తెలుగు సినిమా పాటల సంకలనాల విషయానికి వస్తే, ప్రధానంగా, అగ్రశ్రేణి హీరో హీరోయిన్లకు సంబంధించిన హిట్ సాంగ్స్ లేదా ఘంటసాల, సుశీల, జానకి, బాలు మొదలగు ప్రసిద్ధ గాయకులకు చెందినవి లేదా గీత రచయితలు, సంగీత దర్శకుల పాటలను సంకలనం చేస్తుండటం పరిపాటి. అలాంటి సంకలనాలలో పాటల వివరాలు చాలావరకు తప్పుల తడకలనే చెప్పాలి.
దీనికి భిన్నంగా అలనాటి ‘శ్రీకృష్ణ లీలలు’ (1935) సినిమా మొదలుకొని 2013లో వచ్చిన ఆది శంకరాచార్య చిత్రం వరకు, అనగా 80 ఏండ్ల కాలంలో వచ్చిన తెలుగు సినిమాలలోని శ్రీకృష్ణునికి సంబంధించిన పాటలను అతి వ్యయప్రయాసలకోర్చి సేకరించి, ‘బృందావనమది అందరిది’ శీర్షికతో ఎస్.వి.నాగభూషణం ఒక అపురూప సంకలనం గ్రంథంగా ప్రచురించడం ముదావహం.
శ్రీకృష్ణునికి సంబంధించి అన్నమయ్య, క్షేత్రయ్య, మీరాబాయి మొదలగు వాగ్గేయకారుల కృతులతో పాటు అనేక సినీ కవులు రాసిన శ్రీకృష్ణ సంబంధిత గీతాలను చేర్చి నిజంగానే పాటల బృందావనంగా అందించారు. సినిమాల కోసమే కాకుండా ప్రైవేటుగా వెలువడిన శ్రీకృష్ణుడి గీతాలు పద్యాలను చివరగా చేర్చారు. ఒక విధంగా శ్రీకృష్ణ ‘గీత’ విజ్ఞాన సర్వసం అని చెప్పవచ్చు. శ్రీకృష్ణగాన పిపాసులకు నిస్సంశయంగా ఈ పుస్తకం గీతామృతమే! ఈ పుస్తకంలో శ్రీకృష్ణుని పాటలతో పాటు ఆయా సినిమాలలోని ఛాయాచిత్రాలు చేర్చడం అదనపు ఆకర్షణ.
‘తెలుగు సినిమాలలో శ్రీకృష్ణుడు’అనే అంశంపైన ఎవరైనా పరిశోధన ప్రారంభిస్తే ఈ పుస్తకం వారి పాలిట కల్పవృక్షమే అవుతుంది. ఈ పుస్తక రూపకల్పనలో సంకలనకర్త పడిన శ్రమ, తీసుకొన్న శ్రద్ధ, అణువణువున కనిపిస్తుంది. దీనికి సినీ విమర్శక భీష్మాచార్యుడనదగిన వి.ఏ.కె.రంగారావు ఆమోదిస్తూ రాసిన ముందుమాట పుస్తక విలువను తెలియజేస్తుంది.
అయితే ఎంతో జాగ్రత్తతో రూపొందించిన ఈ సంకలన గ్రంథంలో చాలా ప్రాచుర్యం పొందిన సినీ శ్రీకృష్ణ గీతాలు చోటుచేసుకోకపోవటం కాస్త నిరాశే కలిగిస్తుంది. ఉదాహరణకు.. శ్రీకృష్ణ కృష్ణ కృష్ణా గోపాల బాలకృష్ణా (వీరాంజనేయ 1967), కన్నెల వలపు వెన్నలు దోచే కన్నయ్య (గోవుల గోపన్న 1968), కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా (సప్తస్వరాలు 1969), చిటుకు చిటుకుమంటు (మంచిబాబాయ్ 1978), అందాలొలికే నందకిషోరుడు బృందావనిలో వెలిశాడు (పిల్లజమీందార్ 1979), యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమకథ (గౌరవం 1980)… ముఖ్యంగా పేర్కొనదగిన పాటలలో శరత్‌బాబు మాధవి నటించిన మూడు ముళ్ళబంధం (1980)లో సత్యం సంగీతంలో జానకి, శైలజ పాడిన సినారె గీతం ‘రాధాకృష్ణయ్యా, ఇటు రారా కృష్ణయ్యా!’ అలాగే ‘దేవత’ (1982) చిత్రంలో చక్రవర్తి సంగీతంలో సుశీల, శైలజ పాడిన ‘అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు, ఎవ్వరివాడమ్మా’ పాటలో దేవకి యశోదలు కృష్ణుని కోసం ఆరాటపడిన తీరు వ్యక్తమైంది. ఈ పాటలన్నీ ఎంతో ప్రజాదరణ పొంది, ప్రాధాన్యం సంతరించుకొన్న కృష్ణుడి సంబంధిత గీతాలే!
అలాగే శ్రీకృష్ణ విజయం, నా తమ్ముడు, అదృష్టవంతులు మొదలైన చిత్రాలలోని కొన్ని పాటలు చేర్చే అవకాశం లేకపోలేదు. ‘రావమ్మా మహాలక్ష్మి’ (ఉండమ్మా బొట్టూ పెడత) వంటి కొన్ని పాటలలో కృష్ణ శబ్దం తప్పితే సాహిత్యం వేరుగా ఉండటం వల్ల వీటిని చేర్చాల్సిన అవసరం అంతగా లేదు. ఈ మార్పులుచేర్పులు మలి ముద్రణ లో చోటుచేసుకుంటాయని ఆశించవచ్చు. శ్రీకృష్ణుని సేవించేవారు మొదలుకొని సినీ గీతాలను అభిమానించే ప్రతివారు కొని పదిలంగా దాచుకునే పుస్తకం ఇది.
(వ్యాసకర్త: సినీ, సాహిత్య విమర్శకుడు)
-డాక్టర్ వి.వి. రామారావు
98492 37663