ఇతర భాషా సాహిత్యాల నుంచి కొన్ని కవితా రూపాలు తెలుగులోకి వచ్చి చేరుతూ ఉండటం గత 50 ఏండ్ల నుంచి జరుగుతున్న పురోగతి. జపాన్ నుంచి హైకూ వచ్చింది. ఫారసీ నుంచి గజల్, రుబాయి వచ్చాయి. కొంతమంది ఇంగ్లిష్ సానెట్ను, హిందీ దోహాను కూడా తెలుగులోకి తేవడానికి కొంత ప్రయత్నం చేశారు. కానీ, అవేవీ తెలుగులో వేళ్లూనుకోలేదు. బయటి రూపాలైన హైకూ, గజల్, రుబాయి తెలుగులో కొంతమేరకు స్థిరపడ్డాయి. రుబాయి తెలుగు పద్యానికి దరిదాపుల్లో ఉండే ఒక కవితా రూపం.
తెలుగు పద్యం లాగే రుబాయి నాలుగు పాదాలు కలిగి ఉంటుంది. నిర్దిష్టమైన స్థానంలో కచ్చితంగా రదీఫ్, రదీఫ్కు ముందు కాఫీయా అనబడే అంత్యప్రాస లాంటిది ఉండటం కనీస ఛందస్సు. ఇంకా మాత్రల సమత, గతులతో కూడిన గమనం అభిలషణీయమైన ఛందస్సు. ఇట్లా చూసినప్పుడు తెలుగు పద్యం కన్నా కఠినమైన నిబంధనలు ఉన్న రుబాయి సహజంగానే తెలుగు వాళ్లకు కష్టమైన రూపంగా తొందర్లోనే అర్థమైంది. ఆ రూపానికి పూర్తిగా కట్టుబడి రచన చేయడం, పాఠకులకు చేరువయ్యేంతగా చమత్కారం సాధించడం చాలా కష్టమని చాలామంది భావించారు. డాక్టర్ సినారె రుబాయిని ఇంకా కొంచెం విస్తరించి సరళ ఛందస్సుతో ప్రపంచ పదులను సొంతంగా రూపొందించుకున్నారు తప్ప రుబాయిని కొనసాగించలేదు. అంతకుముందు రాసిన దాశరథి లాంటి కవులు రదీఫ్ కాఫీయాలను అంత్యప్రాసలుగానే భావిస్తూ రాశారు.
‘కళ్లెం ఉన్నది మన చేతిలో
అయినా గుర్రం పడె గోతిలో
దప్పి తీరదని నేనంటాను
నీళ్లే లేని మన నూతిలో’
అనే తన ప్రసిద్ధ రుబాయి ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.
పూర్తిస్థాయి రదీఫ్, కాఫీయాలు పాటిస్తూ రాసిన రుబాయి కవి తెలుగులో తొలిగా తిరుమల శ్రీనివాసాచార్య. ఆయన కూడా విస్తృత సంఖ్యలో రుబాయిలు రాయాల్సిన లక్ష్యం పెట్టుకోవడం వల్ల చాలాచోట్ల రదీఫ్ను కాఫీయా స్థాయికి తీసుకువచ్చారు. ఇంకా చెప్పాలంటే అంత్యప్రాసనే రదీఫ్గా భావిస్తూ కూడా రాశారు. అందువల్ల తెలుగు రుబాయిలలో రదీఫ్ అంటే అంత్యప్రాస అనే ఒక దురభిప్రాయం ప్రబలింది.
రుబాయి అనే పేరు పెట్టుకొని రాస్తూ ఉన్నప్పుడు దాని కచ్చితమైన ఛందస్సు పాటించకుండా ఉండటం సరికాదని భావిస్తూ నేను ‘తెలంగాణ రుబాయిలు’ కావ్యం ద్వారా రూప స్థిరీకరణ చేయడానికి ప్రయత్నించాను. తెలంగాణ రుబాయిలు వచ్చాక కూడా నాతో చాలా సందర్భాల్లో రుబాయి చర్చ చేసినవాళ్లూ తాము రాస్తూ ఉన్న క్రమంలో ఛందస్సు పట్ల అంత శ్రద్ధ వహించకుండా రాస్తూ దానికి రుబాయి అని పేరు పెట్టడం నాకు ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది.
