‘పద్యం’పై ఆధిపత్య భావజాలం గలదనే విమర్శ ఉన్నది. పూర్వం రాజుల ఆశ్రయంలో, సామాన్యుల నోట ‘పద్యం’ మకుటం లేని మహారాజులా వెలుగొందింది. రాజాశ్రయం కోరని సామాజిక సమస్యలను పద్యకావ్యాలుగా రాసిన కవులను ప్రజాకవులుగా నిలబెడితే, రాజాశ్రయం పొందినవి కొన్ని మాత్రం సాహిత్య గుర్తింపును పొందాయి. పాల్కుర్కి సోమన, పోతన, వేమన, వీరబ్రహ్మం లాంటివారు పద్యాన్ని రాజాశ్రయాల నుంచి సామాన్య ప్రజానీకం వద్దకు చేర్చారు. పోతన భాగవతంలోని పద్యాలు నోట పలకని తెలుగువారుండరు. అలాగే వేమన, సుమతీ లాంటి మకుట శతక పద్యాలు తెలుగువారి మానసిక వికాసానికి, నీతి, లోకరీతిని తెలియజేయడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి.
తెలుగువాడి చేత 20వ శతాబ్దంలో పద్య నాటకాల రూపంలో ‘పద్యం’ వన్స్‌మోర్ కొట్టించుకున్నది. తిరుపతి వేంకటకవులు రాసిన పాండవోద్యోగం నాటకంలోని ‘బావా! ఎప్పుడు వచ్చితీవు…’ లాంటి పద్యాలు, భారత, రామాయణ, భాగవతాలకు సంబంధించిన నాటకాలలోని పద్యాలు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దాలుగా ప్రతిబింబించాయి. జంధ్యాల పాపయ్య శాస్త్రి, గుర్రం జాషువా లాంటి ఆధునిక కవులు పద్యాన్ని ఆరాధించడమే కాకుండా కుంతీ కుమారి, పుష్పవిలాపం, కష్టజీవి, గబ్బిలం లాంటి ఖండకావ్యాలను రాసి, తెలుగువారి మన్ననలను పొందారు.
ప్రాచీన కాలం నుంచి ‘పద్యం’ ప్రజల నరనరాల్లో నిద్రాణమై జీవిస్తున్నది. అలాంటి ‘పద్యం’పై మమకారం కలిగిన నేటికవులు శతక రచనలు, ఖండకావ్య రచనలు చేస్తున్నారు. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నా గద్యమంతా కవిత్వం కాదు. కానీ, తెలుగు సాహిత్యమంటే, కవిత్వమంటే ఒకప్పుడు పద్యమే!
కోమటి మధుసూదన్ ‘మధురగీతి’ పేరుతో ఖండకావ్య సంపుటిని 28 ఖండికలుగా రచించాడు. నేటి సమాజం పద్యాన్ని ఆదరిస్తుందా? అన్న ప్రశ్నకు ఈ పుస్తకంలో పద్యం హృద్యం అనే ఖండికలో పద్యం గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. పద్యం చదువడం వల్ల పలుకులో స్పష్టత వస్తుందని, పద్యం నేర్చుకోవడం వల్ల పద సంపద, జ్ఞాపకశక్తి పెరిగి, ఉపన్యాస శక్తి అలవడుతుందని, మనసు పరవశిస్తుందని, పద్యం రాయడం వల్ల నూతన పదజాలం సృష్టింపబడుతుందని అంటారు.
అమ్మ పద్య ఖండికలో…
‘నీ జన్మ కొరకు తానే
పోజాలును యముని తోడి పోరున కైనన్
ఈ జగతి నీకు చూపిన
నీ జననికి సాటి లేరు నిక్కము నరుడా!’
అన్న పద్యం తల్లి గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది.
నాన్న ఖండికలో…
‘నాన్న కన్న నెరుగ నారాయణుడు లేడు
కంటి రెప్పవలెను కాచునతడు
ఎంతసేవజేయ యేమితీరు ఋణము
కొంతనైన చేసి కొడుకు వగుము’
అనే సందేశం గొప్పగా ఉంటుంది.
గురువు ఖండికలో…
‘దేవదేవులైన దివ్య స్వరూపులు
రామకృష్ణ లకట రారె చదువ
ఎంత వారికైన యెదనుండు దైవమా
పాదపద్మములకు ప్రణతిజేతు’
అన్న పాదాలు గురువు స్థాయిని ఆకాశానికెత్తుతాయి.
అన్నదాత ఖండికలో..
‘ఎవని కరుణ లేని ఏకాకి రైతయ్యె
ప్రకృతి వైపరీత్య ఫలితమొకటి
బాధలెన్ని యున్న బాయడు సేద్యము
రైతుకెవరు సాటిరారు పుడమి’
అన్న పాదాలు రైతు దీనావస్థను తెలియజేస్తాయి.
కవి ఖండికలో…
కవిత జీవించు మనిషిలో కాలగతిని
తగిన సందర్భ మందున తలపు వెడలి
మదిని భావాలు
వివరించి మధురముగను
పాటయై గేయమై కాక పద్యమగుచు’
అంటూ ప్రతి వ్యక్తిలోనూ సందర్భానికి తగినట్టుగా కవిత్వం పుట్టుకొస్తుందని, అది పాట రూపంలోనో, గేయం రూపంలోనో, పద్యం రూపంలోనో ప్రతిఫలిస్తుందని అంటారు.
ఈ విధంగా కవి కోమటి మధుసూదన్ రాసిన ఈ మధురగీతి ఖండకావ్య సం పుటి నేటి సమాజం లోని ఎన్నో సమస్యలకు పరిష్కా రాన్ని చూపిస్తుంది.
– శీలం భద్రయ్య 98858 38288