సంస్కృత సాహిత్య ప్రపంచంలో ‘స్వప్న వాసవదత్తమ్’ ప్రసిద్ధి పొందిన నాటకం. అతి ప్రాచీన నాటకకర్త భాసుడు దీనిని రచించాడు. క్రీ.శ.1910 వరకూ భాసుడు నాటకకర్త అని తెలుసు. కానీ స్పష్టంగా ఏ నాటకాలను రాశాడో తెలియదు. మహామహోపాధ్యాయ టీ గణపతిశాస్త్రి (త్రివేండ్రం, కేరళ)కి భాసుడి నాటకాల తాళపత్రాలు లభించడంతో ఆయన పరిష్కరించి పదమూడు నాటకాలను గ్రంథంగా ‘భాసనాటక చక్రం’గా 1912లో ప్రకటించారు.
ఈ పదమూడు నాటకాల్లో ‘మధ్యమవ్యాయోగం’ నుంచి ‘ఊరుభంగం’ వరకు ఆరు నాటకాలను మహాభారత కథల ఆధారంగా ‘ప్రతిమా నాటకం’, ‘అభిషేక నాటకం’ అనే రెండు నాటకాలను రామాయణ కథల ఆధారంగా వత్సరాజు ఉదయనుడి చారిత్రక కథల ఆధారంగా ‘స్వప్న వాసవదత్తమ్’, ‘ప్రతిజ్ఞా యౌగంధరాయణమ్’ అనే రెండు నాటకాలను రచించాడు. సొంత ఇతివృత్తాలతో ‘అవిమారకం’, ‘చారుదత్తమ్’ నాటకాలను, ‘హరివంశం’లోని కథ ఆధారంగా ‘బాలచరిత్ర’ నాటకాన్ని భాసుడు రచించాడు. ‘సంస్కృత నాటక పిత’గా పేరు తెచ్చుకున్నాడు.
భాసుడి కాలం: క్రీ.పూ.350-283 కాలం వాడైన కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’లో భాసుడి ‘ప్రతిజ్ఞా యౌగంధరాయణం’ నాటకంలోని ‘నవంశరావం సలిలై..సుపూర్ణమ్’ అనే శ్లోకం కనిస్తున్నది. కనుక భాసుడు కౌటిల్యుడి కన్నా పూర్వుడై క్రీ.పూ.4వ శతాబ్ది పూర్వార్థంలో ఉండేవాడని చెప్పవచ్చు.
భాసుడి విశిష్టత-ప్రభావం: భాస నాటకాలు తర్వాత వచ్చిన సంస్కృత నాటకాలకు ఎదిగిన రీతులను నేర్పాయి. కాళిదాసు తన ప్రథమ నాటకం ‘మాళవికాగ్ని మిత్రం’ ప్రస్తావనలో ‘ప్రథితయశసాం భాస, సౌమిల్లక, కవిపుత్రాదీనాం’ అంటూ భాసుడి పేరును ప్రస్తావించి గౌరవించాడు. శూద్రకుడి ‘మృచ్ఛకటికం’ నాటకం భాసుడి ‘చారుదత్తమ్’ నాటకాన్ని విస్తరిస్తూ రాసినదే. శ్రీహర్షుడి ‘రత్నావళి’ నాటకం మీద, విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’ నాటకం మీద భాసుడి ప్రభావం కనిపిస్తుంది.
భాసుడి ‘స్వప్న వాసవదత్తమ్’: భాసుడి నాటకాల్లో ఈ ‘స్వప్న వాసవదత్తమ్’ అత్యుత్తమ రచన అంటారు. ఇది ఆరు అంకాల నాటకం. వత్స దేశ పరిపాలకుడు ఉదయనుడు ఇందులో నాయకుడు. అవంతీరాజు ప్రద్యోతుడి కూతురు వాసవదత్త ఇతని పట్టపురాణి. ఆమే ఇందులో కథానాయిక. ఆరుణితో జరిగిన యుద్ధంలో ఉదయనుడు ఓడిపోతాడు. ప్రధానమంత్రి యౌగంధరాయణుడు తమ రాజును తిరిగి చక్రవర్తిగా నిలపాలని అనుకుంటాడు. కానీ అది మగధ (రాజగృహం) రాజు దర్శకుడితో సంధి కలుపుకుంటే సాధ్యమవుతుంది. దర్శకుడి సోదరి పద్మావతిని ఉదయనుడు పరిణయమాడితేనే ఆ మార్గం సుగమమవుతుంది. అయితే, రాణి వాసవదత్తపై అమిత ప్రేమ గల ఉదయనుడు అందుకు ఒప్పుకోడు-కనుక యౌగంధరాయణుడు ఒక రహస్య పథకం వేసి, ఆ విషయాన్ని పట్టపురాణి వాసవదత్తకు చెప్తాడు. భర్త ఉదయనుడి శ్రేయోభివృద్ధులే ముఖ్యం కనుక ఆమె సమ్మతిస్తుంది.
