R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్‌రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ ఏర్పడింది. అక్కడే శరత్చంద్ర చటర్జీ, గురజాడ అప్పారావు నుంచి మగ్జీం గోర్కీ, టాల్‌స్టాయ్ దాకా ఎందరివో రచనలు చదివాడు. స్కూల్లో ఉన్నప్పటి నుండే నాటకాలంటే ఆయనకు అలవిమాలిన ఇష్టం. నాటకాల్లో వేషాలు వేసేవారు. ‘బాలపత్రిక’ లాంటి మాసపత్రికలకు కొన్ని తన పేరుతో, కొన్ని ‘గిరీశం’ అనే కలం పేరుతో రచనలు పంపేవారు. ఆ తరువాత కూడా ఈ రెండు పేర్లతో చాలా నవలలు, నాటికలు, గేయాలు రాశారు.
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ నుంచి ఇంజినీరింగ్‌లో మంచి మార్కులతో విద్యాసాగర్‌రావు ఉత్తీర్ణులయ్యారు. ఒకవైపు చదువుకుంటూనే, ఇంకోవైపు సాహిత్య సమ్మేళనాలు, నాటకాలు చూడటానికి వెళ్ళేవారు. ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లలో పాల్గొనేవారు. ఆలిండియా రేడియో ఆడిషన్లో సెలెక్ట్ అయి రేడియో నాటకాల్లో పాత్రలు చేసేవారు. రేడియో నాటకాలు రాసేవారు. తర్వాత కాలంలో ప్రముఖ సినీ నటుడిగా పేరొందిన ప్రభాకర్‌రెడ్డి సూర్యాపేట స్కూల్లో విద్యాసాగర్‌రావు సహవిద్యార్థి. కాలేజీలో ఉన్నప్పుడు నాటకాల పోటీలో వేర్వేరు కాలేజీల తరఫున ఉత్తమ నటులుగా వీరిరువురికి అవార్డులు వచ్చాయి.
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ నుంచి ఇంజినీరింగ్‌లో మంచి మార్కులతో విద్యాసాగర్‌రావు ఉత్తీర్ణులయ్యారు. ఒకవైపు చదువుకుంటూనే, ఇంకోవైపు సాహిత్య సమ్మేళనాలు, నాటకాలు చూడటానికి వెళ్ళేవారు. ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లలో పాల్గొనేవారు.
విద్యాసాగర్‌రావు గారు ఉద్యోగంలో చేరిన తరువాత కూడా రచనలు, నాటకాలు కొనసాగించారు. రాష్ట్రప్రభుత్వ ఇంజినీర్‌గా విధుల రీత్యా సైట్ మీదున్నా సరే, సాయంకాలం అయిందంటే రవీంద్రభారతికి, లేకపోతే వైఎంసీఏకు పరిగెట్టేవారు. ఇంజనీరింగ్‌లోనే ఇంకా ఉన్నతస్థాయి పోస్టులు తెచ్చుకోవాలి, విదేశాలకు పోవాలి, బాగా సంపాదించాలి అన్న ఆరాటం ఆయనలో ఉండేది కాదు. ఆ సమయంలోనే ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలోని సాంస్కృతిక, సాహిత్య సంస్థలు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆయన్ను ఆకర్షించాయి. అక్కడా మళ్ళీ సాహితీ సదస్సులు, నాటకాలు మొదలయ్యాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా తన ముక్కుసూటి ధోరణిని మార్చుకోలేదు. రాష్ట్రం నుంచి వచ్చే రాజకీయ నాయకులతో పరిచయాలు పెట్టుకొని సొంతపనులు చేయించుకోవాలని ఆలోచించేవారు కాదు. కానీ సాహితీసభల కోసం పెద్ద రచయితలు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య లాంటి కళాకారులు వస్తే వారిని రిసీవ్ చేసుకోవడం, వారికి సన్మానాలు చేయడంలో సంతోషం, తృప్తి వెతుక్కున్నారు. తెలుగు భాషా, సాహితీ, నాటక సంస్థల్లో పాల్గొనేవారు. అక్కడ అనేక నాటకాలకు రచన, దర్శకత్వం, నటన, నిర్వహణ అన్నీ తానే అయి వాటిని విజయవంతం చేశారు. అనేక జాతీయస్థాయి పోటీల్లో అవార్డులు, మన్ననలు పొందారు. రేడియో, దూరదర్శన్ సీరియల్స్, నాటకాలకు స్క్రిప్టులు రాశారు.
