తెలుగు భాషాభిమాని, పుస్తక ప్రియుడు, మునగాల జమీందారు రాజానాయని వెంకట రంగారావు. ఆయనకు ఎనలేని సహకారం అందించిన కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిపూడి సోమనాథరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ స్థాపకుల్లో ముఖ్యులు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని ఒక ఉదాత్తమైన ఆశయసిద్ధి కోసం స్థాపించారు. దీని స్థాపన ఆనాడు చారిత్రక అవసరం. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుభాషా తల్లి ముద్దుబిడ్డలైన పై ప్రముఖులు 1901లో భాషా నిలయాన్ని స్థాపించారు.
హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల్లో 90% కంటే అధికుల మాతృభాష తెలుగు. అయినా అధికార భాషగా ఉర్దూ వారి నెత్తిమీద రుద్దారు. ఆ రోజుల్లో హైదరాబాద్ రాజ్యమంతటా ఉన్న పాఠశాలలు పదుల సంఖ్యలో ఉంటే మహా ఎక్కువ. ఇక కళాశాలలు వేళ్లమీద లెక్కపెట్టలిగినన్ని కూడా లేవు. అందువల్ల అతి కొద్దిమంది మాత్రమే చదువుకొనలిగే వారు. వారు కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదవాలి. తెలుగు ఎక్కడాలేదు. అలాంటి దయనీయమైన స్థితిలో ఉన్న తెలుగుభాష వికాసానికి ప్రాచుర్యానికి వెంటనే చర్యలు చేపట్టకపోతే, తెలుగు మృతభాషగా మారే ప్రమాదం మెండుగా ఉండేది.
కాకతీయుల కాలంలో, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉజ్వలంగా వెలిగిన తెలుగు మరుగున పడకుండా పునరుద్దీపన చేయడం ఆనాడు చారిత్రక అవసరం. అందువల్ల తెలుగుభాషకు మృత సంజీవినిగా, పట్టుగొమ్మగా భాషానిలయం వెలిసింది. ఆనాటి యువతకు మాతృభాష పట్ల మక్కువ పెంచింది. వారికి అన్ని విభాగాలకు చెందిన అనేక పుస్తకాలు అందుబాటులో ఉంచి వారిలో భాష పట్ల మమకారం, గౌరవం పెంచింది. వారి భాషా జ్ఞానతృష్ణను తీర్చి తెలుగును సజీవంగా ఉంచింది.
భాషా నిలయం స్థాపించి శతాబ్దం దాటింది. అయినా నేడు తెలుగుభాష దుస్థితి ఆనాటిలాగే ఉన్నది. తెలుగు నేర్చుకోవడానికి అవకాశం లేని కాలం నుంచి, తెలుగు నేర్చుకోవడానికి అవసరం లేని కాలానికి వచ్చాం. ఇది అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ సత్యదూరం కాదు. తెలుగు మాధ్యమాలు కరువైన ఈ రోజుల్లో తెలుగు భాష భవిష్యత్తును తలుచుకుంటే భయం వేస్తున్నది. మహోన్నతమైన సాహిత్యం ఉన్న సుసంపన్నమైన తెలుగుభాష పతనం తలుచుకుంటే ఆపుకున్నా ఆగని దుఃఖం ముంచుకువస్తున్నది.
ఇలాంటి గడ్డుకాలంలో కూడా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం భాషామతల్లి సేవలో ముందుండి తరిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం పేరును కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంగా మార్చారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆనాటికంటే ఇప్పుడే భాషానిలయం ఆవశ్యకత అధికమయ్యింది. పుస్తక పఠనం మీద ఆసక్తి ఉన్న వారికి మాత్రమేగాక, ఎంతోమంది కవులు, రచయితల అవసరాలు తీర్చి, వారిలో నూతనోత్సాహం నింపి వారి సృజనాత్మకతను పెంచి పోషిస్తున్నది. తెలుగులో సాహిత్య ప్రక్రియలను సజీవంగా ఉంచడానికి మహత్తర కృషి చేస్తున్నది.
పై విషయం నిరూపించడానికి మరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా స్వీయ అనుభవాన్నే క్లుప్తంగా చెప్తాను. నేను ఇప్పటిదాకా 17 నవలలు రాసాను. ఇందులో మలని బత్తి, రుద్రమదేవి, మహామంత్రి మాదన్న, ప్రజాజ్యోతి పాపన్న, కొమరం భీం, ప్రతాపరుద్రుడు లాంటి చారిత్రక నవలలు ఉన్నాయి.
చారిత్రక నవలకు పునాది పరిశోధన. ఈ పరిశీలనలో భాగంగా అనేక పురాతన నవీన గ్రంథాలను అధ్యయనం చేయాలి. అలా చదివితేనే చారిత్రక నవల చరిత్రకు దగ్గ్గరగా వస్తుంది. ఈ క్రమంలో నాకు కావలసిన పుస్తక సేకరణలో భాగంగా అనేక గ్రంథాలయాలు తిరిగాను. కొన్ని పుస్తకాలు మాత్రమే దొరికాయి. మరెన్నో దొరకలేదు. నేను నిరాశకి లోనయ్యాను. ఇక నా నవల ముందుకు సాగదని అనుకున్నాను. ఎడారిలో ఒయాసిస్సులా నాకు కనిపించింది శ్రీకృష్ణదేవరాయాంధ్ర తెలుగు భాషానిలయం. అక్కడ నాకు కావాల్సిన చాలా పుస్తకాలు లభించాయి. నా చారిత్రక నవలలు పూర్తయ్యాయి. అంటే, దానికి భాషానిలయమే కారణం. కాకతీయుల గురించి అనేక పుస్తకాలకు నిలయం ఈ భాషానిలయం. రుద్రమదేవి, మహామంత్రి మాదన్న, ప్రతాపరుద్రుడు లాంటి నవలలు విద్వాంసుల, విజ్ఞుల ప్రశంసలు అందుకున్నాయంటే భాషానిలయంలో నేను చదివిన పుస్తకాలే కారణం. ఆ పుస్తకాల వల్ల నా నవలలను చారిత్రక వాస్తవాలకు దగ్గరగా తీర్చిదిద్దలిగాను. ఒక విధంగా చెప్పాలంటే నా నవలలో అథారిటీ రావడానికి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయమే ముమ్మాటికీ కారణం. ఈ భాషానిలయం భవిష్యత్తులో ఎంతోమంది పాఠకులు, కవులు, రచయితలకు కల్పవృక్షంలా నిలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
(వ్యాసకర్త: ప్రముఖ రచయిత)
-ఎస్.ఎం.ప్రాణ్రావ్ ,8008950101