హైకూలు, గజల్లు, రుబాయిలు, దోహాలు, సానెట్లు తెలుగులో వచ్చినప్పటికీ వాటికి మౌలిక భాషలో ఉన్న కీర్తిలో 10 శాతం కూడా తెలుగులో అందుకోలేకపోయాయి. అందుకు కారణం ఆ భాషకు, ఆ కవితా రూపానికి ఒక విడదీయరాని లంకె ఏదో భాష మారినప్పుడు విడిపోతూ ఉంటుందని అనిపిస్తుంటుంది. ఈ సందర్భంలోనే సామల సదాశివ చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. తెలుగులోని ఆటవెలదిని, తేటగీతిని ఇతర భాషలలో రాయడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఊహించాలని అంటారాయన. నిజమే! ఎక్కువ మంది తెలుగులో ప్రయోగించలేక పోయిన సానెట్, దోహాలను పక్కకుపెట్టి గజల్లు, రుబాయిలు, హైకూలు తెలుగులో విజయవంతమైనవనే అనిపించినా వాటి విజయం కూడా పాక్షికమే. ఎందుకంటే హైకూలలో భౌతిక ఛందస్సేదీ ఉన్నట్టు అనిపించకపోయినా ఒక తెలియని మార్మిక ఛందస్సు అందులో ఉన్నదని, దాన్ని భాషాంతరీకరణ చేయడం వల్ల మనం దాని మౌలికతను పట్టుకోలేకపోతున్నామని తరచూ అనిపిస్తూ ఉంటుంది. ఇక గజల్లు, రుబాయిల విషయానికి వస్తే వాటికి కఠినమైన భౌతిక ఛందస్సు ఉంది. కానీ, చాలామంది తరచూ భౌతిక ఛందస్సును వయొలేట్ చేస్తూ రాస్తూ ఉన్నా రు. ముఖ్యంగా రదీఫ్ను సమాన పద పునరుక్తి లాగా కాకుండా అంత్యప్రాసలాగా వాడుతూ ఉన్నారు.
అత్యంత సుప్రసిద్ధ కవులైన వాళ్లు కూడా తెలిసో, తెలియకో రదీఫ్ అంటే అంత్యప్రాస అనుకుంటున్నారు. ఇక కాఫీయా గురించిన చింత చాలామంది కవులకు ఉండటం లేదు. ఇక్కడ ఈ విషయాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి ఎలాంటి ఛందోలోపం లేకుండా రాస్తున్నవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.
రుబాయిలో నాలుగే పాదాలుంటాయి. అందులో ఒక మూడో పాదంలోనే కొంత స్వేచ్ఛ ఉంటుంది. మిగిలిన మూడు పాదాల్లో రదీఫ్గా ఒకే పదం ఉండితీరాలి. కాఫీయా అన్నది రదీఫ్కు ముందు ఉండే పదం. ఇది మిగిలిన మూడు కాఫీయాలతో మైత్రి కలిగి ఉండాలి. ఈ మాటను చాలామంది అంత్యప్రాసగా భావిస్తూ ఉంటారు. కానీ, కాఫియా శబ్ద ప్రాధాన్యంతో కాకుండా, ధ్వని ప్రాధాన్యంతో ఉంటుంది.
రుబాయి పారసీ ఛందో రూపం. అది మొదలు పారసీలో పుట్టిందా? అరబ్బీలో పుట్టిందా? అనే చర్చ ఉంది. అది ఉర్దూ నుంచి తెలుగులోకి ప్రవేశించింది. అర్బా అనే అరబ్బీ పదం నుంచి రుబాయి అనే పదం ఏర్పడింది. అర్బా అంటే నాలుగు అని అర్థం. ఇంచుమించు తెలుగులో పద్యం లాంటిది. రుబాయిలో 1వ, 2వ, 4వ పాదాలకు రదీఫ్ కాఫీయాల నియమం ఉన్నది. 3వ పాదంలో ఆ నియమాలు ఉండనవసరం లేదు. ఇక ఐచ్ఛికంగా మాత్రాఛందస్సును కూడా వాడుతూ ఉంటారు. అంటే అన్ని పాదాలలో మాత్రల సమత కూడా పాటిస్తారు. అయితే ఉర్దూ మహాకవులు కూడా రదీఫ్ను కాఫీయాను వదిలివేసిన సందర్భాలు అక్కడక్కడ కనిపిస్తాయి. దీన్ని ఆధారం చేసుకొని రదీఫ్ కాఫీయాలు ఐచ్ఛికం మాత్రమే అనే అభిప్రాయానికి రావడం సరికాదు. అలా చూసినప్పుడు రదీఫ్ కాఫీయా మాత్రల సమత అనేది రుబాయిల ఛందస్సుగా చెప్పుకోవచ్చు. నరేశ్ నదీమ్ అనే విమర్శకుడు తన ‘ఉర్దూ కవితా ఔర్ ఛందశాస్ర్త్’లో చెప్పిన ‘రుబాయి చార్ మిశ్రోంకి హోతీ హై, జిస్మే పహలే, దూస్రే, చౌతే మిస్రే మే రదీఫ్ ఔర్ కాఫియా హోతే హై’ అన్న మాటలు సాధికారికమైనవి. అంటే ఒక రుబాయిలో ఉండవలసినవి రదీఫ్, కాఫియా అనే భౌతిక ఛందస్సు. ఇంకా మాత్రల సమత, నాలుగు పాదాలు కలిసి ఒకే అభిప్రాయాన్ని సమర్థిస్తూ నడవడం, భావ చమత్కారం అనేవి భావ ఛందస్సు అన్నమాట.
