చదువుల నావ అది
సోపతి సోర్సు గది
బాలల భవిత ఇది
కన్నోళ్ల కలల గది
రేపటి రూపమిది
మువ్వన్నెల గర్వమది
గురుకుల ‘వసతి గది’..!
పాకురు ట్యాంకు అది
మారని పంక గది
‘వంకర’ వంట గది..
ఎలుకల కొట్టమది
చినుకుకు వణికె గది
చీకటి చిమ్మె ఇది..!
‘శిథిల అవస్థ’ గది
‘కాటి’కి దారి గిది
గురుకుల ‘వసతి ఇది’..!
పేదల ‘పెట్టె’ గది
జల్లెడ లేని గది
‘తెల్లటి చరిత’ లేని
నల్లటి రాత ఇది
అయినా వసతి గదే..!
సైన్స్ ల్యాబు అది
పాటల తోట గది
‘ఎవరెస్టు ఎత్తు’ గిది
అయినా
ఇంకా అద్దె గదే..!
‘ఓట్లు’ లేని గది
పాలకులకు
‘పడని’ గది
‘నిధులు’ రాని గది
మసక సూపు గిది
సర్కారు కక్ష ఇది
సంగతి ఏంది మరి?
ఒత్తిడి ఓడేది
సదువు గెలిసేది
‘ఫిన్లాండ్’ దేశమది
కానని ‘మెల్ల’ మనది..!
కూలిన గోడలల్ల
మొలిచిన
మొలకలవి..
కుళ్లిన బువ్వ గిన్నెల
‘రాలిన మొగ్గ’లెన్ని?
గుండెల బాధ ఇది
‘గురుకుల గోస’ గిది…
– సురేంద్ర బండారు 90108 47120