విద్యాసాగర్‌రావు గారు ప్రసిద్ధ ఇంగ్లీషు నవలలను పత్రికల కోసం అనువదించారు. సీరియల్స్, ‘ప్లస్-మైనస్’ లాంటి కవిత్వంతోపాటు ‘గంధర్వులే తీరుస్తారు’, ‘క్షంతవ్యులు’ వంటి మంచి నాటకాలెన్నో రచించారు. ఆయన మనస్సంతా ఎప్పుడూ రచనా వ్యాసంగం, నాటకరంగంవైపే ఉండేది. సెలవుల్లో ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చినప్పుడల్లా ప్రతిరోజు సాయంత్రం నాటక, సాహిత్యరంగానికి చెందినవారితో చర్చలు జరిపేవారు. వారితో కలిసి నాటకాలను చూసేవారు. సినిమా రంగంలో ఆయన స్నేహితులు ఆయనను ఒక భోజ్‌పురి సినిమాలో గాంధీ వేషం వేయాలని పట్టు పట్టి వేయించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో అది బాగా ఆడింది. దాన్ని తెలుగులో కూడా ‘భైరవి’ పేరుతో తీశారు. తర్వాత శంకర్ గారి ‘జై బోలో తెలంగాణ’లో, ‘దండు’, ‘దమ్ము’ తదితర సినిమాల్లో, అనేక లఘుచిత్రాల్లో నటించారు. విద్యాసాగర్‌రావు గారు రిటైరయ్యాక డైరెక్టరేట్ ఆఫ్ అడ్వైర్టెజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) వాళ్ళ వెయ్యి నాటకాల అనువాద కార్యక్రమంలో పాల్గొన్నారు.
నీళ్ల సారుగా తెలంగాణ ప్రజలకు చిరపరిచితులైన నీటిపారుదలరంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు గారికి నాటక, సాహిత్య రంగాలంటే ఎంతో మక్కువ. పదవీ విరమణ తరువాత విశ్రాంత జీవితాన్ని ఆ రంగాలలోనే గడపాలనుకున్నారు ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పూర్తి సమయాన్ని వెచ్చించకపోయి ఉంటే ఉత్తమ నాటక రచయితగా, సాహిత్యకారుడిగా కీర్తి శిఖరాలను అందుకునేవారు.
తెలంగాణ ప్రజలకు నీటి సమస్యలను సులువుగా వారికర్థమయ్యే విధంగా చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా పురికొల్పడంలో విద్యాసాగర్‌రావు గారు కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జనహృదయాల్లో ఒక జలవిజ్ఞాన నిధిగా, నీళ్ళసారుగా నిలిచిపోయారు. తనకున్న సాహిత్యాభిలాష, తెలుగు మీద ఉన్న పట్టు కారణంగానే తాను మాట్లాడగలుగుతున్నానని, పత్రికలకు ఆర్టికల్స్ రాయగలుగుతున్నానని, రచయితగా, నటుడిగా తనకు ఒక హోదా లభించిందని విద్యాసాగర్‌రావు గారు చెప్పేవారు.
సల్లా విజయకుమార్
(నవంబరు 14 ఆర్.విద్యాసాగర్‌రావు జయంతి)
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలంగాణ వచ్చాకే మహిళా ఇంజినీర్లకు మంచిరోజులు వచ్చాయి ..మహిళా చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి మనోగతం
kotha paluku | చెత్త పలుకుల ఆర్కే క్లోజ్డ్ హార్ట్.. బహుపరాక్!
వాళ్లది అంబేద్కర్‌కు అడ్డంపడిన చరిత్ర