20వ శతాబ్దం మొదట్లోనే రేడియో పలికింది. ఎటువంటి తీగలు సాయం లేకుండా, యంత్రం మానవగళాన్ని ఇవ్వటమనేది తొలుత ఎంతో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో ప్రాధాన్యతను అర్థం చేసుకున్న దేశాలు ముందడుగు వేశాయి. తల్లి, తండ్రి, తోబుట్టువు, పక్క ఇంటి వ్యక్తి, టీచర్, పండితుడు చేసే పనులన్నింటినీ క్రమంగా రేడియో తీర్చటం మొదలైంది; అందుకే రేడియోకు ‘పర్సనల్ కంపానియన్’ అని కితాబిస్తారు.
హైదరాబాద్ సంస్థానాన్ని 1911-1948 మధ్యకాలంలో ఏలిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సైన్స్, టెక్నాలజీ పట్ల ప్రత్యేక ఆసక్తి, గౌరవం ఉన్న వ్యక్తి. విద్యుత్తు, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ వంటివి ఆయన పాలనలో ఏర్పడి ఎంతో ప్రాధాన్యత పొందాయి. వైర్లెస్ రేడియో ప్రవేశించి, ప్రాచుర్యం పొందుతున్న రోజుల్లోనే నిజాం తన దృష్టిని అటువైపు కూడా సారించి ‘దక్కన్ రేడియో’ ప్రారంభం కావటానికి తోడ్పడ్డారు. అంతకుముందు 1933లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి మహమ్మద్ అలీ ఉత్సాహంతో ఒక చిన్న రేడియో ట్రాన్స్‌మీటర్ వాడటం మొదలుపెట్టారని, క్రమంగా ఇది ఆదరణ పొందిందని తెలుస్తున్నది. ఈ సమాచారం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాకా వెళ్లటంతో ఆయన ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్తారు.
హైదరాబాద్ నిజామ్ 411 మీటర్లపై నడిచే 4/5 కిలోవాట్ల మీడియం వేవ్ కేంద్రం హైదరాబాద్‌లో, 319 మీటర్లపై నడిచే 250 వాట్ల మీడియం వేవ్ కేంద్రం ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ప్రాంతంలో కార్యాలయం ఉన్న ఈ హైదరాబాద్ కేంద్రాన్ని ‘దక్కన్ రేడియో’ అనటం పరిపాటి. నిజాం అభ్యర్థన మేరకు ఆలిండియా రేడియో సాంకేతికపరమైన సహకారాన్ని ఇచ్చింది. పోలీసు యాక్షన్ తర్వాత హైదరాబాద్ నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు ప్రకటన చేసినది కూడా ఈ దక్కన్ రేడియో, హైదరాబాద్ కేంద్రమే.
బ్రిటిష్ పాలనా కాలంలో హైదరాబాద్‌తో పాటు మైసూరు, తిరువాన్కూరు, బరోడా సంస్థానాలు రేడియో కేంద్రాలు ఏర్పాటయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ నాలుగు సంస్థానాల రేడియో కేంద్రాలు ఆలిండియా రేడియో వ్యవస్థతో కలిసిపోయాయి. ఈ నాలుగింటిలో హైదరాబాద్ సంస్థానపు దక్కన్ రేడియో మొదట ప్రారంభమైంది. ఎక్కువ కాలం ప్రసారాలు చేసింది కూడా ‘దక్కన్ రేడియో’ మాత్రమే.
దక్కన్ రేడియోలో ఉర్దూ ప్రధాన భాషగా ప్రసారాలు ఉన్నా తెలుగు, కన్నడ, మరాఠీ భాషల ప్రసారాలు కూడా కొనసాగేవి. ఈ దక్కన్ రేడియో నిజాం సమాచార అవసరాలు తీర్చుతూనే, బ్రిటిష్ వారికి అనుకూలంగా సాగుతూ ఉండేది. నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతూనే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు సాగేవి. ఏ ఇతర భారతీయ సంస్థానపు రేడియో కేంద్రానికి లేని పరిస్థితి దక్కన్ రేడియోకు ఉండేది.