రదీఫ్..
‘శిల్పి చేతి ఉలి చతురిమ చాటుతాడు కవి
చిత్రశిల్పి కుంచ మహిమ చెప్పుతాడు కవి
గాయక కళ మృదు మధురిమ నాట్య విలాసం
లలిత కళా జగతి సొగసు తెలుపుతాడు కవి’
కాఫియా..1, 2వ, 4వ పాదాలలో ఉన్న రదీఫ్కు ముందటి పదం కాఫియా. ఇందులో మూడు పాదాలలోని రదీఫ్కు మైత్రి ఉండాలి. అది స్వరమైత్రి మాత్రమే కానీ అంత్యప్రాస కాదు. తెలుగులో అంత్యప్రాస అనగానే హల్లులతో ముగిస్తే సరిపోతుందనే భావంలో ఉంటారు. కానీ, కాఫియాలో స్వరమైత్రి ముఖ్యం. అంటే ఒక కాఫియా అకారంతో ముగిస్తే మిగిలినవన్నీ అకారంతోనే ముగియవలసి ఉంటుంది. లేదా ఇకారంతో ముగిస్తే మిగిలినవి ఇకారంతోనే ముగియవలసి ఉంటుంది. లేదా ఉకారంతో ముగిస్తే మిగిలినవి ఉకారంతోనే ముగియవలసి ఉంటుంది. మధ్యయుగాల నాటి ఉర్దూ కవి సౌదా ఇలా చెప్తాడు.
‘జబ్ నజర్ ఉస్కీ ఆన్ పడ్తీ హై
జిందగీ తబ్ ధ్యాన్ పడ్తీ హై
ఏక్ కే మూహ్ సే జిన్ ఘడీ నిక్లే
ఫిర్ తో సౌకీ జబాన్ పడ్తీ హై’ ఇందులో ఆన్ ధ్యాన్ జబాన్లు కాఫియాలు. వీటిలోనే నకారాంత స్వరం వీటికి బలాన్ని చేకూర్చింది. ఇలా తెలుగులో చక్కటి కాఫియాను నిర్వహిస్తూ రాసిన కవిత్వం ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ రుబాయిలలో గమనించవచ్చు.
‘మూల చుక్కా పొడవ శుభమైతది
అమావాస్య నిశి గూడ శుభమైతది
బలమైన కాంక్షలే నడిపించితే
దుర్ముహూర్తము కూడ శుభమైతది’
ఇవేకాకుండా మాత్రల సమత అనేవి కూడా రుబాయిని అలంకారమయం చేస్తాయి. ఈ విషయంలో మాత్రం తెలుగు కవులు ముందే ఉన్నారు. చాలా సందర్భాలలో రదీఫ్ కాఫియాలను పట్టించుకోకుండా రాసినప్పటికీ మాత్రల సమతను చాలామేరకు అలవోకగా పాటించారు. ఇందుకు కారణం తెలుగువాళ్లకు గేయంతో ఉండే సాన్నిహిత్యం. కె.ప్రభాకర్ తన ప్రేరణలో ఇలా చెప్తాడు.
