నేను మీకో చిన్న కథ చెప్పాలనుకున్నా
చెవులు మూసుకొని, కళ్లు తెరిచి వింటారని.
అనగనగా, ఓ తుమ్మెదుండేదని..
దాని రెక్కలు విరిచేస్తున్నారని..
గొంతెత్తి అరవాలనుకున్నా.
కాళ్లు లేకపోయినా మన కోసం నిలబడుతుందనీ
కాళ్లున్నప్పటికీ మనం చతికిలబడతామనీ
కళ్లు లేవనే వంకతో న్యాయం చూడకపోయినా
కళ్లుండీ మనం గుడ్డితనం అభినయించామనీ
అది వసంతాన్ని కలగంటుంటే
మనం శిశిరంలో నిద్దరబోయామనీ
నలిగిపోతున్న తుమ్మెదను చూసి
తడిబారిన కళ్లను రహస్యంగా
తుడుచుకోడానికి సైతం మనం భయపడ్డామనీ
కానీ, మీకులాగే, నాకులాగే..
ఎవరి గొంతూ పెగల్లేదు.
అదృశ్య రెక్కలతో, సూర్యోదయానికి
స్వాగతం పలకబోయిన తుమ్మెద
జటాయువులా ఒరిగిపోయింది
రాయని నాటకంలోని పాత్రలా
మేకప్ తుడుచుకోకుండానే
వేదికపై నుంచి చక్రాల కుర్చీ దొర్లిపోయింది.
దుఃఖం గూడుకట్టిన ఆ ముఖం చూసినప్పుడే
అద్దంలో చూసుకోడానికి ముఖం చెల్లలేదు
ఇప్పుడీ గట్లు తెగిన ఈ తుఫాన్ సెగను
చల్లార్చడానికి రాలే కన్నీటి బొట్లు ఏపాటి?
కథ ఇలా నిస్సహాయంగా ముగుస్తుందనుకోలేదు
కళ్లు మూసుకొని, చెవులు రిక్కించి
దేశపు నడి మధ్యలో శరణార్థిలా దిక్కులు చూస్తున్నా,
ఎప్పుడైనా ఓ తుమ్మెద ఝంకారం వినిపిస్తుందని
దింపుడు కల్లెపు భ్రమ.
– దేశరాజు