ఉదయనుడు వేటలో ఉండగా యౌగంధరాయణుడు-లావాణక గ్రామ దహనంలో వాసవదత్త, ఆమెను కాపాడబోయిన ప్రధానమంత్రి యౌగంధరాయణుడు మరణించారని తానే వదంతి పుట్టిస్తాడు.
రాజును నమ్మించి వెంటనే రాణి వాసవదత్తతో కలిసి మారువేషాల్లో మగధకు చేరుకుంటారు. పరివ్రాజక వేషంలో ఉన్న యౌగంధరాయణుడు, అవంతిక పేరుతో మామూలు స్త్రీ వేషంలో ఉన్న రాణి వాసవదత్తను తన సోదరిగా-రాజు సోదరి పద్మావతికి పరిచయం చేస్తాడు. దేశాంతరం వెళ్లిన ఆమె భర్త వచ్చేవరకు రక్షణ కల్పించాలని ప్రార్థిస్తాడు. పద్మావతి అందుకు అంగీకరించి వాసవదత్తను తన సఖీజనంలో చేర్చుకుంటుంది.
కొద్దిరోజులకు ఉదయనుడు మగధ రాజ్యానికి చేరుకుంటాడు. రూపయౌవన గుణసంపన్నుడైన ఉదయనుడితో మగధరాజు దర్శకుడు తన సోదరి పద్మావతికి వివాహం జరిపిస్తాడు. ఒకనాడు ప్రమదావనంలో రాజు ఉదయనుడు విదూషకుడితో-తన మనస్సును వాసవదత్త వలె పద్మావతి ఆకర్షించడం లేదని అంటాడు. ఆ మాటను అక్కడే ఉండి, చాటుగా వినిన వాసవదత్త సంతోషిస్తుంది. పద్మావతికి శిరోవేదన కలుగుతుంది. శిరోవేదన ఉపశమనానికి పద్మావతి సముద్రగృహంలో ఉంటుంది. ఆమె అక్కడున్నదని తెలిసి ఉదయనుడు పరామర్శించడానికి వెళ్తాడు. అయితే, ఆమె అక్కడ లేకపోవడంతో సజ్జపై వాలి నిద్రలోకి జారిపోతాడు. పద్మావతిని చూడడానికి వచ్చిన వాసవదత్త-సజ్జపై పడుకున్నది పద్మావతియే అనుకుని పక్కనే కూర్చుంటుంది. స్వప్నదశలో ఉదయనుడు ‘వాసవదత్తా’ అని పిలుస్తాడు. వాసవదత్త-సజ్జపై పడుకుని ఉన్నది రాజు ఉదయనుడని తెలుసుకుని- అక్కడి నుంచి నైపుణ్యంగా వెళ్లిపోతుంది.
ఉదయనుడు స్వప్నం నుంచి మేల్కొని ఇపుడు వచ్చి వెళ్లినది వాసవదత్త అంటాడు. విదూషకుడు ఆమె మరణించినది కదా అని అనగా ఉదయనుడు వికలమనస్కుడవుతాడు.
మగధరాజు సహాయంతో రాజు ఉదయనుడు-ఆరుణిని ఓడించి రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. వాసవదత్త తండ్రి ప్రద్యోతనుడు రాజు ఉదయనుడిని అభినందిస్తూ..వాసవదత్త, ఉదయనుడి బొమ్మలున్న చిత్రఫలకాన్ని పంపిస్తాడు. పద్మావతి ఆ ఫలకాన్ని చూసి తన దగ్గర సఖిగా ఉన్న అవంతికయే వాసవదత్త అని తెలుసుకుంటుంది. అదే సమయానికి-పరివ్రాజక వేషధారి యౌగంధరాయణుడు వచ్చి తన సోదరిని అప్పగించమని అడుగుతాడు. తీసుకువచ్చిన అవంతికను చూసి ఉదయనుడు వాసవదత్తగా గుర్తించి ఆమె జీవించి ఉన్నదని ఆనందిస్తాడు. యౌగంధరాయణుడు-రాజు ఉదయనుడికి తన రహస్య పథకం గురించి చెప్పి క్షమించమని అడుగుతాడు. ఉదయనుడు-యౌగంధరాయణుడిని ప్రశంసించి వాసవదత్తను స్వీకరిస్తాడు. ఇదీ ఈ నాటకంలోని కథ! పండితాభిప్రాయం ప్రకారం-భాసుడి నాటకాల్లోని వర్ణనలు, సంభాషణాదులు సహజంగా, సందర్భోచితంగా ఉంటాయి.