‘నేను లోకము విడిచిన తరుణం
నీకు మిగిలేది నా ప్రేమాభరణం
నీ మనసు మంచి గంధపు చెక్క
నీ వయసు వగరుపోని వక్క’
ఇందులో రదీఫ్, కాఫియాల సంగతి కాసేపు పక్కనపెడితే అన్ని పాదాలు సమాన మాత్రలతో నడుస్తాయి. ఇలా రాసినవాళ్లు చాలామంది తెలుగులో కనిపిస్తారు. తెలుగులో రుబాయి రాస్తూ భావ చమత్కారాన్ని రాసినవాళ్లు మాత్రం తక్కువ మందేనని చెప్పక తప్పదు. రుబాయిలను అనువాదం చేసినవాళ్లలో అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, బూర్గుల రామకృష్ణారావు, దువ్వూరి రామిరెడ్డి, సామల సదాశివ లాంటి వారలు ఉద్ధండులైన పండిత ప్రకాండులైనప్పటికీ వారు రుబాయిల అనువాదాన్ని తెలుగు కవితా రూపాలైన పద్యాలలోనే చేయడానికి కారణం రుబాయిలు తెలుగులో ఒదగడం చాలా కష్టమనే భావంతోనే. దాశరథి తన కవితా సృజనలో ఒక భాగంగా రుబాయిల రచన చేసినప్పటికీ అది తన ప్రధాన కవితా రూపంగా ఆయన భావించలేదు. మరో అగ్రకవి వరేణ్యులు డాక్టర్ సినారె ఈ రదీఫ్, కాఫియాలను పాటిస్తూ రుబాయి రాసి మెప్పించడం చాలా కష్టమైన పని అని ఒప్పుకొన్నారు. అందుకే, ఆ ఛందస్సును పరిమితంగా పాటిస్తూ 4 పాదాలకు ఇంకొక పాదాన్ని చేర్చి ప్రపంచపదులు అనే కొత్త కవితారూపాన్ని సృష్టించుకొని అందులో తన రచన కొనసాగించారు. ఆ రకంగా చూసినప్పుడు తెలుగులో రుబాయిల రచనకు ఆ రంగంలో నిబద్ధమైన కృషిచేసిన కవులు తప్ప మిగిలినవారు అంత సులభంగా పాఠకులకు గుర్తుండలేరు. చెప్పడం సులభమే కానీ, రాసి మెప్పించడం చాలా కఠినమైన కవితా రూపం రుబాయి.
అయితే ఇదంతా రూప చర్చ. నిజానికి రుబాయిల రూపం ఎంత జాగ్రత్తగా నిర్మించవలసి ఉంటుందో అంతకంటే ముఖ్యంగా భావచమత్కార సాధన కోసం ప్రయత్నించవలసి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రూపం భౌతికం, సారం ఆత్మ. ఆత్మలేని శరీరం మనుగడలో ఉండలేనట్టే భావ చమత్కారం, మెరుపు లేకుండా రుబాయిలు లక్ష్యాన్ని సాధించలేవు. ఒక ఉర్దూ కవి అంటాడు: ‘క్యా కమాతే హో జీవన్ భర్/ న కఫన్కు జేబ్ హై న ఖబర్ మే అల్మారాహ్’ ఇది రుబాయిలో అంతర్భాగంగా వచ్చే ఒక పాదమే కావచ్చు. కానీ, అందులోని చమత్కారం భావగర్భమైంది. అలాగే అమ్జద్.. ‘కహతీ హై హమేషా అఖిర్ ఏ క్యోం వో క్యోం/ ఇస్ క్యోం కా జవాబ్ క్యా హై మాలూమ్ నహీ’లోని దైవికపరమైన భావ చమత్కారం కూడా అత్యంత అరుదైన కవిత్వాభివ్యక్తి. తెలుగులో దాశరథి జ్వాలా లేఖినిలో రాసిన ‘మంచివాణ్ని పిచ్చివాణ్ని చేసేదానా/ ఇష్టముండి లేనట్లుగ చూసేదానా/ ఉత్తరాలు రాయకుండా ఉడికిస్తావే/ బొటనవేలితో నేలన రాసేదానా’ అన్న రుబాయిలో ఉన్న చమత్కారాన్ని చూసినప్పుడు చమత్కారం మాత్రమే, అదీ భావచమత్కారం మాత్రమే రుబాయిల ఆత్మ అని అవగతం అవుతుంది. ఇలా.. ‘ఎన్ని జోలలు మదికి పాడను, తనువు ఒరిగే లోపుగా!/ కలతపెట్టే కళలు ఎన్నో, రేయి ముగిసే లోపుగా,/ ఏ క్షణానికి ఆ క్షణం, యమ యాతనే కద జీవనం/ కన్నీటి నెంతగ మింగవలెనో, కనులు తడిసే లోపుగా!’ (పెన్నా శివరామకృష్ణ)