తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే బాల సాహిత్యంలో ఇంటి భాషకు పట్టం కట్టి, తెలంగాణ మాండలిక పదాలతో బాలల కోసం అనేక కథలు రాసిన వారిలో పెండెం జగదీశ్వర్ ఒకరు. దశాబ్ద కాలం పాటు ఇంటి భాషలో కథలు రాస్తూ నూతన ఒరవడి సృష్టించారు. ఆయన పిల్లల మనసును గెలిచిన బాల సాహితీవేత్త. జగదీశ్వర్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రవృత్తి రీత్యా కార్టూనిస్టుగా, బాలల రచయితగా పనిచేశారు. రెండు తెలుగు రాష్ర్టాలలో అనేక కార్యశాలల్లో పాల్గొని ఎన్నో సృజనాత్మక రచనలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట సమీపంలోని కొమ్మాయిగూడెంలోని చేనేత కుటుంబంలో జన్మించిన పెండెం జగదీశ్వర్ గ్రామీణ జీవితాన్ని ఔపోసన పట్టి కనిపించిన ప్రతి విషయాన్ని వస్తువుగా మలిచి కథలు సృష్టించాడు.
చూసిన లేదా విన్న ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా మిత్రులతో చర్చించేవాడు. పెండెం జగదీశ్వర్ కథకుడు మాత్రమే కాదు, నిత్య బాలుడు కూడా. వివిధ సందర్భాల్లోనూ పిల్లలు మాట్లాడుకునే ఇంటి భాషలో చర్చిస్తూ ఉండేవాడు. స్వచ్ఛమైన తెలంగాణ మాండలిక పదాలతో పిల్లల కథలు రాయడంలో గెలిచి నిలిచినవాడు. కానీ, జీవితంలో స్వల్పకాలంలోనే ఓడిపోయిన విజేత మన జగదీశ్వర్.
తొలిరోజుల్లో తెలంగాణ భాషలో ఎంతోమంది రచయితలు పిల్లల కథలు రాశారు. అయినప్పటికీ నేటి తరంలో ప్రతిభావంతంగా జీవ భాషలో పిల్లల స్థాయికి అనుగుణంగా అనేక కథలు రాసి ఒక విలక్షణ శైలి సృష్టించారు పెండెం జగదీశ్వర్. మనకు తెలిసిన మన కథలను తెలంగాణ భాషలో చెప్పడంలో జగదీష్ చేయి తిరిగిన రచయిత. 1994 నుంచి బాల సాహిత్యంలో రచనలు చేస్తున్న ఇతను ఆంధ్రప్రదేశ్ జానపద కథలు దగ్గరి నుంచి ఆనంద వృక్షం, గజ్జెల దయ్యం, పసిడి మొగ్గలు, విడ్డూరాల బుడ్డోడు, నూట పదహారు నవ్వులు, తాను తీసిన గోతిలో, ముగ్గురు అవివేకులు, మాతో పెట్టుకోకు వంటి వివిధ పుస్తకాలు రాశారు. వైజ్ఞానిక దృక్పథంతో కూడా అనేక కథలు రాశారు. ఏ కథ చదివినా ముచ్చట పెడుతున్నట్టే అనిపిస్తది. పెండెం జగదీశ్వర్ కళాజాత బృందాల కోసం, నాటి వయోజన విద్యా ప్రచారం కోసం జన విజ్ఞాన వేదిక సభ్యునిగా హేతుబద్ధ దృక్పథంతో చిన్న చిన్న కథలు రాశారు. గజ్జెల దయ్యం పుస్తకంలో ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలు, భయాలపై లోతుగా ఆలోచింపజేశాడు. ఈ పుస్తకానికే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు బాల సాహిత్య పురస్కారం అందించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినంక జగదీశ్వర్ రాసిన బడి పిల్ల గాళ్ల కథలు ఇంటి భాషకు గొప్పగా పట్టం కట్టాయి. అదేవిధంగా విడ్డూరాల బుడ్డోడు కథలు కూడా బాగా ఆకర్షిస్తాయి. సరదాగా అనిపించే ఈ కథలు ఎదుగుతున్న బాల్యాన్ని పరిచయం చేస్తాయి. కష్టం, శ్రమ, గ్రామీణ జీవన సౌందర్యంలోని అంతరార్థం, పరమార్థం బాగా తెలిసినవాడు. అందుకే ప్రతి కథలో వాటిని ప్రతిబింబింపచేశాడు. జగదీశ్వర్ రాసిన అనేక కథల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. తెలంగాణ ఇంటి భాష మళ్లీ ఒక కొత్త వెలుగు కోసం ఆత్మగౌరవ దిశగా పయనిస్తున్న సమయంలో పెండెం రాసిన కథలు కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి.
తెలంగాణ యవనిక మీద బలమైన వాగ్దానాల సంతకాలు చేసిన అతడు అర్ధంతరంగా కనుమరుగైపోవడం అత్యంత విషాదకరం. వేల మంది విద్యార్థులకు, అనేకమంది మిత్రులకు ఆదర్శంగా నిలిచిన పెండెం సేవలు నిజంగా చిరస్మరణీయం. అందుకే ఆయన మరణానంతరం కూడా అతని ఆత్మీయులు, స్నేహితులు ఆయన రాసిన బాల సాహిత్యాన్ని బతికించేవిధంగా పెండెం జగదీశ్వర్ స్మారక బాలసాహిత్య పురస్కారం నెలకొల్పి ఏటా ప్రదానం చేస్తున్నారు. 2024కు గాను ప్రముఖ బాలసాహితీవేత్త సిద్దిపేటకు చెందిన గరిపెల్లి అశోక్ ఇటీవల పెండెం జాతీయ బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.
-కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
9441561655