ఈ రేడియో ప్రసారాలను విభేదిస్తూ, ఖండిస్తూ మరొక రేడియో కేంద్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం సరిహద్దున, బ్రిటిష్ ఇండియా అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని కర్నూలు పట్టణం నుంచి ‘భాగ్యనగర్ రేడియో’. నిజాం నిరంకుశత్వాన్ని ఎదుర్కోవాలని వనపర్తి రఘునాథరెడ్డి 1947లో రేడియో ట్రాన్స్‌మీటర్‌ను తీసుకువచ్చారు. జయప్రకాష్ నారాయణ్ తోడ్పాటుతో బొంబాయి నుంచి శక్తివంతమైన ట్రాన్స్‌మీటర్‌ను వనపర్తి రాజా రామేశ్వరరావు తెప్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా నడిచిన ఆజాద్ రేడియోకు సంబంధించిన ఒక ట్రాన్స్‌మీటర్ ఇదేనని భావిస్తారు.
పాగా పుల్లారెడ్డి (1919-2010) కీలక వ్యక్తిగా హైదరాబాద్ రాష్ర్టానికి సరిహద్దులో ఉండే కర్నూలు నుంచి ఈ రేడియో ప్రసారాలను నడిపించారు. జేగురుపాడు జమీందారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో ఈ ట్రాన్స్‌మీటర్‌ను రహస్యంగా ఉంచి, ఆయన కుమారులు జనార్దన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి దానిని పర్యవేక్షించేవారు. రజాకార్ల దురాగతాలు, హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉద్యమం, పోలీస్ యాక్షన్ గురించి ప్రతిరోజూ సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు మూడు భాషల్లో వార్తలు ఇచ్చేవారు. గొట్టుముక్కల కృష్ణమూర్తి వార్తలను సేకరించేవారు. తెలుగు వార్తల బాధ్యతను గడియారం రామకృష్ణ శర్మ, ఇంగ్లిష్ వార్తలను కే. వెంకటరెడ్డి, ఉర్దూ వార్తలను వకీలు నాగప్ప చూసుకునేవారు. భాగ్యనగర్ రేడియో వంటి ప్రయోగం మనదేశంలో ఎక్కడా జరుగలేదని చెప్పటం అతిశయోక్తి కాదు. మహాత్మాగాంధీ హత్య వార్తను ప్రసారం చేసి 1948 జనవరి 30న ఈ రేడియో తన ప్రస్థానాన్ని ముగించింది.
భారతదేశ రేడియో ప్రసార చరిత్రలో ఇటువంటి పోరాట చరిత్ర గల రేడియో కేంద్రం ఇది ఒక్కటే కావచ్చు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా సాగిన ‘ఆజాద్ రేడియో’ లేదా బ్రిటిష్‌వారు వ్యవహరించినట్టు ‘ఇల్లీగల్ రేడియో’ కొన్ని రోజులు మాత్రమే సేవలు అందించింది. ఆజాద్ రేడియోతో పోలిస్తే, భాగ్యనగర్ రేడియో ఏ రకంగా చూసినా ‘ఆర్గనైజ్డ్’గా సాగిందని చెప్పక తప్పదు. సమకాలీన సమాజ అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని తీర్చే రీతిలో సమాచారాన్ని వినోదంతో మేళవించి ఇవ్వటంలో వినుతికెక్కింది. విశిష్ట చరిత్ర కలిగిన దక్కన్ రేడియో, భాగ్యనగర్ రేడియో, ఆలిండియా రేడియో ఈ ప్రాంత గౌరవాన్ని ఇనుమడింపజేశాయి.
(వ్యాసకర్త: ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు)
-డా. నాగసూరి వేణుగోపాల్
9440732392