా అవినీతి మార్గంలో దోచుకోవడం వల్ల నిరుపేదలకు న్యాయం జరగడం లేదు అంటూ లంచం, దోపిడీ, ఉన్నత కులాల అకృత్యాలపై ఎన్నో విధాలుగా ఆయన గళమెత్తారు. ఆయన కవిత్వమంతా సామాజిక లోటుపాట్లపై నిప్పులవాన కురిపిస్తూ బలహీనవర్గాల చైతన్యానికి కొత్తదారులు వేసింది. వారిని ప్రగతిబాటలో నడిపింది. కుల వివక్షపై రామసింహకవి చేసిన కవితా పోరాటం అసామాన్యం. మానవులంతా ఒక్కటే అని ఎందరు చెప్పినా రామసింహకవి చెప్పిన తీరు అనన్యం. అసాధారణం.
‘కలియుగ వర్ణాశ్రమ
ధర్మములన్ తెలిపిన నొకవింతా
కల జాతులు సంకరమైనవి
పశువుల వలే జగమంతా
ఇలలో తమ తమ కుల మర్యాదలు తెలియక కొందరు తెలిసి కొందరును
దొలగి చెడ్డ నడకలతో పడిబడి ఖలులై
మత భ్రష్టులైరి హరిహరి’
అని ఆయన కుమిలిపోయారు. మూఢత్వంలో మగ్గి నశిస్తున్న వారి గురించే కాకుం డా ఆధునిక నాగరికత ముసుగులో కొందరు ప్రవర్తిస్తున్న వికృత చేష్టలను కూడా ఎప్పటికప్పుడు ఆయన ప్రశ్నించేవారు. జైలు గోడలపై తొలిసారి పుట్టిన ఆయన కవిత్వం ఎందరినో బానిసత్వం నుంచి విముక్తి చేసే పదాలను పుట్టించింది. తెలుగు,ఉర్దూ మేళవింపుతో వచ్చే తన సాహిత్యం ఆస్వాదించే వారికి హాయిగా..అవినీతిపరులకు కొరడాదెబ్బగా.. సోమరిపోతులకు చెంపపెట్టులా ఉంటుంది. వివక్ష వల్ల తాను పదహారేండ్లపాటు జైలు శిక్ష అనుభవించడం వల్ల నిప్పుకణికలా, ప్రజ్వలించిన పద్యంలా, పదునైన ఖడ్గంలా చెలరేగిపోయారు రామసింహకవి. తాను ఏది చెబితే అదే జరిగింది. మహత్తరశక్తుల్ని సముపార్జించుకున్న మహోన్నతమూర్తి రామసింహకవి. పదాలు, వాగ్గేయ సంపద, సాహిత్యంతోఎందరినో చైతన్యపరిచారు. అందుకే ప్రజలు దేవుడిగా పూజించే స్థాయికి ఎదిగారు రామసింహకవిని. ఆయన వల్లె రాఘవపట్నం అనే ఊరును ‘సిక్కులోల్ల రాఘవపట్నం’ అని జనం పిలిచేవారు.
‘బంధ విమోచనం బనుట భ్రాంతియే కాని మరేమి లేదు దుర్బంధములన్నియు మానవుల పాపములే యలవాటు కట్టులే…’
అంటూ.. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిపై మాలిక, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలను ఆయన రచించారు. ఆయన రాసిన ‘విశ్వకర్మ శతకం’ ప్రసిద్ధి చెందింది. ‘విశ్వకర్మ ప్రకాశ మండపము’, ‘శ్రీరామలక్ష్మణ ప్రబోధకములు’ అనే పద్యకావ్యాలు రాశారు. గేయకృతుల్లో ‘కలియుగ వర్ణాశ్రమం’, ‘దుష్ట ప్రపంచ వర్ణనము’, ‘భజన కీర్తనలు’, ‘నారాయణమాల’ లాంటివి ముఖ్యమైనవి. ఇవేకాకుండా ‘యధార్థ రామాయణం’, ‘యధార్థ భారతం’, ‘యధార్థ్ధ భాగవతం’లాంటి 100కు పైగా విశేష గ్రంథాలను ఆయన రచించారు. సర్వేశ్వరుని స్తుతితో ఉన్న విశ్వకర్మ శతకంలో ఎక్కువ సామాజిక విమర్శ కనిపిస్తుంది. దానిని ప్రతిఖండిస్తూ ‘విశ్వకర్మ ప్రకాశ మండనం’ రాశారు.
సమాజనీతిని బోధిస్తూ వంద పద్యాలతో రాసినదే శ్రీరామలక్ష్మణ ప్రబోధం. కవిత్వం, పద్యం, గేయం ఇలా ఏ ప్రక్రియలో రాసినా దాని వెనుక సామాన్యుని వేదనలే ఉంటాయి. దైవభక్తి పరాయణుడైన రామసింహకవి అణగారిన ప్రజల వైపు నిలబడి వారితోనే గుడి కట్టించుకుని పూజలందుకోవడం కవులు, సాహితీవేత్తలకు దొరికిన అరుదైన గౌరవం. ఇది కవులకు సమాజం పట్ల బాధ్యతను పెంచే అంశం.
‘లుబ్ధమత పాషాణ దుర్బుద్ధీ
ధనముండి ప్రారబ్ధమేమిరా
పాపమభివృద్ధి
పాపమునకే పెరుగు నీ ధనము
కరె తీగ తెట్టెకు శాపమున్నాదెరుగవా ఘనము?
పాపమునకే పెరుగు నీ ధనము…
పాపమునకే వ్యయంబవును’
లోభులైన అధికారుల ఆగడాలను నిరసిస్తూ ఇలాంటి అనేకమైన తత్త్వాలను ఆశువుగా ఆయన చెప్పారు. ప్రతీ తత్త్వం సూటిగా, ఘాటుగా అరాచకాల పాలిట, అకృత్యాల పాలిట పదునైన ఆయుధంలా దూసుకుపోయేది. శతకాలు, కావ్యాలు, గేయాలు, విమర్శనా గ్రంథాలు రాసిన రామసింహకవి పద్యాలు గోలకొండ సంచికలో కూడా ప్రచురితమైనా చాలావరకు ఆయన రచనలు లభ్యం కావడం లేదు. మహాతత్త్వకవిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామసింహకవి 1963 ఆగస్టు 11న మరణించారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939