సరిగ్గా 60 ఏండ్ల కిందట ఉమ్మడి ఏపీలోని పాఠ్య పుస్తకాల్లో పైడిమర్రి వేంకట సుబ్బారావు రాసిన ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞను ముద్రించారు. కానీ, రచయిత పేరును మాత్రం ముద్రించలేదు. రచయిత పేరు లేకుండానే 50 ఏండ్ల పాటు ప్రతిజ్ఞను పాఠశాలల్లో విద్యార్థులు ఆలపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే పైడిమర్రి వేంకట సుబ్బారావు వంటి మహనీయులకు గుర్తింపు లభించింది.
కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ అప్పటి తెలంగాణ ప్రభుత్వం పైడిమర్రి వేంకట సుబ్బారావు పేరును తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ప్రతిజ్ఞ ఎగువన చేర్చి ఆయనకు సముచిత ప్రాధాన్యాన్ని కల్పించింది. అంతేకాకుండా 5వ తరగతి telugu text booktelugu text bookలో ఆయన జీవిత వివరాలను పొందుపరచడమే కాకుండా, 2016లో పైడిమర్రి శతజయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించింది.
పైడిమర్రి గొప్ప దేశభక్తుడు. మంచి రచయిత. నీతి, నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి. గొప్ప వైద్యుడు. మానవతావాది. 1916, జూన్ 10న నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు. 1962లో విశాఖపట్నంలో జిల్లా ఖజానాధికారిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ రాశారు. 1965 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞగా ఆలపించబడుతున్నది. దేశానికి జాతీయ ప్రతిజ్ఞను అందించిన పైడిమర్రికి ఎటువంటి పురస్కారాలు దక్కలేదు.
తెలంగాణ ప్రభుత్వ స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కూడా 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆయన జీవిత వివరాలని పొందుపర్చింది. పైడిమర్రి జీవిత చరిత్రను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వీజీఎస్ ప్రచురణ సంస్థ ముద్రించి పుస్తక రూపంలోకి తెచ్చింది. పైడిమర్రి పేరుతో హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల పాఠ్యపుస్తకాల్లో పైడిమర్రి పేరును చేర్చవలసి ఉన్నది.
(ఆగస్టు 13న పైడిమర్రి వర్ధంతి)
– యం.రాంప్రదీప్ 94927 12836