ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి, నీతి, నిజాయితీకి ఆయన పెట్టింది పేరు. దళిత చైతన్యశీలి, సాంఘిక విప్లవజ్యోతి, గాంధీ ఆశయాలు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గుండెకు హత్తుకున్న మహోన్నత వ్యక్తి పుట్టపాగ మహేంద్రనాథ్. ఇంతటి గొప్ప వ్యక్తి జన్మించి నేటికి 100 ఏండ్లు కావస్తున్న సందర్భంగా ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
ఒకనాటి మహబూబ్‌నగర్ జిల్లా నేడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా జొన్నలబొగుడ గ్రామంలో 1926 జూన్ 10న పుట్టపాగ బాలమ్మ, మశన్న దంపతులకు మహేంద్రనాథ్ జన్మించారు. అతని తండ్రి తనకు చదువు రాదని బాధపడేవారు. దీంతో తాను బాగా చదువుకొని గొప్ప విద్యావంతుడు కావాలని మహేంద్రనాథ్లో చిన్ననాడే విద్యాబీజం పడింది. స్వగ్రామంలో పాఠశాల లేకపోవటంతో తన మేనమామ ఊరు కోడేరులో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. పట్వారీ చిక్కపల్లి రామచంద్రరావు ప్రోత్సాహంతో ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌లో ఆది హిందూ సమాజ్ సేవా హాస్టల్లో చేరి అష్రపుల్ మదరాసి అనే వస్తానియాల్ మిడిల్ పూర్తి చేసి ఆ తర్వాత బైతుల్ ఉల్మా అనే పాఠశాలలో చేరి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. అదే హాస్టల్లో విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా, అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆ తర్వాత హైకోర్టు నడిపే లా క్లాసులో డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత వకీలుగా ప్రాక్టీస్ చేస్తూ నాగర్‌కర్నూల్‌లో స్థిరపడ్డారు. న్యాయవాదిగా ఎంతోమంది భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూములకు పట్టాలు, రక్షిత కౌలుదారులకు భూయాజమాన్య పట్టాలు ఇప్పించడంతో అవిరళ కృషి చేశారు.
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉండేది. ఏ రంగాన్ని ఎంచుకున్నా చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతగా పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. నాగర్‌కర్నూల్ ప్రాంతంలో దళితులను సాంఘిక విప్లవంలో చైతన్యం చేసి, చదువు వైపు దృష్టి మళ్లించారు. ఆయన ఉపన్యాసాలు విని, ఆయన ఆదర్శాలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటంలో అన్ని కులాలవారు ముందుండే వారంటే అతిశయోశక్తి కాదు. న్యాయవాదిగా, విద్యాదాతగానే కాకుండా రాజకీయరంగంలో కూడా తనదైన ముద్ర వేశారు.
1952 ఎన్నికల్లో నల్గొండ నుంచి రావి నారాయణరెడ్డిపై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా 1957లో నాగర్‌కర్నూల్ నియోజవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1962 సార్వత్రిక ఎన్నికల్లో రెండవసారి ఇదే స్థానం నుంచి శాసనసభ్యునిగా భారీ మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో పేదలకు బంజరుభూములు, పేద విద్యార్థులకు ఉచిత విద్యావసతి, ఉపాధి, తాలూకా నిర్మాణ కార్యకర్తల సంఘం స్థాపించి మహాత్మా గాంధీ ఆశయ సాధనకు నిస్వార్థంగా పాటుపడ్డారు. మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.
అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిచారు. పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు ఎన్టీరామారావు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎన్నో మంత్రి పదవులను అలంకరించారు. మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం వినోబాభావే తలపెట్టిన ఉద్యమాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు భూస్వాములు స్వచ్ఛందంగా మిగులు భూములను పంచేలా తన వంతు పాటుపడ్డారు. రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు కొల్లాపూర్‌కు దగ్గర ఉన్న మొలచింతలపల్లిలో కృష్ణానది జలాలను మళ్లించి దిగువనున్న గ్రామాలకు తాగు, సాగునీరు అందించేందుకు చాలా కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను అంధకారంలోకి నెట్టిన అప్పటి పటేల్-పట్వారీ వ్యవస్థను సమూలంగా రద్దుచేయటంలో కీలక భూమిక పోషించారు. అశోక్ మెహతా కమిటీ సిఫారసులను అనుసరించి మండల వ్యవస్థను అమలుపరిచారు. ఇంతటి గొప్ప మహానాయకుని ఆశయాలు, ఆలోచనలను అమలుపరిచి ముందుకు తీసుకుపోవటమే ఆయనకు నిజమైన నివాళి.