వెడలి పోయే మేఘమా
వెనుతిరిగి చూడుమా
పచ్చ చేతులు పిలుస్తున్నవి
తెలుగు నేలను తాకమని
విరులు కురులను విప్పుకొని
విందులే అందించ నున్నవి
కడలి పంపిన నీటి కబురులు
దాటవేయకు నేస్తమా
బాటవెంటల బావుటా లై
పుడమి పుత్రికలూగుతుంటే
వన మయూరం పురులువిప్పీ ఆడుతుంటే
ఉరుముల కంజరలు మ్రోగించవా!
మెరుపుల కాంతివై మేనా ఎక్కిరావా!
తెలంగాణ గడపలన్నీ తరువుల చుట్టాలైనవి
చేలగట్లు చింతలేక చెట్లతో ఆడుతున్నవి
డ్రోన్ లు ఎగిరి విత్తులనే
విరివిగా వెదజల్లుతున్నవి
మట్టి రంగులు మాయమయ్యీ
పచ్చ రంగులు మెరుస్తున్నవి
వెనుదిరిగి చూడుమా
అంబర ఆప్త మిత్రమా
నీ రాకకై ఎదురు చూసే
హరితహారం పుచ్చుకొని
తెలంగాణ ‘పచ్చ’ల పేరు..
మట్టి మాణిక్యాలని చాటుమా
ఘాలి లలిత ప్రవల్లిక
96032 74351