‘ఇయం మే స్వసా&’ ఈమె నా సోదరి, దేశాంతరమేగిన ఈమె భర్త వచ్చేవరకూ కొంతకాలం రక్షింపవలసినది.. (యౌగంధరాయణుడు).
‘కాగతిః? మందభాగా, ఏషా గచ్ఛామి’? (మార్గమేముంది? అదృష్టహీనురాలినైన నేను వెళ్తున్నాను). (వాసవదత్త-ఆత్మగతం).
‘ఇత్థం సా రాజదారికా అభిబినాను రూపం ఖల్వస్యా రూపమ్’ ఈ విధంగా ఆ రాజకుమారి ఆమె రూపం వంశానికి తగినది కదా-(వాసవదత్త-స్వగతం).
‘హలా! భణభణ, కిం దర్శనీయః’ సఖీ, చెప్పు చెప్పు. చూడదగినవాడా? (వాసవదత్త) ఇట్లా ఈ నాటకంలోని సంభాషణలు-సందర్భోచితంగా, సరళంగా ఉన్నాయి. ఇంతేగాకుండా-‘దాస్యాపుత్రైః మధుకరైః పీడితోస్మి’ మూర్ఖములైన తుమ్మెదలతో పీడింపబడుతున్నాను’ వంటి విదూషకుడి సంభాషణలు హాస్యాన్ని పుట్టించి ఆహ్లాదపరుస్తాయి. ఇందులో గంభీర గమనం గల ‘ధీరస్యాశ్రమ సంశ్రితస్య వసతుష్టస్య వన్యైః ఫలైః’ అంటూ శార్దూల విక్రీడిత వృత్తం, ‘పరిహరతు భవాన్ నృపాపవాదమ్’ అంటూ పుష్ఫితాగ్రావృత్తం, ‘తీర్థోదకాని సమిధః కుసుమాని దర్భాన్’ అంటూ వసంత తిలకవృత్తమ్, ‘నైవేదానీం తాదృశాశ్చక్రవాకా నైవాప్యన్యే స్త్రీ విశేషైర్వియుక్తాః అని శాలినీ వృత్తం-ఇట్లా భాసుడు ఈ నాటకంలో వివిధ వృత్తాల్లో రచించాడు.
ఈ నాటకంలో ఉదయనుడి స్వప్నానికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ‘స్వప్న వాసవదత్తమ్’ అని పేరు పెట్టారు. ఇందులోని ఐదవ అంకం ఈ నాటకానికి హృదయం వంటిది, ప్రాణప్రదమైనది.
సముద్రగృహంలో ఉదయనుడు శయ్యపై పడుకోవడం, దీపపు కాంతిలో అవంతిక వేషంలోని వాసవదత్త అక్కడకు వచ్చి శయ్యపై పడుకున్నది పద్మావతి అని భ్రమించి, పక్కనే కూర్చోవడం, ఇంతలో ఉదయనుడు ‘హా! వాసవదత్తా!’ అని పలవరించడం, వాసవదత్త తన పొరపాటును గ్రహించి అక్కడి నుంచి తెలివిగా వెళ్లిపోవడం అందంగా, సహజంగా
చిత్రీకరించారు.
భాసుడు రసదృష్టితో చేసిన ఈ నాటక రచనలో క్లిష్టమైన కల్పనలు కనిపించవు. అతడి పాండిత్య ప్రకర్ష ఆధిపత్యం చేయదు. ప్రయత్న పూర్వక అనవసర సంభాషణలు ఇందులో లేవు. సంభాషణలు సరళంగా, సహజసుందరంగా ఉన్నాయి. క్రీ.శ.9వ శతాబ్దికి చెందిన ఆలంకారికుడైన రాజశేఖరుడు ‘భాస నాటక చక్రే పిచ్ఛేకైః క్షిప్తేః పరీక్షితుమ్’ అనే శ్లోకంలో చెప్పినట్లుగా ఈ ‘స్వప్న వాసవదత్తమ్’ నాటకం భాస మహాకవి నాటక రచనా ప్రతిభకు నికషోపలము!.
-రఘువర్మ (టీయల్యన్)
92900 93933