మహాకవి జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం తెలుగునాట సుప్రసిద్ధం. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయె/ కవియు మరణించె ఒక తార గగనమెక్కె/రాజు జీవించు రాతి విగ్రహములందు/సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’ అనే పద్యం ఇప్పటికీ కవులు వేదిక మీద నిత్యనూత నంగా ఆలపిస్తున్నారు. ఫిరదౌసి కవి విషాద జీవితాన్ని జాషువా కవి రాయడం కన్నా ముందు సురవరం ప్రతాపరెడ్డి ‘సుల్తాన్ మహమూద్ ఘజ్నవీ’ అనే ఖండిక రాశారు.
ఇది చారిత్రక, కవి జీవితానికి సంబంధించిన కథ. 174 పంక్తుల గీతమాలికలో రాసింది. ఈ మాలిక 1923లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి వెలువడిన ‘రెడ్డి రాణి’ అనే పత్రికలో అచ్చయింది. (సంగిశెట్టి శ్రీనివాస్ సంకలనం చేసిన సురవరం కవిత్వం పుస్తకానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముందుమాట). ఇందులోని అంశం భారతదేశంపై అనేకమార్లు దండయాత్రలు చేసిన మహమూద్ ఘజ్నవీ చరిత్ర తెలుపడం. మహమ్మదీయులు భారతదేశంపైకి చొరబడడం అతనితోనే మొదలు. హిందువులు ఎంత గొప్పవీరులై అతనినెదిరించారో ఇందులో వివరించారు.
సుమారు 95 పంక్తుల తేటగీతిమాలికలో గజనీ దాడులను, హిం దూదేశాన్ని కొల్లగొట్టడం గురించే వివరించారు. భరత ఖండపు పచ్చిమ భాగమందు/కలదు ‘కాబూలు’ దేశంబు ఖ్యాతి గాం చి/దానినేలె ‘సుబక్తగీన్’ ధర్మబుద్ధి/తండ్రి పిమ్మట’ మహమూదు తక్తు నెక్కె/ఎక్కి పరరాష్ట్రముల జేర్చి యింపుగాంచె/నంత నతడు హిందూస్థానమంత గెలిచి/ధనముగూర్చి యిస్లాముదనర జేయ/దలచి పలుమాఱు తమి మీద దాడి వెడలె..ఇట్లా అతడు కాబూలు వాడని తండ్రి తరువాత రాజై పొరుగువారిని జయించాడని, ఆ తర్వాత హిందూదేశాన్ని కొల్లగొట్టాలని దాడులు జరిపాడని మొదలవుతుంది. ఒక కథ చెప్పినట్లుగా చరిత్రను సవివరంగా చెప్పారు.
‘తక్తు’ అనేది మహమ్మదీయులు వాడుకునే మాట. గద్దెనెక్కె అని అర్థం. సింహాసనం అని మనవాళ్లు వాడుకునే మాటకు పర్యాయం వంటిది. సురవరం ఈ ఖండిక రాసేనాటికి నిజాం ప్రభుత్వమే నడుస్తున్నది. తక్తుపై నిజాం ఉన్నాడనేది సాధారణ వాడుక. అదే ఇందులో ప్రయోగించడం సాధారణ ప్రజలకు తెలియడం, ఇస్లాంల కథ కనుక వారి పదాన్నే ప్రయోగించడం ఒక ఔచిత్యం.
ఈ సుదీర్ఘ గీతమాలికలో దాదాపు 20 పంక్తుల్లో ఫిర్దోసి అనే కవి జీవితానికి సంబంధించినది. జాషువా రచించిన సుప్రసిద్ధ ఫిరదౌసి కావ్యం కన్నా తొమ్మిది సంవత్సరాలు ముందుగా దీనిని రాశారు.
సంపన్నుడైన రాజును కవులు ఆశ్రయించారు. అందులో ‘ఫిర్దోసి’ ఒకరు. ఆతనినే రాజు ఆదేశించాడు.. తన చరిత్రను కావ్యం గా రాయాలని. అందుకు పద్యానికొక అష్రఫీ ఇస్తానని వాగ్దానం చేశాడు.
ఘజ్నవీ ఫిర్దోసి కొక్క వాగ్దాన మిచ్చె
పద్యమున కొక్క యష్రఫీ వరుసనొసగ
అర్ధలక్ష పద్యంబుల నతడు వ్రాసి
పాదుషా మ్రోల నిలిచిన పలికె రాజు
‘ఓయి! ఫిర్దోసి యష్రఫీలొసగ జాల
వాని మారుగ రూప్యముల్ పరగ నిత్తు’..
ఇందులో అష్రఫీ అంటే బంగారు నాణేలు, రూప్యములు అంటే వెండి నాణేలు అని అర్థం. మోసం చేసిన రాజును నిందించి కవి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత ఒకనాడు మరో కవి ఫిర్దోసి రాసిన కావ్యంలోని పద్యాలను ఘజ్నవీ ముందు పాడి విన్పించాడు. అది విని అవి ఫిర్దోసీ పద్యాలని తెలుసుకొని ఆ కవికి చేసిన అన్యాయం దిద్దుకోవాలని భటులతో తానే కవి వద్దకు వెళ్లాడు. కానీ అప్పటికే ఆ కవి తనువు చాలించాడు. తాను తెచ్చిన ధనమంతా ఫిర్దోసి ఆత్మజులకు అందించాడు. కానీ చివరి కథలో గజనీ తనకు విజయాలను చేకూర్చిన అశ్వాలను, తాను సంపాదించిన ధనరాశులను, కోటబురుజులను చూసి వాటిని విడలేని దుఃఖాన్ని అనుభవించాడు. కన్నీరు కార్చి కార్చి మరునాడే యముని వద్దకు చేరుకున్నాడు.
