జిలుగు వెలుగుల తెలుగు సాహిత్య ప్రపంచాన పండిత పామర జనరంజకంగా శ్రీమదాంధ్ర మహా భాగవతంను రచించిన ప్రజాకవి, భక్త కవి, సహజ పండితుడు బమ్మెర పోతనామాత్యుడు. వారు ‘శ్రీకైవల్య పథంబు చేరుటకునై చింతించెదన్’ అంటూ శ్రీమదాంధ్ర మహా భాగవత గ్రంథాన్ని
ఆరంభించారు.
ఒకప్పుడు పోతన పద్యం ఒకటన్నా రాని తెలుగువారు ఉండేవారు కాదనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. పోతన పద్యం ఒకసారి అలా వింటే చాలు.. ఇలా వచ్చేస్తుంది. అల వైకుంఠపురిలో అంటూ అలా అలా పోతన పద్య లోకాలలోకి వెళ్లి పోవచ్చని కొందరంటారు. పామరులు సైతం పోతన ‘నల్లనివాడు పద్మ నయనంబులవాడు… సిరికింజెప్పడు.. ఇందు గలడందు లేడని సందేహము వలదు.. కారే రాజులు రాజ్యముల్ గల్గవే..’ అంటూ పాడుకునేవారు.
నాడు బడుల్లోనే కాదు గుడుల్లోనూ ఏదో ఒక పోతన గారి భాగవత పద్యం వినపడేది. ఇక హరికథల్లో, బుర్రకథల్లో, ఒగ్గు కథల్లో పోతన పద్యం కళకళలాడుతుండేది. ఈ కాలంలో పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుకునేవారు సైతం పోతనగారి పద్యాలు కనీసం ఒక్కటన్నా చెప్పలేకపోతున్నారు. పద్యాలను పరీక్షలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే పురాణ కథలు తెలుసుకోవడానికి పద్యాలు ఎందుకండి? మామూలు భాషలోనే తెలుసుకోవచ్చు గదా? అని నేటి తరం విద్యార్థులు అధిక శాతం మంది అంటారు.
‘పద్యం తెలుగువారి ఆస్తి. పద్యం పాడుకోవడానికి బాగుంటుంది’ వంటి మాటలు సాహిత్య సభలలో చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కొందరు ఆధునికులు ‘ఆ.. పద్యాలు ఎవరికి అర్థమవుతాయండి. నేటి సైన్స్ అండ్ మ్యాథ్స్ అర్థం చేసుకోవడానికే పిల్లలకు సమయం సరిపోవడం లేదు అంటారు.
ఇలాంటి నేపథ్యంలో పద్యం చదవడం, అది రాయడానికి ఛందస్సును నేర్చుకోవడం ఇదంతా అవసరమా? అని కొంతమందికి అనిపిస్తుంది. ఇదిలా ఉంటే పద్యాల్లో కంద పద్యానికి చాలా నియమాలు ఉంటాయి. వాటితో కందపద్యం రాసినవాడే నిజమైన కవి అని పద్యకవులు అంటారు.
మహాకవి పోతన అనగానే సాహిత్య ప్రియులకు సర్వ లఘు కందపద్యం గుర్తుకువస్తుంది. అది..
అడిగెదనని కడు వడి జను
నడిగిన దను మగుడ నుడువనని నడయుడుగన్
వడి వడి జిడిముడి తడబడ
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్
శబ్దాలాంకార సొబగులతో సాగే ఈ పద్యం తెలుగు సాహితీవన మకరందం. పద్యాభిమానుల హృదయాలను పరవశింపజేసే అమృతసాగరోద్భవ లక్ష్మీ చిరు దరహాస కుసుమం.
అయితే ఈ పద్య మూలాల్లోకి వెళ్తే పోతనగారి గణిత పాండిత్యం ఎంత ఉన్నతమైనదో తెలుస్తుంది. ఆ ఉన్నత గణితాన్ని చక్కగా చెప్పగలిగితే నేటి విద్యార్థులు సైతం ఆకర్షితులవుతారు. పద్యం వైపునకు కదులుతారు.
కంద పద్యంలో చతుర్మాత్రా గణాలను వాడతారు. అవి నల, గగ, భ,జ,సలు. పోతనగారు పై పద్యంలో 2, 4 పాదాల చివర సగణం వాడి మిగతా గణాలన్నిటిని నలములను వాడారు. కంద పద్యానికి సంబంధించిన ప్రాస యతులను పాటించారు. బేసి గణ ధర్మాలను 6వ గణ ధర్మాన్ని పాటించారు.
కంద పద్యంను రెండు భాగాలుగా విభజిస్తే మొదటి భాగంలో మూడు గణాలతో ఒక పాదం, ఐదు గణాలతో ఒక పాదం ఉంటుంది. ఇలా ఒక్కొక్క భాగం 8 గణాలతో కంద పద్యంలో రెండు భాగాలు ఉంటాయి.
పోతన రాసిన సర్వలఘు కందంలో మొదటి పాదం.. 3 గణాలు నలములే. రెండవ పాదం అయిదు గణములలో 4 నలములు 1 సగణం 4+1 అలాగే మూడు నాలుగు పాదములు 3 4+1 ఆధునిక గణితాన మాత్రికా పద్ధతిన దీన్ని కిందివిధంగా రాయవచ్చు. (3 (4+1)) (3 (4+1)) మాత్రికల్లో ఈ సంఖ్యలను మూలకాలని అంటారు. ఇక్కడ 1,3 మూలకాలు ఒక రీతిలోనూ 2, 4 మూలకాలు ఒక రీతిలోనూ ఉన్నాయి.
