ప్రాణ దీపంజీవితాన్ని ఉద్యమ జెండాలా మలచుకోవడం అందరివల్లా కాదు. నమ్మిన ఆదర్శాలకు కట్టుబడి నిలబడటం, కలెబడటం కూడా అందరికీ సాధ్యం కాదు. జ్ఞానానికి, ఆచరణకు మధ్య ఎదురయ్యే డోలాయమాన స్థితిలో పెను తుపానులను ధిక్కరిస్తూ ఆచరణ వైపు నిలబడటం కొందరికే సాధ్యమవుతుంది. అడుగడుగునా రేవును ముంచెత్తే తీరాలున్నా ద్వీపంలా నిలిచి ఉండటం స్థితప్రజ్ఞత గల వారికే సొంతమవుతుంది. తానూ సమాజమూ ఒకే ఇరుసు మీద నడిచే రెండు చక్రాలని సంభావించే విజ్ఞత కొందరిలోనే అంకురిస్తుంది. కల్లోల కాలాన్ని ఎరుకతో ఎదురీది జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకొని నిండైన భరోసా వాక్యంగా నిలబడటమే గాజోజు నాగభూషణ జీవిత సారం.
‘వంగడమంటూ వంట బట్టాక/ వెన్నెముక నిటారుగా నిలిచేదెట్లా/ లొంగడమంటూ మొదలయ్యాక/ నిన్నటి నిలదీతల పదునెక్కడ’ అని వంగిపోవడం, లొంగిపోవడం మొదలైతే నిలదీసే అవకాశాన్ని కోల్పోతామని తెలుసుకొమ్మంటాడు రచయిత. ‘ప్రశ్నే మన అస్తిత్వ రక్షణకు అమ్ములపొది/ ప్రశ్నతోనే ప్రజల సామూహిక చైతన్యం’ అనే సోయితో హేతువును వెన్నెముకగా చేసుకొని ప్రశ్నను ఆయుధంగా చేపట్టి కలంకారునిగా సాగిపోతున్న తేజోపుంజం గాజోజు కవిత. ‘మాట్లాడాల్సిన సమయంలో/ మౌనం ఒక పలాయనవాదం/ పోట్లాడాల్సిన సమరంలో/ వెనుకడుగు మరణంతో సమానం/ మనిషివి కదా మాట్లాడు/ వ్యక్తావ్యక్త శక్తులేవో/ నీ అస్తిత్వాన్ని అస్థిరపరుస్తున్న వేళ/ సజీవంగా మాట్లాడకపోతే/ రేపు నీ సమాధిలోంచైనా మాట్లాడక తప్పదు/ నిర్బంధం నిను మరణంలోనూ వెంటాడే నీడ’ అని నిబద్ధుడైన సమరవీరుని చివరిమాటల ఒరవడిని పరిచయం చేస్తాడు. మనిషి అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి పోరాటమే శరణ్యం తప్ప పలాయనం చిత్తగించడం కాదనే విప్లవ సారాంశాన్ని ఉపదేశిస్తుంది గాజోజు కవిత.
‘కన్నీటికి నిలువుటద్దం కవిత్వం/ కాలానికి సజీవ సాక్ష్యం కవిత్వం/ కష్టజీవుల చెమట నెత్తురుల సారం కవిత్వం/ కదనశక్తుల కరవాలం కవిత్వం’ (కవిత్వం ఒక తపస్సు) అని తాను ప్రజాపక్షం, కష్టజీవుల పక్షం, కాలానికి సాక్ష్యంగా కవిత్వమై నిలబడుతాననే యథార్థాన్ని నిష్ఠతో ప్రకటిస్తాడు. గాజోజు ఈ కవితా పోరాటం, ఉద్యమ ఆరాటం, నిలువెత్తు ఆచరణై నిలబడుతున్నది దేనికోసం? ‘యుద్ధానంతర శాంతి విలసిల్లే నేల కోసం/ యుద్ధమసలే కానరాని బుద్ధ భూమి కోసం’ అని జీవితాల్లో, సమాజంలో శాంతి విలసిల్లాలని, బౌద్ధ తాత్వికత విస్తరించి మానవ సమాజం సుభిక్షంగా ఉండాలని అతని కవిత చాటుతుంది. గాజోజు ఆశించినట్టుగా … ‘చీకటి పడగానే అనుకుంటాను/ రేపటి సూర్యుణ్ణి మళ్లీ చూస్తానని/ వేకువ కాగానే తలపోస్తాను/ వేదనలన్నీ నిన్నటి చిరునామాలేనని’ నేడున్న స్థితి నుంచి బయటపడి ఒక కొత్త లోకాన్ని చూడటానికీ బాటలు వేస్తుంది గాజోజు కవిత్వం.
పల్లె నుంచి అమెరికా దాకా ఆధిపత్యం ఎక్కడున్నా తుదముట్టించి పిడికెడు స్వేచ్ఛ కోసం పోరాడాలనే యుద్ధగీతం గాజోజు కవిత్వం. సహజ వనరులను, సంస్కృతినీ విధ్వంసం చేస్తున్న దమననీతిపై శర సంధానం గాజోజు కవిత్వం. సమాజాన్ని ప్రజాస్వామ్య లౌకిక బహుజన శ్రేయోరాజ్యంగా తీర్చిదిద్దుకోవాలనే తపన గాజోజు కవిత్వం. వర్తమాన జీవిత దృశ్యాన్ని కల్లోల సాగరం చేస్తున్న జాత్యహంకారాలు, కరోనా బీభత్సాలు, చెంచుపెంటలు, ఇంద్రవెల్లులు, ధర్నాచౌక్లు, రాతి చట్టాలు, కుల, మత విద్రోహాలకు నిరసన గాజోజు కవిత్వం. పిల్లలు, మహిళలు, రైతులు, సంచారులు, ఆదివాసీ సమూహాలతో పాటు ముంపు బాధితులు, వలస కార్మికులు, కూరగాయలమ్మే వాళ్లు, హోటల్ వెయిటర్లు, గారడీ విద్యతో పొట్ట పోసుకునేవాళ్లు, రాళ్లని రోళ్లు చేసి వీధుల్లో తిరిగే బాధాదగ్ధుల జీరగొంతు గాజోజు కవిత్వం.
జీవితం చుట్టూ అల్లుకున్న ఉద్యమ సహచరుల స్మృతిగీతాలు, చిన్ననాటి నుంచి పెంచి పోషించుకున్న చుట్టపు తీగలు, మరపురాని నోస్టాల్జియా సందర్భాలు, తెల్లారితే బడి ఒడిలో దర్శనమిచ్చే పచ్చి పాల నురుగుల అమాయకత్వాలు గాజోజు కవిత్వం. నవనీతం వంటి మానవీయ స్పర్శ, పున్నమ పూలు పూసే కరుణ రసార్ద్రత, ప్రకృతి ఒడిలో కదిలే గాలి తరగల సున్నితత్వం, ఏటిపాటల గలగలలు, జీవిత పరమార్థం కనుగొనే ప్రాణదీపం గాజోజు కవిత్వం.
-బూర్ల వెంకటేశ్వర్లు
94915 98040