కొద్దిభాగంలో కవి పరిస్థితిని ఆర్ద్రంగా రచించారు సురవరం. కానీ అనేక విజయాలను సాధించిన ఘజ్నవీ జీవితంలో తెచ్చిన పెనుమార్పులకు ఈ కవి కథ కారణమైంది. ఘజ్నవీ తన అశ్వాలను, ధనరాశులను, చూసి మురిసిపోయి, చరమదశలో వాటిని వదలలేని పరితాపానికి గురయ్యాడు. పరిపరివిధాల వేదనను అనుభవించాడు. అతని వేదన మాన్పించగల దక్షులెవరూ లేరు. కన్నీరు కార్చాడు. ఈ దృశ్యాన్ని కరుణరస స్ఫోరకంగా రాశారు సురవరం. ముగింపుగా ఒక సఅందించే చరణాలు రాశారు.
చావుబ్రతుకులు తిరుగును చక్రగతిని
‘సోక్రటీసేగె శేషించె సాత్వికంబు
‘సీజరేగి’నను ప్రతాపి శిఖలు వెలసె
‘కృష్ణరాయలు’ వెడలిరి కీర్తి మిగిలె
వీరి తనువులు మట్టిలో చేరిపోయె
మూఢబుద్ధిని గలిగె మహమూద నీకు
బియ్యమున నూలు గలిసిన
విధము చూవె
భూమిపై హెచ్చుతగ్గులు పొసగి యుండు
భువనముల నెల్ల సాధించి పూర్ణముగను
పావనాత్మను గోల్పోవ ఫలముగలదె’
యనెడి నీతికి లక్ష్యమై యవతరించి
తేమొ కాని నీ ఘనత యింకెందు గలదు?
ఎంత ప్రపంచాన్ని జయించినా పావనాత్మను, పవిత్రత లేని, నీతి ధర్మం పాటించని వారికి ఘనత ఏముంటుంది? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎంతటివాడైనా నీతి ధర్మం పాటించడమే లక్ష్యం కావాలనే మానవీయ సందేశం ఉంది. ఇది చారిత్రక ఖండ కావ్యం. ఇందులో ఫిర్దోసి (సురవరం ఇట్లే రాశారు, జాషువా ఫిరదౌసి అని వాడారు). కవికి, రాజుకు మధ్య జరిగిన కథ అయినా కవిని, రాజును వేదనకు గురిచేసిన ఘట్టం.
ఘజ్నవీ చరిత్ర విషాదాంతం. ఫిర్దోసి కథ విషాదాంతం. సోక్రటీసు, సీజరు, కృష్ణరాయలు పేర్లను సురవరం ప్రస్తావించడం ఆయనకు ప్రపంచ చరిత్ర పట్ల గల సమగ్రమైన అవగాహనకు సాక్ష్యం. పాశ్చాత్యుల నుంచి మన తెలుగు రాజుల వరకు అనే విస్తృతార్థం. కీర్తికారకమైన ఉత్తమ ధర్మాన్ని పాటించటమే పాలకుల లక్ష్యంగా అందించిన ప్రబోధం.
జాషువా ఫిరదౌసి కావ్యం కవిని కథానాయకుడుగా చేసింది. ప్రతాపరెడ్డి గజనీని కథానాయకుడిగా చేశారు. ఇందులో దేశం, మతం, పరస్పర దాడులు, విధ్వంసాలు ఒక భాగం చారిత్రకం కాగా, ఫిర్దోసి కవి సంఘటన చేర్చడం, అది రాజు పరిణామానికి కారణం కావడంగా మలచటం విశేషం.
ఈ కథ ముందు, వెనుకలుగా ఇద్దరు కవులు రాయడం వెనుక కవిజీవితం లోని విషాదమే ప్రధానం. రాజుల ఆస్థానాల్లో కవులు ఏ దేశంలోనైనా గౌరవం పొందుతారు. అవమానాలు ఎదుర్కొంటారు. అందులో ఇది అత్యంత ప్రసిద్ధమైన చారిత్రక ఘట్టం.
సురవరం రాసిన ఈ ఖండిక ఆంధ్ర ప్రాంతపు పత్రికలో అచ్చుకావడం వలన దానిని జాషువా చదివి ఉంటారా? అనేది తెలియదు. ముందు, వెనుకలుగా రాసినా ఎవరి కవితాపాకం వారిదే. ఎవరి రచనా పాటవం వారిదే. అయితే తెలుగునాట జాషువా ఫిరదౌసి ప్రచారం జరిగినంతగా సురవరం వారి ఫిర్దోసి ప్రచారంలోకి రాకపోవడం విచారించదగ్గ విషయం.
జాషువా ఫిరదౌసి కావ్యం కవిని కథానాయకుడుగా చేసింది. ప్రతాపరెడ్డి గజనీని కథానాయకుడిగా చేశారు. ఇందులో దేశం, మతం, పరస్పర దాడులు, విధ్వంసాలు ఒక భాగం చారిత్రకం కాగా, ఫిర్దోసి కవి సంఘటన చేర్చడం, అది రాజు పరిణామానికి కారణం కావడంగా మలచటం విశేషం.
– డా. గండ్ర లక్ష్మణరావు 98493 28036