కంద పద్యంను ఇలా కాకుండా కంద పద్య నియమాలకు అనుకూలంగా, నల, గగ, భ,జ,స అనే గణాలన్నింటిని వాడుతూ కంద పద్యం రాస్తే ఇలాంటి మాత్రికా గణితంలో కంద పద్యం ఇమడదు. అలా ఇమిడేటట్లు పోతనగారు సర్వలఘు కంద పద్యం రాశారు. ఇలా ఈ పద్య మాత్రికల సంకలన వ్యవకలన గుణ భాగహారాలు తదితర గణ మూలాలనుంచే మన మహర్షులు, కవన మూలాలెరిగిన మహానుభావులు బీజాక్షరాలను, తదితర గణాక్షరాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కవన ప్రపంచంలో మహాకవి కాళిదాసు కవిత్వంలోనూ, మహాకవి పోతన కవిత్వంలోనూ ఇంకా ఇలాంటి కొందరి మహానుభావుల కవిత్వంలోనూ కొన్ని బీజాక్షరాలు ఉన్నాయని కొందరు సాహితీ ఉపాసకులంటారు.
వేదవేదాంగ పురాణేతిహాస ప్రబంధాదులలోని మంత్ర బీజాక్షరాలు మాయలు కాదు. మర్మాలు కాదు అనేకానేక గణిత గుణ మూలాలు. ప్రకృతి, భాషాగణన ప్రసాదించిన గణిత మేధో విన్యాసాలు. మన పూర్వికులు గణిత సంబంధ విషయాలను సైన్స్ సంబంధ విషయాలను దైవాంశ తేజాలుగా భావించారు. అలా భావించడంలో తప్పు లేదు. ఎందుకంటే అవి దైవంలా శాశ్వతాలు. నిరంతరం పదుగురికి ఉపయోగపడే పరోపకార విజ్ఞాన గుళికలు.
ఆ గణిత మూలాలను తెలుసుకోవాలంటే వేద ఛందో మూలాల్లోకి వెళ్లాలి. అదీ ఆధ్యాత్మిక పథంలో, మానసిక వికాస కళాపథంలో కాక సశాస్త్రీయ పథంలో వెళ్లాలి. ఇక ఆధునిక గణిత శాస్త్రవేత్తలు మరో మార్గం ద్వారా ఇక్కడికే వస్తున్నారు. తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఇక్కడి గణితం కూడా చిన్న చిన్న మార్పులతో ఆధునిక గణిత ఛాయలతోనే ప్రకాశిస్తుంది.
మహాకవి పోతనగారు తమ భాగవతంలో కేవలం పురాణ కథలను చెప్పడానికే ప్రయత్నించలేదు. ఆయా పద్య లక్షణాల మూలల గణ చక్రాల నెరిగి పద్య ప్రయోగం చేశారు. గణంలోని గణిత చక్రాల స్వరూపాన్ని కొంత ఔపోసన పట్టారు. అంత మహోన్నత పద్య రచన చేశారు. ఆ గణ చక్రాలలోని గణిత చక్రాలను బహిర్గతం చేయగలిగే పోతనగారి గణిత సామర్యం సామాన్యం కాదనిపిస్తుంది.
ఇక ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, ‘అడిగెదనని కడు వడి జను…’ అను సర్వ లఘు కంద పద్య భాగంలో మొత్తం 8 గణాలుంటాయి. ఇలా పద్యంలో రెండు భాగాలుంటాయి. ఈ పద్యం లక్ష్మీదేవికి సంబంధించినది. ఇక్కడ 8 గణాలలో 8 మంది లక్ష్మీదేవులు అనగా అష్ట లక్ష్ములున్నారు. 8వ గణం చతుర్మాత్రా గణమైనప్పటికీ అది మూడక్షరాల గణం. దీని మాటు మహా పరమార్థం ఉంది అని ఇలా ఆధ్యాత్మికంగా ఎంతైనా చెప్పవచ్చును. ఇది ఆధ్యాత్మికవేత్తలను, సుకవులను, పద్యకవులను ఆనందింపజేస్తుంది కానీ విద్యా ప్రపంచానికి ఉపయోగపడదు. ఇలా పోతనగారి శ్రీమదాంధ్ర మహా భాగవతము లోతులకి వెళ్లిన కొద్దీ మహదానందం కలుగుతుంది. మహాకవి పోతనగారి మీద అభిమానం పెరుగుతుంది.
అయితే మహాకవి పోతనగారి గణిత గుణాలను తెలుసుకుంటే బ్రహ్మానందం కలుగుతుంది. ఇలాంటి మహాకవి పోతనను నేటి ప్రపంచానికి తెలియచేయగలిగితే ఆధునిక విద్యా ప్రపంచం సైతం పోతనను కళ్లకద్దుకోవడమే కాదు, వారిని తమ మెదడుకు అద్దుకుంటుంది.
– వాగుమూడి లక్ష్మీ రాఘవరావు 98494 48947